Kalabhairava Tears Mystery: ఈ ఆలయంలో కాలభైరవుడు కన్నీరు కారుస్తాడు...ఐదు వేల సంవత్సరాలుగా వీడని రహస్యం
హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా లోయలో వజ్రేశ్వరీ దేవి ఆలయంలోని కాలభైరవుడి విగ్రహం కన్నీరు పెడుతుంది. శాస్త్రవేత్తలు సైతం ఈ చిక్కుముడిని విప్పలేకపోయారు.
Kalabhairava Tears Mystery: భారతదేశంలో సైన్స్‌కు కూడా సవాల్ విసిరే ఆధ్యాత్మిక రహస్యాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా లోయలో వెలిసిన వజ్రేశ్వరీ దేవి ఆలయం అత్యంత విశిష్టమైనది. ఈ క్షేత్రంలో ఉన్న క్షేత్రపాలకుడు కాలభైరవుడి విగ్రహం, రాబోయే ఆపదలను ముందే ఊహించి కన్నీరు కార్చడం గత 5,000 సంవత్సరాలుగా శాస్త్రవేత్తలకు అంతుచిక్కని ఒక మహా వింతగా మారింది. 51 శక్తిపీఠాలలో ఒకటిగా విరాజిల్లుతున్న ఈ ఆలయంలోని అద్భుత విశేషాలను తెలుసుకుందాం.
ఆపదను ముందే చెప్పే కాలభైరవుడు
ఈ వజ్రేశ్వరీ దేవి ఆలయంలో అత్యంత ముఖ్యమైనది, రహస్యమైనది కాలభైరవ స్వామి విగ్రహం. స్థానిక ప్రజలు చెబుతున్నదాని ప్రకారం, స్థానికంగా లేదా దేశానికి ఏదైనా పెద్ద సంక్షోభం లేదా కరువు లేదా ప్రకృతికి సంబంధించిన ఇబ్బందులు, వైపరిత్యాలు రాబోతుంటే... ఇక్కడి కాలభైరవుడి విగ్రహం కళ్ల నుంచి నీరు కారుతుంది. కొన్ని సందర్భాల్లో స్వామివారి విగ్రహం నుంచి స్వేదబిందువులు కూడా వస్తాయని చెబుతున్నారు. ఇలా విగ్రహం నుంచి కన్నీరు వస్తుందని గమనించిన వెంటనే ఆలయ పూజారులు, కాంగ్రా లోయలోని ప్రజలు అప్రమత్తమౌతారు. లోకకళ్యాణం కోసం శాంతి కోసం ప్రత్యేకించి హోమాలు, రుద్రాభిషేకాలు, పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తారు. మానవ మాత్రులమైన మనం ఆపద నుంచి గట్టెక్కించమని మాత్రమే స్వామివారిని కోరుకోగలం. అందుకే హోమాలు, యజ్ఞాలు, అభిషేకాల ద్వారా స్వామిని ప్రసన్నం చేసుకొని గండం నుంచి గట్టెక్కించమని కోరుకుంటాం. అయితే, ఈ వింతను పరిశోధించిన శాస్త్రవేత్తలకు కన్నీరు, స్వేదబిందువులు ఎలా వస్తున్నాయన్నది ఇప్పటి వరకు అర్ధంకాని ప్రశ్నగానే మిగిలిపోయింది. సమాధానం కోసం ఎన్నో దశాబ్ధాలుగా శాస్త్రవేత్తలు పరిశోధిస్తూనే ఉన్నారు.
దూరానికే కనిపించే బంగారు కలశం
ఈ 11వ శతాబ్దపు ఆలయంలో మరో వింత ఉంది. గర్భగుడిలో ఉన్న మూలవిరాట్ రూపం ఎంత దగ్గరకు వెళ్లినా భక్తులకు అంత స్పష్టంగా కనిపించదు. కానీ, ఆలయ శిఖరంపై ఉన్న చిన్న బంగారు కలశం మాత్రం మైళ్ల దూరం నుండి చూసినా అత్యంత స్పష్టంగా, ప్రకాశవంతంగా కాంతులీనుతూ కనిపిస్తుంది. ఈ నిర్మాణ శైలి వెనుక ఉన్న రహస్యం ఇప్పటికీ ఎవరికీ అర్థం కాదు.
సతీదేవి పవిత్ర శక్తిపీఠం
పురాణాల ప్రకారం, దక్షయజ్ఞం వేళ సతీదేవి ఆత్మహుతి చేసుకున్న తర్వాత, శివుడు ఆమె మృతదేహాన్ని మోస్తూ తాండవం చేశాడు. అప్పుడు విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని 51 భాగాలుగా ఖండించగా, ఆమె ఎడమ రొమ్ము భాగం పడిన పవిత్ర స్థలమే ఈ కాంగ్రా క్షేత్రం. అందుకే ఇక్కడ అమ్మవారిని వజ్రేశ్వరీ దేవిగా, కాంగ్రామాయిగా భక్తులు ఎంతో భక్తితో కొలుస్తారు. వైజ్ఞానిక ఆలోచనలకు అందనంత ఎత్తులో, కేవలం భక్తి విశ్వాసాల పునాదులపై నడుస్తున్న ఈ ఆలయం, భగవంతుని ఉనికికి ఒక సజీవ నిదర్శనమని చెప్పవచ్చు.




