Ichchapuram: చైర్మన్ పీఠం కోసం టీడీపీలో ముదురుతున్న అంతర్గత పోరు!

Ichchapuram: ఇచ్ఛాపురం మున్సిపల్ చైర్మన్ పీఠం బీసీ మహిళకు కేటాయించడంతో టీడీపీలో ఆశి లీలారాణి, కాళ్ల ప్రియల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఎమ్మెల్యే అశోక్ కసరత్తు.

Dharmavarapu Saikumar, Ichapuram
Published on: 13 Oct 2026 6:53 PM IST
Ichchapuram
X

Ichchapuram: చైర్మన్ పీఠం కోసం టీడీపీలో ముదురుతున్న అంతర్గత పోరు!

ఇచ్చాపురం: సరిహద్దు నియోజకవర్గం ఇచ్చాపురం మున్సిపల్ రాజకీయం ఒక్కసారిగా భగ్గుమంది. మున్సిపాలిటీ చైర్మన్ పీఠం ‘బీసీ మహిళ’కు కేటాయిస్తూ నోటిఫికేషన్ వెలువడటంతో పట్టణంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోయాయి. ఎప్పటినుంచో ఈ పీఠంపై కన్నేసి, వ్యూహాలు రచిస్తూ వచ్చిన పలువురు సీనియర్ నాయకులు, బలమైన ఆశావహుల నెత్తిన ఈ నిర్ణయం పిడుగులా పడింది.

ఒక్క దెబ్బతో వారి ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ఈ అనూహ్య పరిణామంతో అసంతృప్తితో రగిలిపోతున్న నేతలను బుజ్జగించేందుకు ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే బెందాళం అశోక్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా సర్దుకుపోవాలని ఆయన నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ, అసంతృప్తి జ్వాలలు పూర్తిగా చల్లారలేదని సమాచారం. సీనియర్ నాయకుల పెదవి విరుపులు అలా ఉండగానే.. రాజకీయ విశ్లేషకులు మాత్రం “అసలైన పొలిటికల్ గేమ్ ఇప్పుడే షురూ అయింది” అంటూ విశ్లేషిస్తున్నారు.

రిజర్వేషన్ ఖరారైన నాటి నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రధానంగా ఇద్దరి పేర్లు బలంగా తెరపైకి వచ్చాయి. అందులో ఒకరు ఆశి లీలారాణి కాగా, మరొకరు కాళ్ల ప్రియ. ఈ ఇద్దరి చుట్టూనే ఇప్పుడు ఇచ్చాపురం తమ్ముళ్ల రాజకీయం తిరుగుతోంది. ఆశి లీలారాణి: పార్టీలో సుదీర్ఘ అనుభవం కలిగిన సీనియర్ నాయకురాలు. స్థానిక కేడర్ నుంచి రాష్ట్ర స్థాయి నాయకత్వం వరకు ఆమెకు ప్రత్యేక రాజకీయ గుర్తింపు, పరపతి ఉండటం ఆమెకు ప్రధాన బలం,

కాళ్ల ప్రియ: సీనియర్ నేత కాళ్ల ధర్మారావు కోడలు కాళ్ల ప్రియ పేరు ప్రస్తుతం జోరుగా వినిపిస్తోంది. ఆమెకు ప్రత్యక్ష రాజకీయ అనుభవం లేనప్పటికీ, ఉన్నత విద్యావంతురాలు కావడం, భర్త కాళ్ల జయదేవ్‌తో కలిసి సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకోవడం ఆమెకు ప్రధాన బలంగా మారాయి. సేవా దృక్పథం, క్లీన్ ఇమేజ్ ఆమెకు ప్రజల్లోనూ, పార్టీ శ్రేణుల్లోనూ సానుకూలత తెచ్చిపెడుతున్నాయి.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. జిల్లా టీడీపీ పెద్దలు, రాష్ట్ర నాయకులు కాళ్ల ప్రియ వైపు మొగ్గు చూపినట్లు ధర్మారావు వర్గం ధీమా వ్యక్తం చేస్తోంది. దీని వెనుక బలమైన సామాజిక సమీకరణాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇచ్చాపురం మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని బలమైన యాదవ సామాజిక వర్గానికి కేటాయిస్తే, రాబోయే రోజుల్లో నియోజకవర్గవ్యాప్తంగా పార్టీకి తిరుగులేని రాజకీయ మైలేజ్ లభిస్తుందనే లెక్కల్లో అధిష్టానం భావిస్తుంది అని సమాచారం .

ఒకవైపు సీనియారిటీ, పట్టు కోసం ప్రయత్నాలు.. మరోవైపు సామాజిక సమీకరణాలు, కొత్త తరం నాయకత్వం వైపు మొగ్గు.. వెరసి ఇచ్చాపురం మున్సిపల్ చైర్మన్ ఎంపిక టీడీపీలో రసవత్తరంగా మారింది. ఆశావహుల అలకలు తేలకముందే మొదలైన ఈ అంతర్గత పోరు చివరకు ఎటు దారితీస్తుందో, ఆ పీఠం ఎవరిని వరిస్తుందో చూడాలి!

Dharmavarapu Saikumar, Ichapuram

Dharmavarapu Saikumar, Ichapuram