పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు భారీ ఎదురుదెబ్బ.. బ్రాడ్‌కాస్టింగ్ హక్కులను పట్టించుకోని కంపెనీలు!
పాకిస్థాన్ క్రికెట్ జట్టు పేలవమైన ప్రదర్శన, పీసీబీ విధానాల కారణంగా బ్రాడ్కాస్టర్లు ఎవరూ టెండర్లకు ముందుకు రాలేదు. కేవలం సగం ధరకే ప్రభుత్వ పీటీవీ ఛానెల్ ఈ హక్కులను దక్కించుకుంది.
పాకిస్థాన్ క్రికెట్ పరిస్థితి ఆటపరంగానే కాకుండా, ఆర్థికంగానూ మరింత దిగజారిపోతోంది. వరుసగా సారథులను మార్చడం, తుది జట్టు ఎంపికలో సరైన పద్ధతి పాటించకపోవడం, కోచింగ్ బృందంపై తరచూ వేటు వేయడం వంటి పరిణామాలు ఆ జట్టును కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. దీనికి తోడు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) తీసుకుంటున్న కొన్ని విచిత్రమైన నిర్ణయాలు బ్రాడ్కాస్టర్లను తీవ్ర ఆలోచనలో పడేశాయి. ఫలితంగా పాక్ జట్టు ఆడే మ్యాచులను ప్రసారం చేసేందుకు ప్రముఖ ప్రసార సంస్థలు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు.
బిడ్డింగ్‌లో చుక్కెదురు:
టెండర్లకు స్పందన కరువు: స్వదేశంలో జరగాల్సిన 25 మ్యాచులను బ్రాడ్‌కాస్టింగ్ చేసేందుకు పీసీబీ టెండర్లను ఆహ్వానించింది. అయితే గతంలో మాదిరిగా ఆసక్తి కలిగిన సంస్థలు ఒక కన్సార్టియంగా కలిసి బిడ్ వేయడానికి బోర్డు అనుమతించలేదు.
వెనక్కి తగ్గిన బ్రాడ్కాస్టర్లు: నిబంధనల కారణంగా ప్రముఖ బ్రాడ్కాస్టర్లు విడివిడిగా పాల్గొనేందుకు ముందుకు రాలేదు. గతంలో పాక్ క్రికెట్‌కు సంబంధించి చాలా వరకూ ప్రసార హక్కులను దక్కించుకున్న ఓ పెద్ద సంస్థ కూడా ఈసారీ పూర్తిగా దూరంగా ఉంది.
ప్రభుత్వ ఛానెల్‌కే దక్కిన హక్కులు: చివరికి ప్రభుత్వానికి చెందిన పాకిస్థాన్ టెలివిజన్ కార్పొరేషన్ (PTV) ఒక్కటే బిడ్డింగ్‌లో పాల్గొంది. అదీ కూడా పీసీబీ నిర్దేశించిన రిజర్వ్ ప్రైస్ రూ.600 మిలియన్ల కంటే దాదాపు సగం తక్కువగా.. కేవలం 350 మిలియన్ పాకిస్థాన్ రూపాయలకే ఆ హక్కులను దక్కించుకోవడం గమనార్హం.
క్రికెట్ వర్గాల సమాచారం ప్రకారం.. పాక్ జట్టు పేలవమైన ఆటతీరు, స్పాన్సర్లు ముందుకు రాకపోవడం, గతంలో బకాయిలు ఉన్న కొన్ని సంస్థలు దూరంగా ఉండటమే ఈ దుస్థితికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.




