Japan Open 2026 Badminton: జపాన్ ఓపెన్‌లో పీవీ సింధు సరికొత్త చరిత్ర.. కెరీర్‌లో తొలిసారి సెమీఫైనల్‌కు!

Japan Open 2026 Badminton: జపాన్ ఓపెన్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు సరికొత్త చరిత్ర సృష్టించింది.

Arun Chilukuri
Published on: 17 July 2026 2:52 PM IST
Japan Open 2026 Badminton
X

Japan Open 2026 Badminton: జపాన్ ఓపెన్‌లో పీవీ సింధు సరికొత్త చరిత్ర.. కెరీర్‌లో తొలిసారి సెమీఫైనల్‌కు!

Japan Open 2026 Badminton: భారత బ్యాడ్మింటన్ స్టార్, రెండు సార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు తన సుదీర్ఘ కెరీర్‌లో మరో అరుదైన మైలురాయిని అందుకుంది. ప్రతిష్టాత్మక జపాన్ ఓపెన్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో సింధు తొలిసారి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. టోక్యో వేదికగా జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి ముందే జపాన్ స్టార్ ప్లేయర్, మాజీ వరల్డ్ ఛాంపియన్ నొజుమి ఒకుహర గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలగడంతో సింధుకు 'వాకోవర్' లభించింది. ఫలితంగా మ్యాచ్ ఆడకుండానే సింధు నేరుగా సెమీస్‌లో అడుగుపెట్టింది.

జపాన్ ఓపెన్ టోర్నీ చరిత్రలో ఒక భారతీయ మహిళా షట్లర్ సెమీఫైనల్‌కు చేరుకోవడం గత 15 ఏళ్లలో ఇదే మొదటిసారి కావడం విశేషం. గతంలో 2011లో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ చివరిసారిగా ఈ టోర్నీలో సెమీస్‌కు చేరింది. అయితే ఆ మ్యాచ్‌లో జర్మనీ క్రీడాకారిణి జులియనె చేతిలో సైనా ఓటమిపాలైంది. ఇప్పుడు ఆ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ సింధు సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఈ టోర్నీలో సింధు గనుక ఫైనల్‌కు చేరితే.. జపాన్ ఓపెన్ ఫైనల్ చేరిన తొలి భారత మహిళా షట్లర్‌గా సరికొత్త చరిత్ర లిఖిస్తుంది.

ఫైనల్ బెర్త్ కోసం జరగబోయే హై-ప్రొఫైల్ సెమీఫైనల్ పోరులో చైనాకు చెందిన ప్రస్తుత ఒలింపిక్ ఛాంపియన్, ప్రపంచ నంబర్ 4 క్రీడాకారిణి చెన్ యుఫైతో పీవీ సింధు తలపడనుంది. ఈ టోర్నీలో ఇప్పటికే చైనాకే చెందిన వరల్డ్ నంబర్ 5 ప్లేయర్ హన్ యుఎను ఓడించి క్వార్టర్స్‌కు చేరిన సింధు.. సెమీస్‌లో చెన్ యుఫై నుంచి గట్టి సవాల్‌ను ఎదుర్కోనుంది.

గతంలో వీరిద్దరి మధ్య జరిగిన ముఖాముఖి రికార్డుల్లో చెన్ యుఫై 8-6 ఆధిక్యంలో ఉంది. కాబట్టి ఈ మ్యాచ్ తీవ్ర ఉత్కంఠభరితంగా సాగనుంది. ఈ 2026 సీజన్‌లో సింధుకు ఇది మూడో సెమీఫైనల్ (ఇంతకుముందు మలేషియా ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీస్ చేరింది) కావడం గమనార్హం. జపాన్ ఓపెన్‌లో భారత్ తరఫున రేసులో నిలిచిన ఏకైక క్రీడాకారిణి పీవీ సింధు మాత్రమే కావడంతో దేశవ్యాప్తంగా క్రీడాభిమానులు ఆమె విజయాన్ని కాంక్షిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story