Ichchapuram: వీల్‌చైర్లు కరవు కావడంతో వృద్ధులు, దివ్యాంగుల అవస్థలు!
Ichchapuram: ఇచ్ఛాపురం మున్సిపాలిటీలో పోలింగ్ కేంద్రాల వద్ద వీల్‌చైర్లు కరవు కావడంతో వృద్ధులు, దివ్యాంగులు ఓటు హక్కు వినియోగించుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
Ichchapuram: వీల్‌చైర్లు కరవు కావడంతో వృద్ధులు, దివ్యాంగుల అవస్థలు!
Ichchapuram: ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని అధికారులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం వృద్ధులు, దివ్యాంగులకు అవస్థలు తప్పడం లేదు. ఇచ్ఛాపురం మున్సిపాలిటీ పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాల్లో కనీస సదుపాయాలు కల్పించడంలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారు.
పోలింగ్ కేంద్రాల్లో దివ్యాంగులు, నడవలేని వృద్ధుల కోసం వీల్‌చైర్లు, ప్రత్యేక ర్యాంపుల సౌకర్యం కల్పిస్తామని చెప్పిన అధికారులు ఆ విషయాన్ని పూర్తిగా గాలికొదిలేశారు. దీంతో తీవ్ర అనారోగ్యంతో ఉన్న వృద్ధులు, నడవలేని స్థితిలో ఉన్న ఓటర్లు పోలింగ్ బూతులకు చేరుకోవడానికి నరకయాతన అనుభవించారు. కుటుంబ సభ్యులు, బంధువుల సహాయంతో కొందరు ఎత్తుకుని తీసుకెళ్లగా, మరికొందరు చేతికర్రల సాయంతో ఒక్కో అడుగూ వేస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతూ ఓటు వేయడానికి వచ్చారు.
కనీసం కూర్చోవడానికి వీల్‌చైర్ కూడా లేకపోవడంతో పలువురు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అధికారుల తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది సైతం ఈ సమస్యను గమనించినా చేతులెత్తేయడం తప్ప ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేకపోయారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఓటింగ్ శాతం పెంచాలని ప్రచారం చేయడమే తప్ప, నడవలేని స్థితిలో ఉన్నవారికి కనీస సదుపాయాలు కల్పించకపోవడం ఎంతవరకు సమంజసమని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, తక్షణమే పోలింగ్ కేంద్రాల వద్ద వీల్‌చైర్లు అందుబాటులో ఉంచాలని స్థానిక ప్రజలు, దివ్యాంగులు డిమాండ్ చేస్తున్నారు.




