Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో క్రమంగా తగ్గుతున్న బహుదా వరద ఉధృతి!

Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో బహుదా నది వరద ఉధృతి తగ్గుముఖం. వంశధార గొట్టా బ్యారేజీ వద్ద కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక. నాగావళిలో స్వల్పంగా పెరిగిన ప్రవాహం.

Varaprasad, Staff Reporter -Srikakulam
Published on: 30 Oct 2026 11:04 AM IST
Srikakulam
X

Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో క్రమంగా తగ్గుతున్న బహుదా వరద ఉధృతి!

Srikakulam: ఒడిస్సా సహా జిల్లాలో కూడా కురిసిన భారీ వర్షాలకు నదుల్లో పెరిగిన వరద ఉధృతిని జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. గురువారంతో పోలిస్తే బహుదా నది వరద తగ్గుముఖం పట్టగా, నాగావళిలో ప్రవాహం స్వల్పంగా పెరిగింది.

నిన్న నాగావళి నదిలో 40,000 క్యూసెక్కుల ప్రవాహం నమోదు కాగా, శుక్రవారం ఉదయం 10 గంటల నాటికి తోటపల్లి నారాయణపురం ఆనకట్ట వద్ద 47,900 క్యూసెక్కులకు, శ్రీకాకుళం పాత వంతెన వద్ద 48,500 క్యూసెక్కులకు వరద ప్రవాహం పెరిగింది.

అయితే ఇది ప్రమాద హెచ్చరిక స్థాయి కంటే తక్కువేనని అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు వంశధార నదిలో గొట్టా బ్యారేజీ వద్ద వరద ఉధృతి నిలకడగా కొనసాగుతోంది. ప్రస్తుతం బ్యారేజీకి 77,457 క్యూసెక్కుల వరద వస్తుండటంతో కుడి, ఎడమ కాలువలు మూసివేసి.. వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు వదులుతున్నారు.

దీంతో నిన్నటి నుంచి వంశధారలో అమలులో ఉన్న మొదటి ప్రమాద హెచ్చరిక శుక్రవారం కూడా కొనసాగుతోంది. అయితే కాట్రగడ సైడ్ వియర్ ద్వారా వంశధారలా నీటిని హిరమండలం రిజర్వాయర్ కి వరద నీటిని తరలించడానికి ప్రవాహం సరిపోతున్నది.

మరోవైపు ఇచ్ఛాపురం వద్ద బహుదా నది వరద ఉధృతి గణనీయంగా తగ్గడం జిల్లా యంత్రాంగానికి, ప్రజలకు ఊరటనిస్తోంది. నిన్న ఈ నదిలో ఏకంగా మూడో ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి 79,820 క్యూసెక్కుల మహోగ్ర వరద ప్రవహించగా, ఈరోజు ఉదయం 10 గంటల నాటికి అది 60,297 క్యూసెక్కులకు పడిపోయింది.

వర్షాలు తగ్గడంతో వరద సాధారణ స్థితికి వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో గురువారం వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ చెప్పారు. ఆయన అంచనా వేసినట్లుగానే బహుదాలో వరద తగ్గుముఖం పట్టింది.

నదుల్లో ప్రవాహం ఇంకా కొనసాగుతున్నందున తీర ప్రాంత, లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ కాలువలు, నదుల వద్దకు చేపల వేటకో, స్నానాలకో వెళ్లరాదని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ విజ్ఞప్తి చేశారు.

Varaprasad, Staff Reporter -Srikakulam

Varaprasad, Staff Reporter -Srikakulam

మూడు దశాబ్దాలకు పైగా (36 ఏళ్లు) సుదీర్ఘ అనుభవంతో, శ్రీకాకుళం జిల్లా రాజకీయ, సామాజిక పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.