Ichchapuram: ఇచ్ఛాపురం రూపురేఖలు మారుస్తాం: లీలారాణి
Ichchapuram: ఇచ్ఛాపురం మున్సిపాలిటీలో గెలిచిన 6 నెలల్లో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని, ట్యాంకర్ల దోపిడీకి చెక్ పెడతామని టీడీపీ చైర్పర్సన్ అభ్యర్థి లీలారాణి స్పష్టం.
Ichchapuram: ఇచ్ఛాపురం రూపురేఖలు మారుస్తాం: లీలారాణి
ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం మున్సిపాలిటీలో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. దశాబ్దాలుగా పేరుకుపోయిన సమస్యలు, పాలకుల నిర్లక్ష్యంపై విసిగిపోయిన పట్టణ ప్రజలు ఈసారి స్పష్టమైన మార్పు కోరుకుంటున్నారు. టీడీపీ చైర్పర్సన్ అభ్యర్థిగా లీలారాణి పేరు ఖరారైన నాటి నుంచి క్షేత్రస్థాయి సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే బెందాళం అశోక్ పక్కా వ్యూహంతో ముందుకు సాగుతుండగా, లీలారాణి మెరుపు వేగంతో వార్డు వార్డునూ చుట్టేస్తూ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎక్కడికెళ్లినా ప్రజలు, మహిళలు, యువత ఆమెకు నీరాజనాలు పడుతున్నారు.
ఈ సందర్భంగా లీలారాణి మాట్లాడుతూ.. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర ఉన్న ఇచ్ఛాపురం మున్సిపాలిటీ గత పాలకుల నిర్లక్ష్యం వల్ల తీవ్ర వెనుకబాటుతనానికి గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తెలుగుదేశం పార్టీ ఐదేళ్ల పాలనలోనే పట్టణానికి ఒక రూపు వచ్చిందని, ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్, వైఎస్సార్సీపీ ప్రభుత్వాలు పట్టణాన్ని పట్టించుకున్న పాపాన పోలేదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ట్యాంకర్లు శాశ్వత పరిష్కారం కాదు.. అది బిల్లుల దోపిడీ మాత్రమే!
ముఖ్యంగా 1, 2, 3, 4 వార్డుల్లో నేటికీ బిందెడు మంచి నీటి కోసం ప్రజలు అల్లాడుతుండటం మున్సిపాలిటీ దుస్థితికి నిదర్శనమని ధ్వజమెత్తారు. "ప్రజలకు కుళాయిల ద్వారా శాశ్వత తాగునీటి వ్యవస్థను ఏర్పాటు చేయకుండా, ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తూ లక్షలాది రూపాయల బిల్లులు దండుకోవడానికే గత పాలకులు ప్రాధాన్యత ఇచ్చారు. ట్యాంకర్ల సరఫరా ఎప్పటికీ శాశ్వత పరిష్కారం కాదు" అని కుండబద్దలు కొట్టారు. మున్సిపాలిటీలో డ్రైనేజీలు, నాలాల వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమై మురుగునీటితో ప్రజలు నిత్యం నరకం చూస్తున్నారని ఆరోపించారు.
ఆరు నెలల్లో మంచి నీటి సమస్యకు ముగింపు
తాము చైర్‌పర్సన్‌గా, బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రాధాన్యతా క్రమంలో సమస్యలను పరిష్కరిస్తామని లీలారాణి స్పష్టం చేశారు. "బాధ్యతలు చేపట్టిన ఆరు నెలల వ్యవధిలోనే తాగునీటి ఎద్దడి ఉన్న వార్డులతో సహా పట్టణ వ్యాప్తంగా తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతాం. ఇచ్ఛాపురాన్ని రాష్ట్రంలోనే ఒక ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం" అని భరోసా ఇచ్చారు. తనను అభ్యర్థిగా ఎంపిక చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రభుత్వ విప్ బెందాళం అశోక్, కూటమి శ్రేణులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
లీలారాణి వెంటే ప్రజలు.. మార్పు కోసం విద్యార్థులు, యువత
లీలారాణి నిత్యం జనంలో ఉంటూ, సామాన్యుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటూ సాగిస్తున్న ప్రచారం ప్రత్యర్థుల్లో దడ పుట్టిస్తోంది. స్థానిక ఎమ్మెల్యే బెందాళం అశోక్ క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేస్తూ వేస్తున్న రాజకీయ అడుగులు పూర్తి అనుకూల వాతావరణాన్ని సృష్టించాయి. "ఇన్నాళ్లూ పాలించిన వారికి బుద్ధి చెప్పాలి.. ఇచ్ఛాపురంలో మార్పు రావాల్సిందే" అంటూ పట్టణ ప్రజలు, విద్యావంతులు, యువత బహిరంగంగానే మద్దతు ప్రకటిస్తున్నారు. వార్డుల్లో లీలారాణికి లభిస్తున్న ప్రజాదరణ చూస్తుంటే ఈసారి ఇచ్ఛాపురం మున్సిపల్ పీఠంపై కూటమి జెండా ఎగరడం ఖాయమనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.




