Haridwar Ardh Kumbh Mela 2027: అర్థకుంభమేళకు రెడీ అవుతున్న హరిద్వార్‌...ఎప్పటి నుంచి ప్రారంభమంటే

2027 హరిద్వార్ అర్ధకుంభమేళా జనవరి 14 నుంచి ఏప్రిల్ 20 వరకు జరగనుంది. 11 పవిత్ర స్నాన తేదీలు, అమృత స్నానాల విశేషాలు, కుంభమేళా ప్రాధాన్యత గురించి తెలుసుకుందాం.

Rudrachander
Published on: 28 Nov 2026 11:19 AM IST
Haridwar Ardh Kumbh Mela 2027: అర్థకుంభమేళకు రెడీ అవుతున్న హరిద్వార్‌...ఎప్పటి నుంచి ప్రారంభమంటే
X

Haridwar Ardh Kumbh Mela 2027: భారతదేశ ఆధ్యాత్మిక చరిత్రలో కుంభమేళాకు ప్రత్యేక స్థానం ఉంది. కొన్ని పండుగలు ఒక ప్రాంతానికే పరిమితమైతే.. కుంభమేళా మాత్రం దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలను ఒకే ఆధ్యాత్మిక వేదికపైకి తీసుకొస్తుంది. కుల, మత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా లక్షలాది మంది భక్తులు పవిత్ర నదుల్లో స్నానాలు ఆచరించేందుకు తరలివస్తారు. సాధువులు, సన్యాసులు, అఖాడాల సందడి మధ్య జరిగే ఈ వేడుక భారతీయ సనాతన సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుంది. 2025లో ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహాకుంభమేళా తర్వాత ఇప్పుడు అందరి దృష్టి ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌పై పడింది. 2027లో ఇక్కడ అర్ధకుంభమేళా జరగనుండటంతో ఇప్పటి నుంచే ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి.

2025 మహాకుంభమేళా తర్వాత మరో భారీ ఆధ్యాత్మిక వేడుక

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో 2025 జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మహాకుంభమేళా నిర్వహించారు. మొత్తం 45 రోజుల పాటు సాగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి దేశవిదేశాల నుంచి భక్తులు వచ్చారు. అధికారిక గణాంకాల ప్రకారం ఈ వేడుకలో 66 కోట్ల మందికి పైగా భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించారు. గంగా, యమునా, అంతర్వాహినిగా భావించే సరస్వతి నదుల సంగమం వద్ద జరిగిన ఈ వేడుక ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇప్పుడు అదే స్థాయిలో మరో ఆధ్యాత్మిక సందడికి హరిద్వార్ సిద్ధమవుతోంది. గంగానది తీరంలో జరిగే అర్ధకుంభమేళాకు సాధువులు, అఖాడాలు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు. ముఖ్యంగా హర్ కీ పౌరీ ఘాట్‌లో జరిగే పవిత్ర స్నానాలు, గంగా హారతి ఈ వేడుకలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

2027 జనవరి 14 నుంచి అర్ధకుంభమేళా

హరిద్వార్‌లో 2027 జనవరి 14 నుంచి ఏప్రిల్ 20 వరకు అర్ధకుంభమేళా నిర్వహించనున్నారు. మకర సంక్రాంతితో ప్రారంభమయ్యే ఈ ఆధ్యాత్మిక వేడుక చైత్ర పౌర్ణమి వరకు కొనసాగుతుంది. దాదాపు మూడు నెలల పాటు జరిగే ఈ కార్యక్రమంలో మొత్తం 11 పవిత్ర స్నాన పర్వదినాలు ఉన్నాయి. వీటిలో నాలుగు అమృత స్నానాలకు విశేష ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా మహాశివరాత్రి, ఫాల్గుణ అమావాస్య, దేవ్ డోలీ స్నానం, మేష సంక్రాంతి రోజుల్లో భక్తుల రాక మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ రోజుల్లో గంగానదిలో పవిత్ర స్నానం చేయడం వల్ల పాపాలు తొలగి, పుణ్యఫలం లభిస్తుందని హిందూ సంప్రదాయం విశ్వసిస్తుంది.

హరిద్వార్ అర్ధకుంభమేళా 11 పవిత్ర స్నాన తేదీలు

జనవరి 14, 2027 – మకర సంక్రాంతి, ఫిబ్రవరి 6 – మౌని అమావాస్య, ఫిబ్రవరి 11 – వసంత పంచమి, ఫిబ్రవరి 20 – మాఘ పౌర్ణమి, మార్చి 6 – మహాశివరాత్రి (అమృత స్నానం), మార్చి 8 – ఫాల్గుణ అమావాస్య (అమృత స్నానం), మార్చి 15 – దేవ్ డోలీ స్నానం (అమృత స్నానం), ఏప్రిల్ 7 – నవ సంవత్సర స్నానం, ఏప్రిల్ 14 – మేష సంక్రాంతి (ప్రధాన అమృత స్నానం), ఏప్రిల్ 15 – శ్రీరామ నవమి, ఏప్రిల్ 20 – చైత్ర పౌర్ణమి (చివరి స్నానం).

ఆరు సంవత్సరాలకోసారి అర్ధకుంభమేళా ఎందుకు?

కుంభమేళా నిర్వహణకు జ్యోతిషశాస్త్రం, గ్రహాల సంచారం, సూర్యుడు, గురుగ్రహ స్థానాలకు ప్రాధాన్యత ఉంటుంది. సంప్రదాయం ప్రకారం హరిద్వార్, ప్రయాగ్‌రాజ్ వంటి పుణ్యక్షేత్రాల్లో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పూర్ణ కుంభమేళా, మధ్యలో ఆరు సంవత్సరాలకు ఒకసారి అర్ధకుంభమేళా నిర్వహిస్తారు. హరిద్వార్‌లో 2021లో చివరిసారిగా కుంభమేళా జరిగింది. ఈ నేపథ్యంలో 2027లో జరిగే వేడుకను అర్ధకుంభమేళాగా పిలుస్తున్నారు. అయితే ఈసారి అర్ధకుంభమేళాను కూడా పూర్ణకుంభమేళాకు ఏమాత్రం తీసిపోని విధంగా నిర్వహించేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. భక్తులకు రవాణా, వసతి, భద్రత, ఘాట్‌ల వద్ద సౌకర్యాలు కల్పించడం కీలకంగా మారనుంది.

గంగాస్నానానికి మించిన ఆధ్యాత్మిక అనుభూతి

హిందూ ధర్మంలో గంగానదిని కేవలం ఒక నదిగా మాత్రమే చూడరు. గంగమ్మను పాపహారిణిగా, మోక్షప్రదాయినిగా కొలుస్తారు. హరిద్వార్‌లోని హర్ కీ పౌరీకి మరింత ప్రత్యేకత ఉంది. ఇక్కడ గంగాస్నానం చేసి, దీపాలు వెలిగించి, గంగా మాతకు హారతి ఇవ్వడం భక్తులు పవిత్రమైన అనుభూతిగా భావిస్తారు. కుంభమేళా సమయంలో సాధువుల ప్రవచనాలు, అఖాడాల సంప్రదాయ కార్యక్రమాలు, భజనలు, పూజలు, గంగా హారతులు భక్తులను ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. అందుకే కుంభమేళా అంటే కేవలం నదిలో స్నానం చేయడం మాత్రమే కాదు. మన సంప్రదాయాలను గుర్తుచేసుకోవడం, ఆధ్యాత్మిక చింతనకు సమయం కేటాయించడం, దేశంలోని భిన్న ప్రాంతాల ప్రజలను ఒకచోట కలిపే మహత్తర వేడుక కూడా. 2027లో హరిద్వార్‌లో జరగనున్న అర్ధకుంభమేళా ఈ ప్రత్యేకతలన్నింటినీ మరోసారి ప్రపంచానికి పరిచయం చేయనుంది. గంగమ్మ సన్నిధిలో పవిత్ర స్నానం ఆచరించాలని ఎదురుచూస్తున్న భక్తులకు ఈ వేడుక ఒక విశేష ఆధ్యాత్మిక అవకాశంగా నిలవనుంది.

Rudrachander

Rudrachander

రుద్ర చందర్‌ తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు