IPL 2027: మలింగపై వేటు వేసిన ముంబై ఇండియన్స్!

IPL 2027, Lasith Malinga: ఐపీఎల్ 2027 ముందర ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. బౌలింగ్ కోచ్ లసిత్ మలింగ సహా ముగ్గురు సహాయక కోచ్‌లను తొలగించింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 29 Oct 2026 7:56 PM IST
Lasith Malinga
X

IPL 2027: మలింగపై వేటు వేసిన ముంబై ఇండియన్స్!

IPL 2027, Lasith Malinga: ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు ఐదుసార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఫ్రాంచైజీ మేనేజ్‌మెంట్ సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. రాబోయే సీజన్ కోసం కోచింగ్ సెటప్‌లో భారీ ప్రక్షాళన చేపట్టిన ముంబై.. తాజాగా తమ బౌలింగ్ కోచ్‌లు లసిత్ మలింగ, పారస్ మాంబ్రేలతో పాటు ఫీల్డింగ్ కోచ్ కార్ల్ హాప్‌కిన్సన్‌లను జట్టు బాధ్యతల నుంచి తొలగించింది.

సపోర్ట్ స్టాఫ్ మార్పులు:

గత వారమే ప్రధాన కోచ్ మహేళ జయవర్ధనే స్థానంలో వెస్టిండీస్ దిగ్గజం కీరన్ పొలార్డ్‌ను హెడ్ కోచ్‌గా నియమించిన ముంబై ఇండియన్స్, తాజాగా మరో ముగ్గురు సహాయక కోచ్‌లపై వేటు వేసింది. ఈ సందర్భంగా ఫ్రాంచైజీ ఒక అధికారిక ప్రకటన విడుదల చేస్తూ.. "లసిత్ మలింగ, పారస్ మాంబ్రే, కార్ల్ హాప్‌కిన్సన్‌లు పురుషుల జట్టు కోచింగ్ సెటప్ నుండి తప్పుకుంటున్నారు. జట్టు విజయంలో భాగస్వాములైన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు" అని తెలిపింది.

మలింగ, మాంబ్రే సేవలు కొనియాడిన ఫ్రాంచైజీ:

ఆటగాడిగా, మెంటార్‌గా మరియు బౌలింగ్ కోచ్‌గా ముంబై ఇండియన్స్ సాధించిన విజయాల్లో లసిత్ మలింగ పాత్ర ఎంతో కీలకమైనదని పేర్కొంది. మరోవైపు, 2024 టీ20 ప్రపంచ కప్ విజయం తర్వాత జట్టులోకి వచ్చి సేవలందించిన భారత మాజీ బౌలింగ్ కోచ్ పారస్ మాంబ్రే సేవలను కూడా ఫ్రాంచైజీ కొనియాడింది. 2008 నుంచి ముంబైతో అనుబంధం ఉన్న మాంబ్రే తొలి ఐపీఎల్ టైటిల్, ఛాంపియన్స్ లీగ్ విజయాల్లో కీలక పాత్ర పోషించారు.

కొత్త ఫీల్డింగ్ కోచ్‌గా టీ దిలీప్?

ముంబై ఇండియన్స్ కోచింగ్ స్టాఫ్‌లో ఖాళీ అయిన స్థానాల భర్తీపై ఇప్పటికే ప్రచారం మొదలైంది. భారత జాతీయ జట్టు మాజీ ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్ త్వరలోనే ముంబై ఇండియన్స్ కొత్త ఫీల్డింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని క్రీడా వర్గాలు చెబుతున్నాయి. కీరన్ పొలార్డ్ నాయకత్వంలోని సరికొత్త కోచింగ్ టీమ్‌తో ముంబై ఐపీఎల్ 2027 బరిలోకి దిగనుంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్