Tathastu Secret: మన పూర్వికులు చెప్పిన అక్షర సత్యాలు... మన అదృష్టాన్ని ఈ సమయమే మార్చేస్తుంది
సంధ్యాసమయంలో మౌనంగా ఎందుకు ఉండాలి...చెడు మాటలు ఎందుకు మాట్లాడకూడదు...మన అదృష్టాన్ని మార్చే సంధ్యాసమయం గురించి తెలుసుకుందాం.
Tathastu Secret: పూర్వకాలంలో ఉమ్మడి కుటుంబాల్లో ఉన్న పెద్దవారు సాయంత్రం వేళల్లో కొన్ని పవిత్రమైన నియమాలను కచ్చితంగా అమలుచేసేవారు. సంధ్యాసమయంలో ఇళ్లలో గొడవపడకూడదని, అపశకునాలు మాట్లాడకూడదని, ఇతరుల గురించి చెడుగా తలచకూడదని స్పష్టంగా హెచ్చరించేవారు. ఆ సమయంలో దేవతలు ఆకాశ మార్గంలో సంచరిస్తూ "తథాస్తు" అని దీవిస్తారని, అందుకే ఆ వేళ ఏది మాట్లాడితే అది జరుగుతుందని నమ్మేవారు. నేటి ఆధునిక కాలంలో ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోవడం వల్ల ఈ నియమాల వెనుక ఉన్న అంతరార్థం తెలియక చాలామంది వీటిని మూఢనమ్మకాలుగా కొట్టిపారేస్తుంటారు. కానీ, దీని వెనుక సూర్యపుత్రులైన అశ్వనీ దేవతల అద్భుత ఆధ్యాత్మిక రహస్యం దాగి ఉంది.
అశ్వనీ దేవతల విచిత్ర జన్మ రహస్యం
మన పూర్వికులు 'తథాస్తు దేవతలు' అని పిలిచేవారు మరెవరో కాదు, దేవ వైద్యులైన 'అశ్వనీ దేవతలు'. సనాతన ధర్మం ప్రకారం వీరి ఆవిర్భావం ఎంతో విచిత్రంగా జరిగింది. సూర్యభగవానుని ఉగ్రమైన వేడిని భరించలేక ఆయన భార్య సంధ్యాదేవి అశ్వం రూపంలోకి మారి కురుక్షేత్ర ప్రాంతంలో తపస్సు చేపట్టడానికి వెళ్ళింది. భార్య వియోగాన్ని తట్టుకోలేని సూర్యదేవుడు కూడా గుర్రం అవతారాన్ని ధరించి ఆమెను వెతుక్కుంటూ వెళ్లాడు. ఈ ఇద్దరి దివ్య కలయిక వల్ల జన్మించిన సంతానమే అశ్వనీ దేవతలు. అశ్వ రూపంలో ఉన్న తల్లిదండ్రులకు జన్మించడం వల్ల వీరి ముఖం అశ్వం ఆకృతిలో, శరీరం దివ్య తేజస్సుతో ఉంటుంది.
సంధ్యాసమయంలో 'తథాస్తు' రహస్యం
సూర్యుని వలె అశ్వనీ దేవతలు కూడా అత్యంత వాయువేగంతో లోకమంతా సంచరిస్తుంటారు. వీరు నిరంతరం వేద మంత్రాలను గానం చేస్తూ, యజ్ఞయాగాదులు జరిగే ప్రాంతాల నుండి హవిస్సులను స్వీకరిస్తుంటారు. సూర్యాస్తమయం జరిగే సాయం సంధ్యాసమయంలో వీరు మానవులు నివసించే ప్రాంతాలలో ఆకాశ మార్గాన ప్రయాణిస్తారు. ప్రయాణంలో వీరు నోటి నుండి నిరంతరం "తథాస్తు... తథాస్తు..." అని పలుకుతూ వెళ్తుంటారు. ఆ పవిత్ర సమయంలో మన ఇంట్లో మంచి మాటలు, దైవచింతన ఉంటే శుభాలు జరుగుతాయి. ఒకవేళ కోపతాపాలు, చెడు ఆలోచనలు, నిందలు ఉంటే అవే నిజమై జీవితంలో అశుభాలు ఎదురవుతాయి.
అందుకే సంధ్యావేళలో ప్రతి ఇంట్లోనూ దీపారాధన చేసి, శుభప్రదమైన లక్ష్మీదేవి స్తోత్రాలు, శివనామ స్మరణ చేయడం లేదా మౌనంగా ధ్యానం చేసుకోవడం పరిపాటిగా మారింది. సాయం సమయంలో మౌనాన్ని పాటించి దైవాన్ని స్మరించడం వల్ల మన అదృష్టం శుభదిశగా మారుతుందని మన పెద్దలు అనుభవపూర్వకంగా అందించిన అక్షర సత్యం.




