పాక్ ఓవర్ యాక్షన్ ప్లేయర్ నోటీసులు తప్పవా.. దర్యాప్తులో కీలక మలుపు..?
Mohammad Rizwan: పాకిస్థాన్ క్రికెటర్ మహ్మద్ రిజ్వాన్‌పై జరుగుతున్న దర్యాప్తులో కొత్త పరిణామం వెలుగులోకి వచ్చింది. ఫోన్ ఫోరెన్సిక్ పరీక్షకు హాజరు కావాలని దర్యాప్తు సంస్థ పలుమార్లు కోరినా ఆయన స్పందించడం లేదని తెలుస్తోంది.
పాక్ ఓవర్ యాక్షన్ ప్లేయర్ నోటీసులు తప్పవా.. దర్యాప్తులో కీలక మలుపు..?
Mohammad Rizwan: పాకిస్థాన్ మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ (Mohammad Rizwan) చుట్టూ కొనసాగుతున్న దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకున్నట్లు అక్కడి మీడియా తెలిపింది. జాతీయ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NCCIA) విచారణలో భాగంగా తన మొబైల్ ఫోన్‌ను ఫోరెన్సిక్ పరీక్షకు అందించేందుకు రిజ్వాన్ స్పందించడం లేదని ఓ ప్రముఖ పాకిస్థాన్ పత్రిక కథనం పేర్కొంది. రిజ్వాన్‌తో పాటు మరో బ్యాటర్ ఇమామ్ ఉల్ హక్ (Imam-ul-Haq) పేర్లు కూడా ఈ వ్యవహారంలో ఉన్నాయి. ఫోన్‌లోని సమాచారం కోల్పోకుండా పరీక్ష నిర్వహించేందుకు తమ కార్యాలయానికి రావాలని NCCIA పలుమార్లు కోరినట్లు సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ కథనం వెల్లడించింది. ఆయన ఫోన్ కాల్స్‌కు స్పందించకపోవడం లేదా తన న్యాయవాదిని సంప్రదించాలని చెప్పడం జరుగుతోందని పేర్కొంది.
రిజ్వాన్ కార్యాలయానికి రావడం సాధ్యం కాకపోతే ఆయన నివాసానికే ప్రత్యేక బృందాన్ని పంపేందుకు NCCIA సిద్ధమైందని సమాచారం. అయినా ఇప్పటివరకు స్పందన రాలేదని దర్యాప్తు సంస్థకు చెందిన వర్గాలు చెప్పినట్లు కథనం తెలిపింది. విచారణను త్వరగా పూర్తి చేయాలని లాహోర్ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉందని కూడా పేర్కొంది.
ఈ వ్యవహారంలో రిజ్వాన్, ఇమామ్ ఇద్దరూ ప్రస్తుతం ఎలాంటి తప్పిదానికి పాల్పడ్డారని నిర్ధారణ కాలేదని NCCIA వర్గాలు స్పష్టం చేసినట్లు కథనం తెలిపింది. కొన్ని అనుమానాలకు స్పష్టత రావాల్సి ఉందని, ఆధారాలు లభించకపోతే ఇద్దరినీ కేసు నుంచి త్వరగా క్లియర్ చేస్తామని సంబంధిత అధికారి చెప్పినట్లు వెల్లడించింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) అవినీతి నిరోధక నిబంధనల పరిధిలోనే విచారణ సాగుతోందని కూడా ఆ వర్గాలు పేర్కొన్నాయి.
ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టు తరువాత రిజ్వాన్, ఇమామ్, సల్మాన్ అలీ అఘా (Salman Ali Agha) స్వదేశానికి తిరిగి రావాలని ఆదేశించారు. అనంతరం రిజ్వాన్, ఇమామ్‌ల ఫోన్లు భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరినీ NCCIA విచారణకు పిలిచింది. ఈ నెలలోనే వారు సంస్థ ఎదుట హాజరయ్యారు. ఆ తరువాత రిజ్వాన్ న్యాయవాదిని నియమించుకున్నాడు.
విచారణ ప్రారంభమైన సమయంలో బయటకు వచ్చిన NCCIA పత్రంలో గ్యాంబ్లింగ్ వెబ్‌సైట్లలో బెట్టింగ్ కార్యకలాపాలకు సంబంధించిన ఆరోపణలను సంస్థ పరిశీలిస్తున్నట్లు వెల్లడైంది. తాజా పరిణామాల నేపథ్యంలో రిజ్వాన్ త్వరలో స్పందించకపోతే తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టే అవకాశం ఉందని NCCIA వర్గాలు తెలిపినట్లు పాకిస్థాన్ మీడియా పేర్కొంది.




