Ichchapuram: కూటమి ప్రభుత్వ వైఫల్యంపై బాహుదా నది ఒడ్డున వైసీపీ ధర్నా

Ichchapuram: బాహుదా నదిపై వంతెన పనులు చేపట్టకపోవడంపై ఇచ్ఛాపురం వైసీపీ ఇన్‌ఛార్జ్ సాడి శ్యాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో బాహుదా నది ఒడ్డున భారీ ధర్నా నిర్వహించారు.

Dharmavarapu Saikumar, Ichapuram
Published on: 11 Oct 2026 9:13 PM IST
Ichchapuram
X

Ichchapuram: కూటమి ప్రభుత్వ వైఫల్యంపై బాహుదా నది ఒడ్డున వైసీపీ ధర్నా

ఇచ్ఛాపురం: హామీలిచ్చి అధికార పీఠం ఎక్కిన కూటమి ప్రభుత్వం.. ప్రజల కష్టాలను గాలికొదిలేసిందని ఇచ్ఛాపురం నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ సాడి శ్యాంప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. బాహుదా నదిపై ప్రధాన వంతెన కూలిపోయి ఏళ్లు గడుస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారని ఆరోపించారు. వంతెన నిర్మాణ పనులను తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ శనివారం బాహుదా నది వద్ద పార్టీ శ్రేణులు, స్థానికులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా శ్యాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో బ్రిడ్జి కూలిన సమయంలో ప్రస్తుత కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, స్థానిక ఎమ్మెల్యే బెందాళం అశోక్ ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే కొత్త బ్రిడ్జి నిర్మిస్తామని చెప్పి, నేడు ఆ ఊసే ఎత్తకపోవడం సిగ్గుచేటన్నారు. పైగా గత వైఎస్సార్సీపీ హయాంలో ఈ వంతెన కోసం కేటాయించిన రూ.20 కోట్ల నిధులను రద్దు చేసి ప్రజలకు ద్రోహం చేశారని ధ్వజమెత్తారు.

బూటకపు జీవోలతో మోసం..

స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రజలను మభ్యపెట్టేందుకు రూ.19 కోట్లు మంజూరైనట్లు ఓ బోగస్ జీవోను తెరపైకి తెచ్చారని విమర్శించారు. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే పనులు ఎందుకు మొదలుపెట్టలేదని ప్రశ్నించారు. ఈ నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యేను వరుసగా మూడుసార్లు గెలిపిస్తే.. ఆయన ప్రజలకు మిగిల్చింది కష్టాలేనని ఎద్దేవా చేశారు.

ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం

బాహుదా బ్రిడ్జి లేకపోవడంతో విద్యార్థులు, అత్యవసర చికిత్స కోసం వెళ్లే రోగులు, వ్యాపారులు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల బాధలను ప్రభుత్వం పట్టించుకోకపోతే న్యాయపోరాటం చేస్తామని, బాహుదా బ్రిడ్జి నిర్మాణం కోసం న్యాయస్థానంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలు చేయనున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ వైఫల్యాలను, ఇచ్చిన హామీల డొల్లతనాన్ని ప్రతి ఇంటికీ వెళ్లి ఎండగడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.

Dharmavarapu Saikumar, Ichapuram

Dharmavarapu Saikumar, Ichapuram