Commonwealth Games 2026 : ముగిసిన కామన్వెల్త్.. 39 పతకాలతో నాలుగో స్థానంలో భారత్.!

Commonwealth Games 2026 : గ్లాస్గో కామన్వెల్త్ క్రీడలు ఆదివారంతో ముగిశాయి. ఆఖరి రోజున భారత అథ్లెట్లు తీవ్ర నిరాశ పరిచారు. జూడో, సైక్లింగ్ విభాగాల్లో ఏడుగురు భారత

G Krishna
Published on: 3 Aug 2026 6:17 AM IST
Commonwealth-Games
X

Commonwealth-Games

Commonwealth Games 2026 : గ్లాస్గో కామన్వెల్త్ క్రీడలు ఆదివారంతో ముగిశాయి. ఆఖరి రోజున భారత అథ్లెట్లు తీవ్ర నిరాశ పరిచారు. జూడో, సైక్లింగ్ విభాగాల్లో ఏడుగురు భారత అథ్లెట్లు బరిలోకి దిగినప్పటికీ ఒక్కరు కూడా పతకాన్ని సాధించలేకపోయారు. దీంతో భారత్ ఈసారి మొత్తంగా 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్యాలతో కలిపి 39 పతకాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2022 బర్మింగ్‌హామ్ గేమ్స్‌లో సాధించిన 61 పతకాల కంటే ఇది చాలా తక్కువ కావడం గమనార్హం. పతకాల పట్టికలో ఆస్ట్రేలియా ఏకంగా 171 పతకాలతో మొదటి స్థానంలో నిలవగా, భారత్ నాలుగో స్థానాన్ని దక్కించుకుంది.

చేజారిన జూడో కాంస్యం.. సైక్లింగ్‌లో పట్టుతప్పిన విజయం

చివరి రోజు మహిళల 78 కేజీల జూడో విభాగంలో కాంస్య పతకం గెలిచే సువర్ణావకాశం జూడోకా ఇష్రూప్ నారంగ్‌కు లభించినా, తీవ్రంగా పోరాడి కెనడా క్రీడాకారిణి కోరలీ గాడ్‌బౌట్ చేతిలో ఓడిపోయింది. నిర్ణీత సమయంలో ఇద్దరూ పాయింట్లు సాధించకపోవడంతో మ్యాచ్ గోల్డెన్ స్కోర్‌కు దారితీసింది. ఇందులో కెనడా క్రీడాకారిణి పైచేయి సాధించడంతో ఇష్రూప్‌కు నిరాశే మిగిలింది. పురుషుల విభాగంలో యష్ గంగాస్, అవతార్ సింగ్‌లు రౌండ్ ఆఫ్ 16లోనే నిష్క్రమించారు. ఓవరాల్‌గా భారత జూడో బృందం ఈ క్రీడల్లో 2 స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యాన్ని సొంతం చేసుకుంది. మరోవైపు సైక్లింగ్ పోటీల్లోనూ భారత్‌కు చేదు అనుభవమే ఎదురైంది. పురుషుల పాయింట్స్ రేసులో హర్ష్‌వీర్ సింగ్ వైదొలగగా, దినేశ్ కుమార్ 11వ స్థానంతో సరిపెట్టుకుని ఫైనల్స్‌కు దూరమయ్యాడు. 1000 మీటర్ల టైమ్ ట్రయల్‌లో రొనాల్డో సింగ్ 20వ స్థానంలో నిలవగా, పారా సైక్లింగ్‌లో పోటీపడిన 16 ఏళ్ల చిన్నారి లిషో దాస్ 1000 మీటర్ల ఫైనల్లో ఆరో స్థానంతో రేసును ముగించింది.

ఇండియన్ రెస్టారెంట్‌పై బాక్సర్ల ఆగ్రహం..

గ్లాస్గోలోని 'మిస్టర్ సింగ్స్ ఇండియా' అనే రెస్టారెంట్ తీవ్ర వివాదంలో చిక్కుకుంది. విజయోత్సవంలో భాగంగా అక్కడికి వెళ్లిన భారత బాక్సర్లకు అందించిన న్యాప్‌కిన్లపై ముద్రించిన భారత దేశపటంలో ఈశాన్య రాష్ట్రాలు పూర్తిగానూ, కశ్మీర్‌లో సగం భాగం గాయబ్ కావడం తీవ్ర కలకలం రేపింది. దీనిపై అస్సాంకు చెందిన బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ తీవ్రంగా మండిపడింది. దేశంలో ప్రతి ప్రాంతం ముఖ్యమైనదేనని, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వ్యక్తిగా మీ చర్య నన్ను తీవ్రంగా బాధించిందని సదరు హోటల్ యాజమాన్యాన్ని సూటిగా ప్రశ్నించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తీవ్ర వైరల్ కావడంతో, రెస్టారెంట్ యాజమాన్యం తమ క్షమాపణలు తెలుపుతూ తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను డిలీట్ చేసింది.

అహ్మదాబాద్‌లో 'శతాబ్ది' సంబరాలు.. విజేతలకు స్వదేశంలో ఘనస్వాగతం

నాలుగేళ్ల తర్వాత జరగబోయే తదుపరి కామన్వెల్త్ క్రీడలకు భారత్ వేదిక కానుంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరం 2030 కామన్వెల్త్ గేమ్స్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. ముగింపు వేడుకల్లో భాగంగా గుజరాత్ ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘ్వీ కామన్వెల్త్ క్రీడల పతాకాన్ని స్వీకరించారు. 1930లో కెనడాలో ప్రారంభమైన ఈ గేమ్స్, 2030 నాటికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకోనుండటంతో అహ్మదాబాద్ క్రీడలు చారిత్రాత్మక 'శతాబ్ది ఉత్సవాలు'గా నిలవనున్నాయి. మరోవైపు పతకాలతో మెరిసిన భారత అథ్లెట్లు స్వదేశానికి తిరుగుపయనమయ్యారు. ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న వెయిట్‌లిఫ్టర్లు మీరాబాయి చాను, రజత పతక విజేత వల్లూరి అజయ్ బాబు, లవ్‌ప్రీత్ సింగ్‌లకు క్రీడాభిమానులు నీరాజనాలు పట్టారు. తొలిసారే కామన్వెల్త్‌లో పతకం గెలవడం చాలా సంతోషంగా ఉందని, ఈ విజయాన్ని తన తండ్రికి, కోచ్‌కి అంకితమిస్తూ 2028 ఒలింపిక్సే తన తదుపరి లక్ష్యమని అజయ్ బాబు స్పష్టం చేశాడు.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story