Ichchapuram: ఇచ్ఛాపురం మున్సిపల్ చైర్మన్ పీఠం బీసీ మహిళకే రేసులో కీలక నేతలు!
Ichchapuram: ఇచ్ఛాపురం మున్సిపల్ చైర్మన్ పీఠం బీసీ మహిళకు కేటాయించడంతో వైఎస్సార్‌సీపీలో రేసులోకి కాళ్ల సాయివినీత పేరు. పట్టణ రాజకీయాల్లో ఆసక్తికర సమీకరణాలు.
Ichchapuram: ఇచ్ఛాపురం మున్సిపల్ చైర్మన్ పీఠం బీసీ మహిళకే రేసులో కీలక నేతలు!
ఇచ్చాపురం: ఇచ్చాపురం పురపాలక సంఘం చైర్మన్ పీఠం ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠకు ఎట్టకేలకు రిజర్వేషన్ ఖరారుతో ఒక స్పష్టత వచ్చింది. మున్సిపల్ చైర్మన్ పదవి ‘బీసీ మహిళ’కు కేటాయిస్తూ అధికారికంగా నోటిఫికేషన్ వెలువడటంతో పట్టణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
గత కొంతకాలంగా ఈ పీఠంపై కన్నేసి, వ్యూహాలు రచిస్తూ వచ్చిన పలువురు సీనియర్ నాయకులు, ముఖ్య నేతల ఆశలపై రిజర్వేషన్ ఖరారు పిడుగులా పడింది. అయితే, ఆశావహుల కలలు చెదిరినప్పటికీ.. అసలైన రాజకీయ చదరంగం ఇప్పుడే మొదలైందని స్థానిక రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. రిజర్వేషన్ ప్రకటనకు ముందు నుంచీ వైఎస్సార్‌సీపీ తరఫున మున్సిపల్ పీఠం కోసం బలమైన పోటీ నెలకొంది.
ప్రధానంగా పిలక రాజ్యలక్ష్మి, ఉల్లాల భారతి దివ్యల పేర్లు పార్టీ వర్గాల్లోనూ, ప్రజల్లోనూ గట్టిగా వినిపించాయి. స్థానికంగా ఉన్న బలం, పార్టీ పట్ల విధేయతను ఆధారంగా చేసుకుని ఈ ఇద్దరు నాయకురాళ్లు రేసులో ముందుంటారని అందరూ భావించారు.కానీ .రిజర్వేషన్ బీసీ మహిళకు ఖరారు కావడంతోనే ఈ రేసులోకి మరో బలమైన పేరు వచ్చి చేరింది. దివంగత కాళ్ళ దేవరాజు కోడలు కాళ్ళ సాయి వినీత పేరు ఇప్పుడు ఇచ్చాపురం రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
తమ కోడలికి మున్సిపల్ పీఠం దక్కేలా సీనియర్ నేత కాళ్ళ సత్యం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. కాళ్ళ కుటుంబానికి నియోజకవర్గంలో ఉన్న పట్టు, దేవరాజు పార్టీ కోసం చేసిన త్యాగాలు, రాజకీయ సేవల నేపథ్యాన్ని అధిష్టానం ముందుంచి టికెట్ దక్కించుకునేందుకు తెరవెనుక ముమ్మర ప్రయత్నాలు సాగుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఒకవైపు ముందు నుంచీ రేసులో ఉన్న పిలక రాజ్యలక్ష్మి, ఉల్లాల భారతి దివ్య.. మరోవైపు సరికొత్త సమీకరణాలతో రంగంలోకి దిగిన కాళ్ల సాయివినీత. దీంతో ఇచ్చాపురం వైసీపీలో మున్సిపల్ కుర్చీ పోరు రసవత్తరంగా మారింది. పార్టీ అధిష్టానం సీనియారిటీకి, విధేయతకు పట్టం కడుతుందా? లేక స్థానిక రాజకీయ పలుకుబడిని పరిగణనలోకి తీసుకుని కొత్త ముఖానికి అవకాశం ఇస్తుందా? అన్నది ఇప్పుడు పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. మున్సిపల్ పోరు మొదలవకముందే చైర్మన్ అభ్యర్థిత్వం కోసం సాగుతున్న అంతర్గత పోటీతో ఇచ్చాపురం రాజకీయం మరింత జోరెక్కింది.




