Tirumala Chakra Snanam: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పుష్కరిణి విశిష్టత...చక్రస్నానం ప్రాముఖ్యత ఏమిటో తెలుసా?
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చక్రస్నానం ఎందుకు నిర్వహిస్తారు? శ్రీవారి పుష్కరిణి విశిష్టత, సుదర్శన చక్ర మహిమ, చక్రస్నానం వెనుక పురాణ కథను తెలుసుకుందాం.
Tirumala Chakra Snanam: తిరుమలలో బ్రహ్మోత్సవాలు అంటే కేవలం వాహన సేవలు, ఊరేగింపులు, గోవింద నామస్మరణ మాత్రమే కాదు.. ప్రతి రోజుకూ ఒక ప్రత్యేకత ఉంటుంది. అయితే ఈ తొమ్మిది రోజుల వైభవానికి ముగింపు పలికే చక్రస్నానం మాత్రం అన్నింటికంటే ప్రత్యేకమైన ఘట్టంగా భక్తులు భావిస్తారు. శ్రీవారి జన్మ నక్షత్రమైన శ్రవణం రోజున జరిగే ఈ పవిత్ర కార్యక్రమం వెనుక పురాణ విశ్వాసాలు, వైష్ణవ సంప్రదాయాలు, ఆగమ శాస్త్రాచారాలు ముడిపడి ఉన్నాయి. ఈ ఏడాది బ్రహ్మోత్సవాల చివరి రోజైన సెప్టెంబర్ 23, బుధవారం, ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు తిరుమలలోని శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించారు. వేలాది మంది భక్తులు ప్రత్యక్షంగా వీక్షించే ఈ కార్యక్రమం తర్వాత పుష్కరిణిలో పవిత్ర స్నానం చేయడం కూడా సంప్రదాయంగా కొనసాగుతోంది.
బ్రహ్మోత్సవాలకు ముగింపు పలికే పవిత్ర ఘట్టం
సాధారణంగా ఒక యజ్ఞం లేదా మహాక్రతువు పూర్తయిన తర్వాత నిర్వహించే పవిత్ర స్నానాన్ని అవభృథ స్నానం అంటారు. అదే భావన శ్రీవారి బ్రహ్మోత్సవాల చక్రస్నానంలో కనిపిస్తుంది. ఎనిమిది రోజుల పాటు వివిధ వాహనాలపై భక్తులకు దర్శనమిచ్చిన శ్రీనివాసుడి ఉత్సవాలు తొమ్మిదో రోజు సుదర్శన చక్రానికి నిర్వహించే పవిత్ర స్నానంతో పరిసమాప్తమవుతాయి. అంటే.. బ్రహ్మోత్సవం అనే మహాయజ్ఞానికి చక్రస్నానం మంగళ ముగింపు అన్నమాట.
అసలు చక్రస్నానం ఎవరికీ చేస్తారు?
ఇక్కడే మరో ఆసక్తికరమైన విషయం ఉంది. చక్రస్నానం అనగానే స్వామివారికి స్నానం చేయిస్తారని చాలామంది అనుకుంటారు. అయితే ఈ కార్యక్రమంలో ప్రధానంగా సుదర్శన చక్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకెళ్లి పవిత్ర పుష్కరిణిలో స్నానం చేయిస్తారు. వైష్ణవ సంప్రదాయంలో సుదర్శన చక్రానికి ప్రత్యేక స్థానం ఉంది. ఆళ్వారుల సంప్రదాయంలో ఇది చక్రత్తాళ్వార్గా ప్రసిద్ధి చెందింది. శ్రీ మహావిష్ణువు చేతిలో ఆయుధంగా ఉండే సుదర్శనం కేవలం ఒక దివ్యాయుధం మాత్రమే కాకుండా రక్షణకు ప్రతీకగా భక్తులు భావిస్తారు.
సుదర్శన చక్రం విష్ణువుకు ఎలా వచ్చింది?
సుదర్శన చక్రం వెనుక ఉన్న ఒక పురాణ కథ కూడా ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. పురాణ కథనం ప్రకారం శ్రీ మహావిష్ణువు ఒక సందర్భంలో శివుడిని ఆరాధించేందుకు కాశీకి వెళ్లారు. వెయ్యి తామర పువ్వులతో శివుడికి పూజ చేయాలని సంకల్పించారు. పూజ ప్రారంభించే సమయంలో ఒక తామర పువ్వు కనిపించకుండా పోయింది. శివుడు విష్ణువు భక్తిని పరీక్షించేందుకే అలా చేశాడని పురాణ కథ చెబుతుంది. పువ్వుల సంఖ్య పూర్తికాకపోవడంతో, తామర పువ్వులను పోలిన తన కన్నును సమర్పించాలని విష్ణువు సిద్ధపడ్డారు. ఆ భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై, శ్రీహరికి సుదర్శన చక్రాన్ని అందించినట్లు పురాణాల్లో కథనం ఉంది. అప్పటి నుంచి సుదర్శనం విష్ణువుతో సమానంగా పూజలు అందుకుంటోందని వైష్ణవ సంప్రదాయం చెబుతుంది.
పుష్కరిణిలోనే ఎందుకు చక్రస్నానం?
తిరుమల శ్రీవారి పుష్కరిణికి సాధారణమైన నీటి కొలను అనే అర్థం లేదు. పురాణ విశ్వాసాల ప్రకారం వైకుంఠంలోని పవిత్ర జలధారలతో దీనికి సంబంధం ఉంది. స్వామివారు తిరుమలకు వచ్చినప్పుడు ఆయన జలక్రీడల కోసం పుష్కరిణి కూడా భువికి వచ్చిందని కథనం. అందుకే దీనిని అత్యంత పవిత్రమైన తీర్థంగా భక్తులు భావిస్తారు. వరాహ పురాణం ప్రకారం ముల్లోకాలలోని పవిత్ర తీర్థాలన్నీ ఈ పుష్కరిణిలో కొలువై ఉంటాయని విశ్వాసం. స్కంద పురాణంలో కూడా పుష్కరిణి మహిమకు సంబంధించిన కథనాలు కనిపిస్తాయి. సుబ్రహ్మణ్యస్వామి కూడా ఇక్కడ స్నానం చేసి దోష విముక్తి పొందినట్లు పురాణ కథనం చెబుతుంది.
చక్రస్నానానికి ముందు ఏం జరుగుతుంది?
చక్రస్నానం ఒక్కసారిగా జరిగే కార్యక్రమం కాదు. దీనికి ముందు శాస్త్రోక్తంగా పలు క్రతువులు నిర్వహిస్తారు. శ్రీవారు, ఉభయదేవేరులు, చక్రత్తాళ్వార్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, ధూపదీప నైవేద్యం వంటి కార్యక్రమాలతో పాటు పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, గంధంతో అభిషేకం చేస్తారు. ఆగమ సంప్రదాయం ప్రకారం జరిగే ఈ కార్యక్రమం అనంతరం సుదర్శన చక్రాన్ని పుష్కరిణికి తీసుకెళ్తారు.
భక్తులతో పుష్కరిణి కిక్కిరిసిపోతుంది
చక్రస్నానం జరిగే సమయంలో తిరుమల కొండంతా ‘గోవిందా.. గోవిందా..’ అనే నామస్మరణతో మారుమోగుతుంది. చక్రత్తాళ్వార్‌కు పుష్కరిణిలో పవిత్ర స్నానం పూర్తయిన తర్వాత భక్తులు కూడా పుష్కరిణిలో స్నానం చేసేందుకు ఆసక్తి చూపుతారు. భక్తుల విశ్వాసం ప్రకారం ఈ పవిత్ర స్నానం పాపాలను తొలగించి ఐశ్వర్యం, శుభఫలాలను ప్రసాదిస్తుంది. చక్రస్నానాన్ని దర్శించడం, పవిత్ర తీర్థాన్ని స్వీకరించడం ద్వారా పుణ్యఫలం లభిస్తుందని శాస్త్ర సంప్రదాయాల్లో విశ్వాసం ఉంది. అందుకే బ్రహ్మోత్సవాల చివరి రోజు తిరుమలలో జరిగే చక్రస్నానం ఒక సాధారణ కార్యక్రమం కాదు. తొమ్మిది రోజుల ఆధ్యాత్మిక వైభవానికి మంగళ ముగింపు పలికే ఘట్టం.. సుదర్శన చక్ర మహిమను గుర్తుచేసే సందర్భం.. శ్రీవారి పుష్కరిణి పవిత్రతను మరోసారి చాటి చెప్పే వేడుక. భక్తులకు ఇది దర్శనం మాత్రమే కాదు.. తరతరాలుగా వస్తున్న ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభూతి.




