Kondampeta: కొండంపేట లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు!

Kondampeta: రాజాం మండలం కొండంపేట లలిత కుమారి హత్య కేసును పోలీసులు ఛేదించారు. భార్య ప్రవర్తనపై అనుమానంతో భర్త సీతారామరాజే గొడ్డలితో హత్య చేసినట్లు సీఐ తెలిపారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 26 Oct 2026 11:10 AM IST
Kondampeta
X

Kondampeta: కొండంపేట లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు!

Kondampeta: లలిత కుమారి హత్య కేసులో ఆమె భర్త సీతారామరాజును పోలీసులు నిందితుడిగా గుర్తించారు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవని, భార్య ఇతరులతో సన్నిహితంగా ఉండటంపై భర్త అనుమానం పెంచుకున్నాడని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు సీఐ తెలిపారు.

మృతురాలు గతంలో వీరఘట్టంలో విద్యుత్ శాఖలో ఏఈగా పనిచేసిన సమయంలో మొదలైన విభేదాలు, అనంతరం రాజాం, చీపురుపల్లిలో ఉద్యోగ విధులు నిర్వహిస్తున్న సమయంలోనూ కొనసాగినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ విషయాలపై భార్యాభర్తల మధ్య తరచూ వివాదాలు జరిగేవని, పలుమార్లు ఆమె పుట్టింటికి వెళ్లిపోయేదని తెలిపారు.

శనివారం రాత్రి కూడా ఇద్దరి మధ్య గొడవ జరగడంతో ఆదివారం ఉదయం లలిత కుమారి ఇంటి నుంచి వెళ్లేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో భర్త ఆమెను అనుసరించి, ముందుగానే గొడ్డలిని కొనుగోలు చేసి తాను ఎంచుకున్న ప్రదేశంలోని పొదల్లో దాచిపెట్టినట్లు పోలీసుల విచారణలో వెల్లడైందని సీఐ తెలిపారు.

ఆమె అక్కడికి చేరుకున్న సమయంలో దాడి చేసి హత్య చేసిన అనంతరం, స్కూటీని ప్రమాదం జరిగినట్లు కనిపించేలా పడేసి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

కేసు దర్యాప్తులో భాగంగా సీసీ కెమెరాల దృశ్యాలు, డాగ్ స్క్వాడ్ సహాయం తీసుకున్న పోలీసులు, భర్త సమాధానాల్లో పొంతన లేకపోవడంతో అనుమానించి విచారించారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్నామని, కోర్టుకు హాజరుపరచనున్నట్లు సీఐ నవీన్ కుమార్ వెల్లడించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్