Ichchapuram: జగన్నాథుని ఆలయంలో ఘనంగా వరుణ యాగం
Ichchapuram: ఇచ్చాపురంలోని జగన్నాథ స్వామి ఆలయంలో వరుణ యాగం నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బెందాళం అశోక్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
Ichchapuram: జగన్నాథుని ఆలయంలో ఘనంగా వరుణ యాగం
ఇచ్చాపురం: ఇచ్చాపురం నియోజకవర్గ ప్రజలు పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ ఇచ్చాపురంలోని ప్రసిద్ధ శ్రీ శ్రీ శ్రీ జగన్నాథ స్వామి వారి ఆలయంలో మంగళవారం నిర్వహించిన వరుణ యాగంలో , ప్రభుత్వ విప్, స్థానిక శాసనసభ్యులు బెందాళం అశోక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ నిర్వహించిన ప్రత్యేక పూజలు, పూర్ణాహుతి హోమాల్లో ఆయన భక్తిశ్రద్ధలతో పాలుపంచుకున్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. అర్చకులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేసి, వేద ఆశీర్వచనం పలికారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రకృతి కరుణించి విస్తారంగా వర్షాలు కురవాలని, రైతాంగం సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలందరిపై జగన్నాథ స్వామివారి చల్లని దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అధికారులు, మహాకూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, మరియు భక్తులు పాల్గొన్నారు.




