Karthika Masam: రేపు కోటి సోమవారం.. శివుడిని అభిషేకిస్తే ఐశ్వర్యం మీవెంటే!
Karthika Masam: కార్తీక మాసంలో వచ్చే కోటి సోమవారం నవంబర్ 16న రాగా, ఆ రోజు చేసే శివాభిషేకాలు, పూజలు, దీపారాధన, దానధర్మాలు కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తాయని సంప్రదాయ నిపుణులు చెబుతున్నారు.
Karthika Masam: కార్తీక మాసంలో వచ్చే కోటి సోమవారం అత్యంత పవిత్రమైనది. రేపు చేసే అభిషేకాలు, పూజలు, దీపారాధన, దానధర్మాలు కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తాయని సంప్రదాయ నిపుణులు చెబుతున్నారు. శివలింగానికి జలాభిషేకం, బిల్వపత్రాలను సమర్పించి 'ఓం నమః శివాయ' మంత్ర జపంతో శివుడిని ఆరాధించడం వల్ల పాపవిముక్తి, మానసిక ప్రశాంతత, ఐశ్వర్యం కలుగుతాయని వివరిస్తున్నారు. ఉదయాన్నే శివాలయానికి వెళ్లి శుద్ధ జలంతో అభిషేకం చేయాలని సూచిస్తున్నారు.
కార్తీక మాసం ఈసారి నవంబర్ 10న మొదలై డిసెంబర్ 8తో ముగుస్తుంది. ఈ నెలలో నాలుగు కార్తీక సోమవారాలు ఉన్నాయి. అవి నవంబర్ 16, 23, 30, డిసెంబర్ 7. మొదటి కార్తీక సోమవారమైన నవంబర్ 16నే కోటి సోమవారం అని కొన్ని తెలుగు పంచాంగాలు చెబుతున్నాయి. ఆ రోజు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడని, శుక్ల సప్తమి తిథి ఉంటుందని కూడా అవి పేర్కొంటున్నాయి. ఈ రోజు వృశ్చిక సంక్రాంతి కూడా వచ్చింది.
కోటి సోమవారం నాడు భక్తులు ఉపవాసం ఉంటారు. ఉదయాన్నే స్నానం చేసి శివలింగానికి నీరు, పాలు లేదా పంచామృతంతో అభిషేకం చేస్తారు. బిల్వపత్రాలు, పూలు, చందనం, విభూతిని సమర్పిస్తారు. 'ఓం నమః శివాయ' జపించడం లేదా రుద్రం, బిల్వాష్టకం పఠించడం ఆనవాయితీ. సాయంత్రం దీపారాధన చేసి కర్పూర హారతి ఇచ్చి నైవేద్యం సమర్పిస్తారు. కుటుంబ సంప్రదాయం ప్రకారం సాయంత్రం ఉపవాసం విరమిస్తారు.
ఈ రోజు దీపదానం చేయడం, పేదలకు అన్నదానం, వస్త్రదానం చేయడం పుణ్యఫలాన్నిస్తుందని భక్తులు భావిస్తారు. శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయం, వేములవాడ, పంచారామ క్షేత్రాల్లో ఈ రోజు భక్తుల రద్దీ భారీగా ఉంటుంది. తెల్లవారుజామునే బారులు తీరి దర్శనం చేసుకునేందుకు భక్తులు ఆసక్తి చూపుతారు.




