Ichchapuram: సముద్రంలోకి వెళ్లొద్దని మత్స్యకారులకు ప్రత్యేక అధికారి ఆదేశం!
Ichchapuram: శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పెషల్ ఆఫీసర్ పి. వేణుగోపాల్ విజ్ఞప్తి.
Ichchapuram: సముద్రంలోకి వెళ్లొద్దని మత్స్యకారులకు ప్రత్యేక అధికారి ఆదేశం!
Ichchapuram: తీవ్ర వర్షాలు, ఈదురు గాలుల ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో మండల ప్రజలు, ప్రత్యేకించి తీరప్రాంత వాసులు, మత్స్యకారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని మండల ప్రత్యేక అధికారి డిప్యూటీ కలెక్టర్ పి. వేణుగోపాల్ విజ్ఞప్తి చేశారు.
మండలంలో నిన్న అర్ధరాత్రి వరకు 33 మి.మీ, ఆ తర్వాత తెల్లవారుజాము వరకు మరో 19 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అని తెలియజేశారు. రాగల రెండు రోజుల్లో వర్ష తీవ్రత మరింత పెరిగే సూచనలు ఉన్నాయని, అందువల్ల తీరప్రాంత మత్స్యకారులు ఎవరూ ఈ నెల 26వ తేదీ వరకు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని ఆదేశాలు జారీ చేసినట్లు స్పష్టం చేశారు.
8 గ్రామాల్లో పునరావాస కేంద్రాలు మరియు 24 గంటలూ అందుబాటులో కంట్రోల్ రూమ్స్ ని చేయడం జరిగిందని తెలియజేశారు. తీరప్రాంతాల్లోని పూరిళ్లు, పాత భవనాల్లో నివసించే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని, ఇందుకోసం 8 గ్రామాల్లో ప్రత్యేక పునరావాస కేంద్రాలను (రిలీఫ్ సెంటర్స్) సిద్ధం చేసినట్లు వెల్లడించారు.
మండల స్థాయిలోనూ ప్రత్యేక కంట్రోల్ రూమ్ నిరంతరం అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. హెల్ప్‌లైన్ నంబర్లను ఇప్పటికే గ్రామ స్థాయికి చేరవేశామని, ప్రజలకు ఎలాంటి అత్యవసర సహాయం కావాలన్నా వెంటనే అధికారులను సంప్రదించాలని సూచించారు. బాహుదా, బగలహటి డామ్ ప్రాజెక్టుల వద్ద నిరంతర నిఘా
బాహుదా నది, బగలహటి ప్రాజెక్టు పరిస్థితిపై స్పందిస్తూ.. ప్రస్తుతం ప్రాజెక్టులో 40 శాతం నీటి నిల్వ ఉందని, కేవలం 500 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో మాత్రమే కొనసాగుతోందని తెలిపారు. అయితే ఎగువ ఒడిశా ప్రాంతాల్లో వర్షాల తీవ్రత పెరిగితే వరద నీటి ప్రవాహం (ఇన్‌ఫ్లో) అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉన్నందున ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అయితే రాగల రెండు మూడు రోజుల పాటు అత్యవసరమైతే తప్ప బయటకు రాకుండా సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని కోరారు.




