Asian Para Games : ఒకే టోర్నీలో రెండు స్వర్ణాలు.. ప్రపంచ రికార్డుతో మోనా సంచలనం
భారత పారా షూటర్ మోనా అగర్వాల్ సరికొత్త రికార్డులతో సంచలనం సృష్టిస్తున్నారు. శుక్రవారం ఐచి ప్రిఫెక్చురల్ జనరల్ షూటింగ్ గ్యాలరీలో జరిగిన..
Mona Agarwal
భారత పారా షూటర్ మోనా అగర్వాల్ సరికొత్త రికార్డులతో సంచలనం సృష్టిస్తున్నారు. శుక్రవారం ఐచి ప్రిఫెక్చురల్ జనరల్ షూటింగ్ గ్యాలరీలో జరిగిన మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ SH1 ఈవెంట్లో ఆమె అద్భుత ప్రదర్శనతో ప్రపంచ రికార్డును తిరగరాస్తూ బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు. ప్రస్తుత క్రీడల్లో మోనాకు ఇది రెండో స్వర్ణ పతకం కావడం విశేషం.
ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన మోనా
ఫైనల్ పోరులో మోనా అగర్వాల్ ఏకంగా 357.5 స్కోరు సాధించి సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పారు. అంతకుముందు స్వీడన్ షూటర్ అన్నా బెన్సన్ (356 పాయింట్లు) పేరిట ఉన్న వరల్డ్ రికార్డును మోనా తిరగరాశారు. అలాగే గత నెలలో దక్షిణ కొరియాకు చెందిన లీ యున్-రి సాధించిన ఆసియా రికార్డును (355.7) కూడా ఆమె అధిగమించారు. ఇదే ఈవెంట్లో భారత్‌కే చెందిన స్టార్ షూటర్ అవని లేఖరా 333.2 స్కోరుతో నాలుగో స్థానంలో నిలిచి తృటిలో పతకాన్ని చేజార్చుకున్నారు. ఈ విభాగంలో చైనాకు చెందిన క్యుపింగ్ జాంగ్ (353.7) రజతం గెలవగా, దక్షిణ కొరియాకు చెందిన మియంగ్ కిమ్ (344.4) కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు.
అర్హత రౌండ్ నుంచి ఫైనల్ వరకు రోమాంచిత పోరు
అర్హత (క్వాలిఫికేషన్) రౌండ్లో మోనా 566-17x స్కోరుతో ఆరో స్థానంలో నిలవగా, అవని లేఖరా 580-24x స్కోరుతో ఆసియా పారా గేమ్స్ క్వాలిఫికేషన్ రికార్డును సృష్టిస్తూ అగ్రస్థానంలో నిలిచారు. అయితే ఫైనల్ పోరులో మోనా అద్భుతమైన పునరాగమనం చేశారు. నీలింగ్ సిరీస్-1 లో 101.4, ప్రోన్ సిరీస్-1 లో 102.1 పాయింట్లు సాధించి ఆధిక్యంలోకి దూసుకొచ్చారు. ఆ తర్వాత స్టాండింగ్ సిరీస్‌లోనూ వరుసగా బెస్ట్ స్కోర్లు సాధిస్తూ స్వర్ణాన్ని ఖాయం చేసుకున్నారు.
ఒకే క్రీడల్లో రెండు పసిడి పతకాలు
దీనికి ముందే జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ SH1 ఈవెంట్లోనూ మోనా అగర్వాల్ పసిడి పతకం సాధించిన సంగతి తెలిసిందే. ఆ ఈవెంట్లో ఆమె 250 పాయింట్ల ఆసియా పారా గేమ్స్ రికార్డు స్కోరుతో పసిడి గెలవగా, అవని లేఖరా 249.6 స్కోరుతో రజత పతకం సాధించి భారత్ పతకాల ఖాతాను తెరిచారు. ఒకే క్రీడల్లో రెండు పసిడి పతకాలు, దానికి తోడు ప్రపంచ రికార్డును సాధించిన మోనా అగర్వాల్‌పై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది.




