IPL: 5 మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్స్.. రస్సెల్, నరైన్‌తో పాటు లిస్టులో మరో లెజెండ్.. ఎవరంటే!
IPL: ఆండ్రీ రస్సెల్, కీరన్ పొలార్డ్, సునీల్ నరైన్, షేన్ వాట్సన్, రవీంద్ర జడేజా ఐపీఎల్ చరిత్రలో బ్యాట్, బాల్, ఫీల్డింగ్‌తో జట్లకు అత్యంత విలువైన ఆటగాళ్లుగా నిలిచిన ఐదుగురు ఆల్‌రౌండర్లు.
IPL: 5 మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్స్.. రస్సెల్, నరైన్‌తో పాటు లిస్టులో మరో లెజెండ్.. ఎవరంటే!
IPL: ఐపీఎల్‌లో ఎందరో మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. కానీ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో ఒకే సమయంలో మ్యాచ్ గతిని మార్చగలిగిన ఆటగాళ్లు కొద్దిమందే. ఆండ్రీ రస్సెల్, కీరన్ పొలార్డ్, సునీల్ నరైన్, రవీంద్ర జడేజాతో పాటు మరో దిగ్గజ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ ఈ జాబితాలో ముందున్నారు. విధ్వంసకర ఫినిషింగ్, పొదుపైన బౌలింగ్, మెరుపు ఫీల్డింగ్, నాయకత్వంతో వీరంతా ఫ్రాంచైజీలకు అపారమైన విలువను అందించారు.
వెస్టిండీస్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్ ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున రెండు సీజన్లు ఆడి, ఆ తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్‌లో చేరారు. ఐపీఎల్‌లో 2,651 పరుగులు 174.18 స్ట్రైక్ రేట్‌తో చేసి, 123 వికెట్లు పడగొట్టారు. 2014, 2024లో కేకేఆర్ టైటిల్ గెలిచిన సీజన్లలో ఆయన పాత్ర కీలకం. 2015, 2019లో రెండుసార్లు MVP అవార్డు గెలుచుకున్నారు. 2,000 పరుగులు, 100 వికెట్లు సాధించిన ఇద్దరు ఆల్‌రౌండర్లలో ఆయన ఒకరు. మరొకరు రవీంద్ర జడేజా. 1,500 పరుగులకు పైగా చేసిన బ్యాటర్లలో అత్యధిక స్ట్రైక్ రేట్ కూడా రస్సెల్‌దే.
ముంబై ఇండియన్స్ బ్యాక్‌బోన్‌గా నిలిచిన కీరన్ పొలార్డ్ కొన్ని బంతుల్లోనే మ్యాచ్ గతిని మార్చగలిగే ఆటగాడు. ఐపీఎల్‌లో 3,412 పరుగులు, 69 వికెట్లు సాధించారు. 2013 నుంచి 2020 మధ్య ముంబై గెలిచిన ఐదు టైటిళ్లలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఒత్తిడిలో ఎన్నో గుర్తుండిపోయే ప్రదర్శనలిచ్చారు. పొలార్డ్ ఇప్పుడు ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్‌గా కొత్త బాధ్యతలు చేపట్టనున్నారు.
మిస్టరీ స్పిన్నర్ నుంచి విధ్వంసకర ఓపెనర్‌గా ఎదిగిన సునీల్ నరైన్ కేకేఆర్‌కు అద్భుతమైన ఆస్తిగా మారారు. మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయడం, టాప్‌లో విధ్వంసకర బ్యాటింగ్ చేయడం ఆయన ప్రత్యేకత. ఐపీఎల్‌లో 207 వికెట్లు తీసి 1,820 పరుగులు చేశారు. ఇందులో ఒక సెంచరీ, ఏడు అర్ధసెంచరీలు ఉన్నాయి. 2012, 2018, 2024 సీజన్లలో మూడుసార్లు MVP అవార్డు సొంతం చేసుకున్నారు.
రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన షేన్ వాట్సన్ బ్యాట్, బాల్ రెండింటితో మ్యాచ్ ఫలితాలను ప్రభావితం చేశారు. ఐపీఎల్‌లో 3,874 పరుగులు చేసి, 92 వికెట్లు తీశారు. 2008లో ఆర్ఆర్ తొలి టైటిల్ గెలవడంలో, 2018లో సీఎస్కే విజయంలో ఆయన పాత్ర కీలకం. 2008, 2013 సీజన్లలో రెండుసార్లు MVP అవార్డు అందుకున్నారు.
రవీంద్ర జడేజా విలువ బ్యాటింగ్, బౌలింగ్‌కే పరిమితం కాదు. అద్భుతమైన ఫీల్డింగ్, మిడిల్ ఓవర్లపై పట్టు, కష్టమైన ఛేజింగ్‌లో నిలకడ ఆయనను పరిపూర్ణ టీ20 ఆటగాడిగా మార్చాయి. ఐపీఎల్‌లో 3,526 పరుగులు చేసి, 180 వికెట్లు తీశారు. 2023 ఫైనల్‌లో ఆయన ఆడిన మ్యాచ్ విన్నింగ్ కేమియో చెన్నైకి ఐదో టైటిల్ అందించింది. ఆర్ఆర్, కొచ్చి, గుజరాత్ లయన్స్, సీఎస్కే తరఫున ఆడిన జడేజా, ప్రస్తుతం ఆర్ఆర్‌లో తిరిగి చేరారు. సీఎస్కే నుంచి ట్రేడ్ అయిన ఆయన పే కట్ తీసుకుని రూ. 14 కోట్లకు ఆర్ఆర్‌లో చేరారు.




