Ichchapuram: అర్నాబ్ తుఫాను ధాటికి ఇచ్చాపురంలో జలదిగ్బంధం!

Ichchapuram: శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో అర్నాబ్ తుఫాను బీభత్సం. లొద్దపుట్టి గ్రామంలో ఇళ్లలోకి చేరిన వరద నీరు. కరెంట్ లేక బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్న బాధితులు, సాయం కోసం విజ్ఞప్తి.

Dharmavarapu Saikumar, Ichapuram
Published on: 29 Oct 2026 6:39 AM IST
Ichchapuram
X

Ichchapuram: అర్నాబ్ తుఫాను ధాటికి ఇచ్చాపురంలో జలదిగ్బంధం!

Ichchapuram: ఇచ్చాపురం -తీవ్ర తుఫాను ‘అర్నబ్’ ప్రభావంతో ఇచ్చాపురం మండలంలో పరిస్థితి దయనీయంగా మారింది. మండల వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి.

భారీగా వచ్చి చేరుతున్న వరద నీటితో ఎటుచూసినా చెరువులను తలపించేలా దృశ్యాలు కనిపిస్తున్నాయి. లొద్దపుట్టి గ్రామంలో వరద ఉధృతి తీవ్ర రూపం దాల్చింది. వరద నీరు ఒక్కసారిగా గ్రామాన్ని ముంచెత్తడంతో ఇళ్లలోకి మోకాళ్ళ లోతు నీరు చేరింది. బియ్యం, నిత్యావసర సరుకులు, బట్టలు, ఇతర గృహోపకరణాలు పూర్తిగా తడిసి ముద్దయ్యాయి.

కనీసం ఉండటానికి పొడి నేల లేక, వండుకోవడానికి తిండి లేక గ్రామస్తులు చిన్న పిల్లలు, వృద్ధులతో కలిసి బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో చీకట్లోనే భయాందోళనల నడుమ రాత్రంతా జాగారం చేయాల్సి వచ్చిందని బాధితులు కన్నీటిపర్యంతమవుతున్నారు.

వరద ఉధృతి ఇంకా తగ్గుముఖం పట్టకపోవడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. నీటిమట్టం క్రమంగా పెరుగుతుండటంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సాయం కోసం ఎదురుచూస్తున్నారు.

అధికారులు వెంటనే స్పందించి సహాయక చర్యలు ముమ్మరం చేయాలని, తమను సురక్షిత ప్రాంతాలకు తరలించి తాగునీరు, ఆహార పొట్లాలు అందించాలని స్థానిక బాధితులు వేడుకుంటున్నారు. ప్రజాప్రతినిధులు, విపత్తు నిర్వహణ బృందాలు తక్షణమే రంగంలోకి దిగి ఆదుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

Dharmavarapu Saikumar, Ichapuram

Dharmavarapu Saikumar, Ichapuram