వేలం జరుగుతుంటే గ్రౌండ్లోకి వెళ్లాను.. ఆర్సీబీ నిర్ణయంతో ఆశ్చర్యపోయా..!
Royal Challengers Bengaluru: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) తనను రూ.10.75 కోట్ల భారీ ధరకు సొంతం చేసుకోవడంపై సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
వేలం జరుగుతుంటే గ్రౌండ్లోకి వెళ్లాను.. ఆర్సీబీ నిర్ణయంతో ఆశ్చర్యపోయా..!
Bhuvneshwar Kumar: ఐపీఎల్ 2025 వేలం సమయంలో జరిగిన ఒక అనూహ్య పరిణామం గురించి భారత క్రికెట్ జట్టు (Team India) సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ గుర్తుచేసుకున్నాడు. వేలం రెండో రోజు తన పేరు వచ్చే సమయానికి ఉత్తరప్రదేశ్ జట్టుకు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (Syed Mushtaq Ali Trophy) మ్యాచ్లో నాయకత్వం వహిస్తున్నట్లు చెప్పాడు. మైదానంలోకి దిగే ముందు జట్టు వీడియో అనలిస్ట్ వేలం చూస్తుండగా గమనించానని, ముంబై ఇండియన్స్ (Mumbai Indians), లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) జట్లు తన కోసం తీవ్రంగా పోటీ పడ్డాయని పేర్కొన్నాడు. ధర రూ.5 కోట్ల దాటి రూ.6 కోట్ల దాకా వెళ్లేసరికి అంపైర్లు గ్రౌండ్లోకి రావడంతో తాను మ్యాచ్ ఆడటానికి వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆర్సీబీ భారీ ధరకు కొనుగోలు చేసిన సంగతి తెలిసి విస్తుపోయానని తెలిపాడు.
సన్రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) హెడ్ కోచ్ డేనియల్ వెట్టోరి (Daniel Vettori) మొదటి రోజే తనతో మాట్లాడారని భువీ వెల్లడించాడు. తమ జట్టుకు తీసుకోవాలని ఉన్నప్పటికీ బడ్జెట్ సమీకరణాల వల్ల కొనలేకపోతున్నట్లు ఆయన ముందే స్పష్టం చేశారు. చాలా ఫ్రాంచైజీలు తన కోసం ఎదురుచూస్తున్నట్లు వెట్టోరి చెప్పారని గుర్తుచేసుకున్నాడు. మైదానంలో ఆడుతున్న సమయంలో ఆర్సీబీ తనను దక్కించుకుందనే వార్త అందింది. అప్పటివరకు వేలంలో పోటీ పడని బెంగళూరు ఉన్నట్టుండి బిడ్డింగ్లోకి వచ్చి రూ.10.75 కోట్లు వెచ్చించడం తీవ్ర ఆశ్చర్యం కలిగించినా, భారీ అభిమానగణం ఉన్న జట్టులోకి రావడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని పేర్కొన్నాడు.
పదిహేడేళ్లపాటు ఒక్క టైటిల్ కూడా గెలవని జట్టులోకి అడుగుపెట్టినప్పటికీ, తనపై ఎలాంటి మానసిక ఒత్తిడి లేదని ఈ వెటరన్ పేసర్ అన్నాడు. జట్టు మేనేజ్మెంట్ ఆలోచనా విధానం చాలా ప్రశాంతంగా ఉందని, గెలిస్తే సంతోషం లేదంటే వచ్చే ఏడాది చూద్దామనే భావనతో ఆటగాళ్లను ఒత్తిడికి గురిచేయకుండా ఉంచారని వెల్లడించాడు. కెరీర్ ఆరంభంలో ఈ జట్టు వద్ద ఛాంపియన్స్ లీగ్ టీ20 (Champions League T20) లో ఒకే మ్యాచ్ ఆడిన భువీ, మళ్లీ జట్టులోకి వచ్చాక రెండు సీజన్లలో 30 మ్యాచులాడి 45 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా 36 ఏళ్ల వయసులో ఐపీఎల్ 2026 సీజన్లో ఏకంగా 28 వికెట్లు నేలకూల్చి ఆర్సీబీ వరుసగా రెండుసార్లు ట్రోఫీ అందుకోవడంలో ప్రధాన పాత్ర పోషించాడు.




