Japan Open 2026: జపాన్ ఓపెన్‌లో పీవీ సింధు చరిత్ర.. రెండేళ్ల తర్వాత ఫైనల్‌కు దూసుకెళ్లిన తెలుగు తేజం!
Japan Open 2026: జపాన్ ఓపెన్ సూపర్ 750 టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సరికొత్త చరిత్ర సృష్టించింది.
Japan Open 2026: జపాన్ ఓపెన్‌లో పీవీ సింధు చరిత్ర.. రెండేళ్ల తర్వాత ఫైనల్‌కు దూసుకెళ్లిన తెలుగు తేజం!
Japan Open 2026: భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పీవీ సింధు సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రతిష్టాత్మక జపాన్ ఓపెన్ సూపర్ 750 టోర్నీలో ఫైనల్‌కు చేరిన తొలి భారత మహిళా షట్లర్‌గా రికార్డు పుటల్లోకెక్కింది. శనివారం జరిగిన హోరాహోరీ సెమీఫైనల్ పోరులో సింధు అద్భుత ప్రదర్శనతో ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది.
మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో పీవీ సింధు చైనాకు చెందిన బలమైన ప్రత్యర్థి చెన్ యుఫీయ్‌తో తలపడింది. తొలి సెట్‌లో ఇరు ఆటగాళ్లు హోరాహోరీగా తలపడటంతో మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. అయితే, కీలక పాయింట్లు సాధించిన సింధు 21-19తో మొదటి సెట్‌ను కైవసం చేసుకుంది. అనంతరం జరిగిన రెండో సెట్‌లోనూ సింధు పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తూ 15-10తో ముందంజలో ఉన్న సమయంలో.. చెన్ యుఫీయ్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగింది. దీంతో సింధు విజేతగా నిలిచి ఫైనల్లోకి అడుగుపెట్టింది. పీవీ సింధు ఒక అంతర్జాతీయ టోర్నీలో ఫైనల్‌కు చేరడం గత రెండేళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం. చివరిసారిగా ఆమె 2024లో సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ టోర్నీలో విజేతగా నిలిచింది.
ఆదివారం జరగబోయే గ్రాండ్ ఫైనల్ మ్యాచ్‌లో సింధు తలపడే ప్రత్యర్థి ఎవరో ఇంకా ఖరారు కాలేదు. రెండో సెమీఫైనల్లో తలపడనున్న అకనె యమగుచి (జపాన్) - పుత్రి కుసుమ వర్దాని (ఇండోనేషియా) మ్యాచ్ విజేతతో సింధు టైటిల్ పోరులో తలపడనుంది. ఈ తుది పోరులోనూ గెలిస్తే.. జపాన్ ఓపెన్‌ను సొంతం చేసుకున్న తొలి భారత మహిళా షట్లర్‌గా సింధు మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకోనుంది.




