Thiruvarppu Krishna Temple: కలియుగంలో అద్భుతం... భక్తుల కళ్లెదుటే మాయమౌతున్న నైవేద్యం

కేరళలోని తిరువరపు శ్రీకృష్ణ ఆలయంలో భక్తులు సమర్పించే నైవేద్యాన్ని స్వామివారు స్వయంగా స్వీకరిస్తారనే విశ్వాసం ఉంది. రోజుకు ఏడుసార్లు నైవేద్యం, తెల్లవారుజామున 2 గంటలకు పూజలు, మాయమయ్యే ప్రసాదం వెనుక ఉన్న ఆధ్యాత్మిక విశేషాలను తెలుసుకుందాం.

Balachander
Published on: 23 Jun 2026 9:10 AM IST
Thiruvarppu Krishna Temple: కలియుగంలో అద్భుతం...  భక్తుల కళ్లెదుటే మాయమౌతున్న నైవేద్యం
X

Thiruvarppu Krishna Temple: భగవంతుడు శిలా రూపంలో ఉంటాడు కానీ, ఆ శిల్పానికి ప్రాణప్రతిష్ఠ జరిగినప్పుడు భక్తుల నమ్మకమే ఊపిరిగా మారి అద్భుతాలు సృష్టిస్తుంది. కేరళలోని తిరువరపు శ్రీకృష్ణ మందిరంలో వెలసిన బాలకృష్ణుడు నిత్యం భక్తులు సమర్పించే నైవేద్యాన్ని స్వయంగా ఆరగిస్తూ, కలియుగంలోనూ దైవం ఉన్నాడని నిరూపిస్తున్నాడు. ఇక్కడ స్వామివారికి ఆకలి ఎక్కువని, నైవేద్యం పెట్టడం కాస్త ఆలస్యమైనా కన్నయ్య నడుమున ఉన్న వడ్డాణం వదులై కిందపడిపోతుందని పండితులు చెబుతున్నారు. కళ్లెదుటే ప్రసాదం తరుగుతూ మాయమయ్యే ఈ దివ్య రహస్యం ఆధ్యాత్మిక ప్రపంచాన్ని సైతం ఆశ్చర్యపరుస్తోంది. మరి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం.

ఆలయ విలక్షణ ఆచారాలు

ఈ ఆలయ నియమాలు, పూజా విధానాలు భారతదేశంలోని మరే ఇతర దేవాలయంలోనూ కనిపించవు. ఇక్కడి ఆచారాల వెనుక ఉన్న ఆసక్తికరమైన అంశాలు ఇలా ఉన్నాయి. బాలకృష్ణుడి ఆకలిని తీర్చడం కోసం ఆలయంలో రోజుకు ఏడుసార్లు రకరకాలైన ప్రసాదాలను నివేదిస్తారు. దేశంలో ఎక్కడాలేని విధంగా తిరువరపు బాలకృష్ణుడి ఆలయంలో తెల్లవారుజామున రెండు గంటలకే ఆలయ ద్వారాలు తెరిచి స్వామివారికి పూజలు చేస్తారు. ఇక తెల్లవారు జామున ఆలయానికి వచ్చేసమయంలో ఆలయ పూజారులు ఒకచేతిలో ప్రసాదాల పాత్రను, మరో చేతితో గొడ్డలిని పట్టుకొని వస్తారు. దీని వెనుక ఓ రహస్యం ఉంది. ఒకవేళ ఆ సమయంలో తాళం చెవితో ఆలయ ద్వారం తెరుచుకోకపోతే...చేతిలో ఉన్న గొడ్డలితో తాళం పగలగొట్టి వెంటనే వెళ్లి స్వామికి నైవేద్యం సమర్పిస్తారు. తెల్లవారుజామున 2 గంటల వరకు స్వామికి తప్పనిసరిగా నైవేద్యం సమర్పించాలి. ఇది కఠినమైన నియమం. ఎన్ని అవాంతరాలు, వైరిత్యాలు, విపత్తలు ఎదురైనా సరే స్వామికి నైవేద్యం సమర్పించడం ఆగదు.

భక్తుల కళ్లెదుటే మాయమయ్యే ప్రసాదం!

ఆలయ గర్భగుడి తలుపులు తెరిచిన వెంటనే, అభిషేక అలంకారాల కంటే ముందే స్వామివారికి నైవేద్యం పెడతారు. పవిత్రమైన పాత్రలో ఉంచిన అన్నప్రసాదం కొద్దికొద్దిగా తగ్గుతూ, భక్తులు చూస్తుండగానే మాయమవడమే ఇక్కడి అసలైన లీల. కంసుడిని వధించిన తరువాత కన్నయ్యకు విపరీతమైన ఆకలి, అలసట కలిగిందని, ఆ రూపంలోనే ఇక్కడ బాలకృష్ణుడు కొలువై ఉన్నారని, అందుకే స్వామికి ఆకలిని తట్టుకునే శక్తి ఉండదని అంటారు.

ఆఖరి భక్తుడి వరకు అన్నప్రసాదం

రాత్రి వేళల్లో పూజలు ముగిసి, ఆలయం తలుపులు వేసే ముందు అర్చకులు మూడు సార్లు పెద్దగా కేక వేస్తూ ఆలయం వెలుపలికి వస్తారు. "ప్రసాదం తీసుకోని వారు ఇంకా ఎవరైనా ఉన్నారా?" అని పిలుస్తారు. ఈ ఆలయ పరిధిలో ఒక్కరు కూడా ఆకలితో పడుకోకూడదనేది స్వామివారి ఆజ్ఞ. భక్తికి, వాత్సల్యానికి ప్రతీకగా నిలిచే ఈ తిరువరపు కన్నయ్యను దర్శిస్తే జీవితంలో ఆకలి బాధలుండవని భక్తుల నమ్మకం.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story