Human Lifespan 80 Years: మనిషి ఆయుర్థాయం ఎలా పెరిగింది...భగంతుడు చెప్పిన లెక్కలు ఇవే

మనిషి ఆయుర్దాయం 80 ఏళ్లు ఎలా అయ్యింది? కుక్క, కోతి, ఆవు వదులుకున్న జీవితకాలాన్ని మనిషి కోరుకున్నాడనే ఆసక్తికరమైన ఆధ్యాత్మిక కథ వెనుక ఉన్న సందేశం తెలుసుకుందాం.

Rudrachander
Published on: 11 Nov 2026 1:20 PM IST
Human Lifespan 80 Years: మనిషి ఆయుర్థాయం ఎలా పెరిగింది...భగంతుడు చెప్పిన లెక్కలు ఇవే
X

Human Lifespan 80 Years: మనిషి జీవితంలో బాల్యం, యవ్వనం, కుటుంబ బాధ్యతలు, వృద్ధాప్యం.. ఇలా ప్రతి దశకు ఒక ప్రత్యేకత ఉంటుంది. చిన్నతనంలో ఆటపాటలతో కాలం గడిపే మనిషి, యుక్తవయసులో తన భవిష్యత్తు కోసం కష్టపడతాడు. పెళ్లి తర్వాత కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకుంటాడు. వృద్ధాప్యంలో మనవళ్లు, మనవరాళ్లతో సమయం గడుపుతాడు. అయితే మనిషికి నిజంగా ఎంతకాలం జీవించే అవకాశం ఉంది? భగవంతుడు మొదట నిర్ణయించిన ఆయుర్దాయం ఎంత? మనిషి జీవితం 80 ఏళ్లకు చేరడం వెనుక ఒక ఆసక్తికరమైన ఆధ్యాత్మిక కథ ప్రచారంలో ఉంది. ఒకరోజు ఓ శిష్యుడు తన గురువును ఇదే ప్రశ్న అడిగాడు. మనిషి జీవితకాలాన్ని ఎవరు నిర్ణయించారు? ప్రతి ఒక్కరూ నిండు నూరేళ్లు జీవించాలని కోరుకుంటారు కదా.. మరి అందరికీ అంత ఆయుష్షు ఎందుకు ఉండటం లేదు? అని ప్రశ్నించాడు. అప్పుడు గురువు ఒక కథ ద్వారా జీవితంలోని అసలు విషయాన్ని వివరించాడు.

కుక్క, కోతి, ఆవు కోరుకున్న ఆయుష్షు ఎంత?

సృష్టి ప్రారంభంలో భగవంతుడు ఒక్కో జీవిని సృష్టిస్తూ వాటి జీవితకాలాన్ని నిర్ణయించాడట. మొదట కుక్కను పిలిచి, నీకు 20 ఏళ్ల ఆయుష్షు ఇస్తున్నాను. ఇంటి ముందు కాపలా కాస్తూ, అపరిచితులు వస్తే మొరుగుతూ ఉండాలని చెప్పాడట. అయితే కుక్క మాత్రం అంతకాలం అలా ఉండటం తనకు ఇష్టం లేదని చెప్పి, కేవలం 7 ఏళ్లు మాత్రమే కావాలని కోరిందట. ఆ తర్వాత కోతిని సృష్టించి 20 ఏళ్ల పాటు తన సహజమైన చేష్టలతో అందరినీ నవ్వించాలని భగవంతుడు చెప్పాడట. కానీ కోతి కూడా అంతకాలం అలా జీవించడం కష్టమని భావించి, తనకు 7 సంవత్సరాల ఆయుష్షు చాలని కోరిందట. చివరగా ఆవును పిలిచి 60 ఏళ్ల జీవితాన్ని ఇస్తున్నానని చెప్పాడట. మనుషులకు పాలు ఇవ్వడం, వ్యవసాయ పనుల్లో సహాయపడటం వంటి బాధ్యతలు నిర్వర్తించాలని సూచించాడట. అయితే ఆవు కూడా అంతకాలం కష్టపడలేనని చెప్పి, తనకు 20 ఏళ్లు మాత్రమే ఉంచి మిగిలిన 40 ఏళ్లు తిరిగి తీసుకోమని అడిగిందట.

మనిషి మాత్రం ఎక్కువ ఆయుష్షు కోరుకున్నాడు!

అందరి తర్వాత మనిషిని సృష్టించిన భగవంతుడు మొదట అతనికి 20 ఏళ్ల ఆయుష్షు మాత్రమే నిర్ణయించాడట. కానీ మనిషి అందుకు అంగీకరించలేదు. ఇతర జీవులు వదులుకున్న జీవితకాలాన్ని తనకు ఇవ్వాలని కోరాడట. అలా ఆవు వదిలేసిన 40 ఏళ్లు, కోతి వదులుకున్న 7 ఏళ్లు, కుక్క వదిలేసిన 13 ఏళ్లు తనకు కలపాలని అడిగాడట. మొత్తం 60 ఏళ్లు అదనంగా రావడంతో మనిషి ఆయుష్షు 80 ఏళ్లకు చేరిందట.

మనిషి జీవితంలోని నాలుగు దశలు ఇవే!

ఈ కథలో గురువు చెప్పిన అసలు విషయం ఇక్కడే ఉంది. మనిషి మొదటి 20 ఏళ్లు తన ఇష్టానుసారం తింటూ, తిరుగుతూ, చదువుకుంటూ ఆనందంగా గడుపుతాడు. తర్వాతి 40 ఏళ్లు ఆవులా కుటుంబం కోసం కష్టపడతాడు. భార్యాపిల్లల బాధ్యతలు, సంపాదన, ఆస్తిపాస్తులు అంటూ నిరంతరం శ్రమిస్తాడు. ఆ తర్వాతి 7 ఏళ్లు కోతి మాదిరిగా మనవళ్లు, మనవరాళ్లతో ఆటపాటల్లో కాలం గడుపుతాడు. చివరి 13 ఏళ్లు కుక్కలా ఇంటి దగ్గర కూర్చొని కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారిని గమనిస్తూ కాలం వెళ్లదీస్తాడని గురువు వివరించాడట.

ఈ కథ మనకు ఇచ్చే సందేశం ఏమిటి?

ఈ కథను కేవలం మనిషి ఆయుష్షుకు సంబంధించిన పురాణగాథగా మాత్రమే చూడకూడదు. ఇందులో జీవితానికి సంబంధించిన ఒక గొప్ప సందేశం ఉంది. సంపాదన, కుటుంబ బాధ్యతలు, ఆస్తుల కోసం జీవితంలోని విలువైన సమయాన్ని మొత్తం ఖర్చు చేయకూడదని ఇది గుర్తుచేస్తుంది. నిజానికి మనిషి జీవితకాలం ఎంత అనేది ప్రకృతి నిర్ణయిస్తుంది. 80 ఏళ్లు జీవించినా, 100 ఏళ్లు బతికినా ఆరోగ్యం, ఆత్మసంతృప్తి, కుటుంబంతో గడిపే సమయం లేకపోతే జీవితంలోని ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించలేడు. అందుకే ఉన్న జీవితాన్ని ఆరోగ్యంగా, సంతోషంగా, ఇతరులకు ఉపయోగపడేలా గడపడమే మనిషి ముందున్న అసలైన లక్ష్యం అని ఈ ఆధ్యాత్మిక కథ మనకు తెలియజేస్తుంది.

Rudrachander

Rudrachander

రుద్ర చందర్‌ తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు