Navagraha Dosha Remedies: నవగ్రహ దోషాలకు అత్యంత సులభమైన పరిష్కారం...వీరికి సేవ చేయండి చాలు
నవగ్రహ దోషాల నుంచి విముక్తి పొందడానికి సులభమైన ఆధ్యాత్మిక పరిహారాలను తెలుసుకుందాం. సూర్యుడు నుంచి రాహు-కేతువుల వరకు ప్రతి గ్రహానికి సంబంధించిన సేవా మార్గాలు, వాటి ప్రాముఖ్యత, శుభఫలితాల గురించి వివరంగా తెలుసుకుందాం.
Navagraha Dosha Remedies: మానవ జీవితంలోని సుఖదుఃఖాలు, ఐశ్వర్యం, ఆరోగ్యం, బంధాలు అన్నీ నవగ్రహాల గమనంపైనే ఆధారపడి ఉంటాయని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. జాతకంలో గ్రహాలు అనుకూలిస్తే రాజులవుతారు.. అదే ప్రతికూలిస్తే జీవితం తలక్రిందులవుతుంది. అయితే, ఈ నవగ్రహ దోషాల నుండి విముక్తి పొందడానికి ఖరీదైన పూజలు, హోమాలు మాత్రమే కాదు.. సమాజంలో దైవస్వరూపులుగా ఉన్న కొందరు వ్యక్తులకు సేవ చేయడం ద్వారా అత్యంత సులభంగా గ్రహానుకూలతను పొందవచ్చని పండితులు సూచిస్తున్నారు. మానవ సేవే మాధవ సేవ అనే సూత్రం ఇక్కడ అక్షరాలా నిజమవుతుంది. తొమ్మిది గ్రహాల అనుగ్రహం కోసం మనం ఎవరికి సపర్యలు చేయాలో శాస్త్రోక్తంగా తెలుసుకుందాం.
నవగ్రహాలు... తొమ్మిది రకాల పరిహారాలు
మన నిత్యజీవితంలో చేసే సేవా కార్యక్రమాలు ఏయే గ్రహాల దోషాలను హరిస్తాయో స్పష్టంగా తెలుసుకుందాం. నవగ్రహాలకు అధిపతి సూర్యుడు. ఆయన అనుగ్రహం కోసం సమాజంలో నలుగురికి ఉపయోగపడే పనులు చేయాలి. దీని వలన సూర్యగ్రహ దోషాలు తొలగిపోయి నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. ఇక చంద్రగ్రహ దోషం నుంచి బయటపడేందుకు వృద్దులకు, పెద్దవారికి మనస్పూర్తిగా సపర్యలు చేయాలి. జాతకంలో అంగారక గ్రహ దోషాలు తొలగిపోవాలంటే దేశాన్ని కాపాడే రక్షణరంగంలోని వారికి సహాయపడాలి. బుద్ధి కారకుడైన బుధగ్రహ దోష నివారణ కోసం పేదలకు, అనాథలకు సహాయం చేయాలి. జ్ఞానానికి అధిపతి అయిన బృహస్పతి అనుగ్రహం కోసం గురువులను దైవంతో సమానంగా ఆరాధించాలి. శుక్రగ్రహ దోషాలనుంచి విముక్తి పొందాలంటే దృష్టిలోపం ఉన్నవారికి సహకరించాలి. అదేవిధంగా కర్మఫలదాత శనీశ్వరుని అనుగ్రహం పొందాలంటే దివ్యాంగులకు తమకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందించాలి. చివరిగా రాహుకేతు గ్రహాల నుంచి విముక్తి లభించాలంటే నాడీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నవారికి సహాయం చేయాలి. తద్వారా ఆధ్యాత్మిక వృద్ది కలుగుతుంది. జీవితంలో ఎదురయ్యే కష్టనష్టాల నుంచి విముక్తి లభిస్తుంది.
సేవే మార్గం
జ్యోతిష్య పరిహారాల వెనుక ఉన్న అంతరార్థం సమాజ హితమే. కేవలం రాళ్లు ధరించడం కన్నా, అవసరంలో ఉన్నవారిని ఆదుకోవడం ద్వారా గ్రహాధిపతులు ప్రసన్నులవుతారు. కఠినమైన నియమాలతో పూజలు చేయలేని సామాన్య ప్రజలకు ఈ 'సేవా యజ్ఞం' ఒక అద్భుతమైన మార్గం. జాతకంలో గ్రహాలు ఏ స్థితిలో ఉన్నా, నిస్సహాయులకు చేసే సేవ ఆయా గ్రహాల క్రూరత్వాన్ని తగ్గించి, జీవితంలో శుభ ఫలితాలను ఇస్తుందని పండితులు చెబుతున్నారు. మరెందుకు ఆలస్యం మీ జాతకంలో ఉన్న గ్రహదోషాలను అనుసరించి సేవలు చేయండి. జీవితంలో శుభకరమైన ఫలితాలను పొందండి.




