Sachin Tendulkar: నాలుగు ఎకరాల భూమి కొన్న సచిన్.. ధర ఎంతో తెలుసా?
Sachin Tendulkar: సచిన్ తెందుల్కర్ లోనావాలాలో రూ.70 కోట్లతో 3.86 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. సెప్టెంబర్ 4న ఈ రిజిస్ట్రేషన్ పూర్తయింది.
Sachin Tendulkar: నాలుగు ఎకరాల భూమి కొన్న సచిన్.. ధర ఎంతో తెలుసా?
Sachin Tendulkar: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ రియల్ ఎస్టేట్ రంగంలో భారీ పెట్టుబడి పెట్టారు. మహారాష్ట్రలోని ప్రముఖ హిల్ స్టేషన్ లోనావాలాలో సుమారు 3.86 ఎకరాల అత్యంత ఖరీదైన భూమిని రూ.70 కోట్లకు కొనుగోలు చేశారు. రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ 'జాప్‌కీ' (Zapkey) వెల్లడించిన ఆస్తి రిజిస్ట్రేషన్ వివరాల ప్రకారం, ఈ లావాదేవీ సెప్టెంబర్ 4న మూడు వేర్వేరు కన్వేయన్స్ డీడ్‌ల ద్వారా పూర్తయినట్లు తెలిసింది. నందన్ ధనంజయ్ మెహతా, వివస్వత్ ధనంజయ్ మెహతాల నుంచి సచిన్ ఈ భూమిని కొనుగోలు చేశారు.
పుణె జిల్లా లోనావాలాలోని హెచ్ వార్డ్‌లోని నాలుగు సిటీ సర్వే నంబర్ల పరిధిలో మొత్తం 1.68 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఆస్తి విస్తరించి ఉంది. ఇందులో సుమారు 3.09 ఎకరాల భూమిపై సచిన్‌కు పూర్తి యాజమాన్య హక్కులు దక్కగా, దాని పరిధిలో 2,100 చదరపు అడుగుల నిర్మాణం కూడా ఉంది. అదనంగా, మరో రెండు స్థలాల్లో 50 శాతం భాగస్వామ్య వాటాను సచిన్ సొంతం చేసుకున్నారు. ఈ కొనుగోలుకు సంబంధించి సచిన్ తెందుల్కర్ స్టాంప్ డ్యూటీ కింద ఏకంగా రూ.4.20 కోట్లు చెల్లించినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
మొత్తం లావాదేవీ విలువను విశ్లేషిస్తే సగటున చదరపు అడుగుకు రూ.4,168 చొప్పున లెక్కగట్టారు. ముంబై, పుణె నగరాలకు చెందిన వ్యాపారవేత్తలు, ప్రముఖుల సంపన్నమైన సెకండ్ హోమ్ డెస్టినేషన్‌గా లోనావాలా గుర్తింపు పొందింది. ఇప్పటికే ముంబైలోని బాంద్రా ప్రాంతంలో అత్యంత విలాసవంతమైన బంగ్లా కలిగిన సచిన్, తాజా లావాదేవీతో తన రియల్ ఎస్టేట్ పోర్ట్‌ఫోలియోను మరింత బలపరిచారు.




