Srikakulam: సచివాలయ ఉద్యోగులపై కేసులు ఎత్తివేయాలని సిఐటియు డిమాండ్!

Srikakulam: సచివాలయ ఉద్యోగులపై బనాయించిన అక్రమ కేసులు, సస్పెన్షన్లను ఎత్తివేయాలని కోరుతూ శ్రీకాకుళంలో అంబేద్కర్ కూడలి వద్ద సిఐటియు ఆధ్వర్యంలో నిరసన ధర్నా చేపట్టారు.

Varaprasad, Staff Reporter -Srikakulam
Published on: 1 Oct 2026 8:58 AM IST
Srikakulam
X

Srikakulam: సచివాలయ ఉద్యోగులపై కేసులు ఎత్తివేయాలని సిఐటియు డిమాండ్!

Srikakulam: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, అక్రమ కేసులు, సస్పెన్షన్లను వెంటనే ఎత్తివేయాని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పి.తేజేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు సి.హెచ్.అమ్మన్నాయుడు, జిల్లా ఉపాధ్యాక్షలు కె నాగమణి డిమాండ్ చేశారు. స్వర్ణ గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధాన్ని ఖండిస్తూ అక్రమ కేసులు, సస్పెన్షన్లను వెంటనే ఎత్తివేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో అంబేద్కర్ కూడలి వద్ద నిరసన ధర్నా నిర్వహించారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులు నిర్వహించిన ఛలో విజయవాడ కార్యక్రమాన్ని భగ్నం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం శతవిధాల ప్రయత్నించిందని, ఎక్కడికక్కడ అరెస్టులు చేయించిందని, ముందుగానే అనుమతి కోరినా ఇవ్వలేదని అన్నారు. మహిళలని కూడా చూడకుండా కూటమి ప్రభుత్వం పాశవికంగా వ్యవహరించిందని, పోలీసులు వ్యానుల్లోకి విసిరేసారని అన్నారు. తీవ్ర దుర్భాషలాడుతూ, భౌతిక దాడికి పాల్పడింది.

వందలాది మందిని అరెస్టులు చేసి వివిధ స్టేషన్లలో కుక్కింది. కనీస మంచినీరు, ఆహారం కూడా ఇవ్వకుండా దుర్మార్గంగా వ్యవహరించిందని అన్నారు. అయినా ధర్నాచౌక్ లో మొక్కవోని దీక్షతో ధర్నాను జయప్రదంగా నిర్వహించిన ఉద్యోగులకు అభినందనలు తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులపై నిర్బంధ చర్యలను, అక్రమ సస్పెన్షలను, కేసులను ఉపసంహరించి సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

సమస్యల పరిష్కారం కోసం సచివాలయ ఉద్యోగులు ఐక్యంగా చేస్తున్న పోరాటాలకు సిఐటియు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నదని అన్నారు. సచివాలయ ఉద్యోగులు విజయవాడలో సమరశీలంగా నిర్వహించిన పోరాటంపై రాష్ట్ర ప్రభుత్వం అనేక తప్పుడు ఆరోపణలను చేసింది. ఉద్యోగులు కాని వారు పోరాటంలో ఉన్నారంటూ రకరకాల దుష్ప్రచారాలకు పాల్పడింది. ఇది సరైనది కాదని అన్నారు.

తమ అనుకూల మీడియాలోనూ విషప్రచారం చేయించిందని, పోరాటానికి ముందు రోజే ఇద్దరు నాయకులను అక్రమంగా సస్పెండ్ చేసిందని, ధర్నా అనంతరం 45 మందిపై అక్రమ కేసులు బనాయించిందని అన్నారు. ఉద్యోగ ఫ్రెండ్లీ ప్రభుత్వమని చెప్పుకుంటున్న టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వం న్యాయమైన సచివాలయ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకుండా తాత్సారం చేస్తున్నది.

ధర్నా అనంతరం మాత్రమే ప్రమోషన్లకు సంబంధించిన ఒక జీఓను విడుదల చేసింది. మిగిలిన సమస్యలను నేటికీ పరిష్కరించలేదు. ఉద్యోగులు కోరుకుంటున్న కోర్కెలు గొంతెమ్మ కోర్కెలు కాదు. ప్రతి రెగ్యులర్ ఉద్యోగులకు అమలు కావాల్సినవే. కానీ సచివాలయ ఉద్యోగులకు మాత్రం అమలు కావడం లేదని అన్నారు. ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్, నోషనల్ ఇంక్రిమెంట్లు, ప్రభుత్వం వల్ల ఆలస్యమైన ప్రొబెషన్ 9 నెలల కాలానికి అరియర్స్, తదితర డిమాండ్లన్నీ అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైన ఉందని అన్నారు.

జీఓ 5 పేరిట రేషనలైజేషన్ ప్రక్రియ ప్రారంభించి సచివాలయంలో ఉద్యోగుల సంఖ్యను కుదించి ఉన్న వారిపై పని భారాన్ని మోపింది కూటమి ప్రభుత్వం. దీనితో పాటు కొన్ని విభాగాల ఉద్యోగులకు అదనపు సచివాలయాల పనిని కేటాయించారు. ఈ జీఓ ను రద్దు చేయాలని నచివాలయ ఉద్యోగులు కోరుకుంటున్నారు. జీఓ 11 పేరిట అనేక రకాల సర్వేలతో సచివాలయ ఉద్యోగులను వేధిస్తున్నారు.

హెల్త్ సెక్రటరీలచే సచివాలయాల పని, దీనికి తోడు వైద్య, ఆరోగ్యశాఖకు సంబంధించి అనేక సర్వేలు, యాప్ లు భారం మోపారు. సచివాలయాల్లో పనిచేస్తున్న 4 లక్షల మంది వాలంటీర్లను తొలగించి వారు చేసే పనులన్నింటినీ సచివాలయ ఉద్యోగులే చేయాలన్న ఒత్తిడి గత రెండు సంవత్సరాల్లో పనిభారం పెంచారు. పెరిగిన పని ఒత్తిడి, వేధింపులతో సచివాలయ ఉద్యోగులు మానసిక వేదనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం నుండి స్పందన లేక పోవడంతో సచివాలయ ఉద్యోగులు రోడ్లకెక్కక తప్పలేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల సంఘ నాయకులతో వెంటనే చర్చించి వారి న్యాయమైన డిమాండ్లనన్నింటినీ పరిష్కరించాలని డిమాండ్ చేసారు. సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు చేసే పోరాటాలన్నింటికీ సిఐటియు పూర్తి అండదండలిస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు నాయుకులు మణికొండ.ఆదినారాయణమూర్తి, బండారు.మురళి, ఎం. గోవర్ధనరావు, ఆల్ పెన్షనర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు బొడ్డేపల్లి జనార్ధనరావు, ఐద్వా నగర కార్యదర్శి టి.ప్రవీణ, గ్రామ వార్డు సచివాలయం వైద్య ఆరోగ్య కార్యదర్శులు యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్. వెంకటలక్ష్మి, సి. హెచ్ రాధిక, వై ప్రభావతి వివిధ సంఘాలు నాయుకులు ఎన్.బాలరామ్, యల్. రామప్పడు, పి.సుధాకర్ పాల్గొన్నారు.

Varaprasad, Staff Reporter -Srikakulam

Varaprasad, Staff Reporter -Srikakulam

మూడు దశాబ్దాలకు పైగా (36 ఏళ్లు) సుదీర్ఘ అనుభవంతో, శ్రీకాకుళం జిల్లా రాజకీయ, సామాజిక పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.