True Happiness in Life: గురువు చెప్పినట్టు చేస్తే... నిజమైన ఆనందం ఖచ్చితంగా దొరుకుతుంది
గురువు చెప్పిన చిన్న కథ ద్వారా నిజమైన ఆనందం ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు. మన దగ్గర ఉన్నదాని విలువను గుర్తించి, కోరికలు మరియు వ్యామోహాన్ని తగ్గిస్తే ఆనందం ఎలా దొరుకుతుందో తెలుసుకుందాం.
True Happiness in Life: మనకు ఆనందం కావాలి. కానీ అది ఎక్కడ దొరుకుతుందో మాత్రం చాలాసార్లు మనకే తెలియదు. డబ్బు వస్తే ఆనందం, కొత్త వస్తువు కొంటే ఆనందం, ఇతరులు మెచ్చుకుంటే ఆనందం.. ఇలా ఒక్కో సమయంలో ఒక్కో దానిలో సంతోషాన్ని వెతుకుతుంటాం. అది దొరికినంతసేపు బాగానే ఉంటుంది. మళ్లీ కొంతకాలానికి మరో కోరిక మొదలవుతుంది. అసలు ఆనందం అంటే ఏమిటి? అది బయట ఎక్కడైనా దొరికేదా? లేక మనలోనే ఉందా? ఈ ప్రశ్నకు ఓ గురువు చెప్పిన చిన్న కథ ఎంతో చక్కగా సమాధానం చెబుతుంది.
ఆనందం కోసం వెతుకుతున్న యువకుడు
ఒక గ్రామంలో ఓ యువకుడు ఉండేవాడు. అతని మనసులో ఎప్పుడూ ఒక ప్రశ్న తిరుగుతూ ఉండేది. “నిజమైన ఆనందం ఎక్కడ దొరుకుతుంది?” అనే సందేహం అతడిని వెంటాడేది. ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని తెలిసిన వారిని అడిగాడు. పెద్దలను కలిశాడు. దారిలో కనిపించిన వారితో మాట్లాడాడు. ఒక్కొక్కరు ఒక్కో సమాధానం చెప్పారు. కానీ అతడి మనసుకు సరైన సమాధానం మాత్రం దొరకలేదు. ఒకరోజు ఆ గ్రామానికి ఓ గురువు వచ్చారని తెలిసింది. వెంటనే ఆయన దగ్గరకు వెళ్లిన యువకుడు తన సందేహాన్ని వివరించాడు. యువకుడి మాటలు విన్న గురువు చిరునవ్వు నవ్వారు. వెంటనే ప్రశ్నకు సమాధానం చెప్పకుండా, “నీ చెప్పుల సైజు ఎంత?” అని అడిగారు. యువకుడు కాసేపు ఆశ్చర్యపోయి “8” అని చెప్పాడు. “నువ్వు వేసుకున్న చెప్పుల సైజు కూడా 8 కదా?” అని గురువు అడిగారు. “అవును” అన్నాడు యువకుడు. అప్పుడు గురువు అతడిని మరో పని చేయమన్నారు. “నీ 8 సైజు చెప్పులను ఇక్కడే వదిలిపెట్టు. ఈ 7 సైజు చెప్పులు వేసుకుని సాయంత్రం వరకు బయట తిరిగి రా. ఆ తర్వాత మళ్లీ నా దగ్గరకు రా” అన్నారు. యువకుడు గురువు చెప్పినట్టే చేశాడు.
చిన్న చెప్పులు.. పెద్ద నొప్పి
మొదట్లో 7 సైజు చెప్పులతో నడవడం పెద్దగా ఇబ్బందిగా అనిపించలేదు. కొద్దిసేపటికి మాత్రం కాళ్లలో నొప్పి మొదలైంది. మరికొంత సమయం గడిచే సరికి నడవడం కూడా కష్టంగా మారింది. అయినా గురువు చెప్పిన మాట కాబట్టి భరిస్తూ ముందుకు సాగాడు. ప్రతి అడుగూ నొప్పితోనే పడుతోంది. ఎప్పుడు సాయంత్రం అవుతుందా? ఎప్పుడు ఆ చెప్పులు విప్పుతానా? అనే ఆలోచనే అతడి మనసులో ఉంది. చివరకు సాయంత్రం వచ్చింది. వెంటనే గురువు దగ్గరకు చేరుకున్నాడు. చెప్పులు విప్పగానే పెద్ద ఊపిరి పీల్చుకున్నాడు. “హమ్మయ్య.. ఇప్పుడు చాలా హాయిగా ఉంది. ఈ చెప్పులు విప్పిన వెంటనే ఎంతో ఆనందంగా అనిపిస్తోంది” అని గురువుతో చెప్పాడు. అప్పుడు గురువు నవ్వుతూ అసలు విషయాన్ని చెప్పారు. ఆనందం మన దగ్గరే ఉంటుంది “నువ్వు ఇప్పుడే అనుభవించినదే జీవితంలోని ఆనందానికి ఉదాహరణ” అన్నారు గురువు. “నీకు సరిపోయే 8 సైజు చెప్పులు నీ దగ్గరే ఉన్నాయి. కానీ 7 సైజు చెప్పులు వేసుకుని నువ్వే ఇబ్బంది పడ్డావు. అవి విప్పిన తర్వాత నీ దగ్గర ఉన్న సౌకర్యం ఎంత విలువైనదో నీకు అర్థమైంది.” “మన జీవితంలో కూడా ఇలాగే జరుగుతుంది. మన దగ్గర ఉన్నదాన్ని ఆస్వాదించడం మరిచిపోయి, మనకు లేనిదాని కోసం పరుగులు తీస్తుంటాం. అది దొరికితేనే ఆనందం వస్తుందని అనుకుంటాం. కానీ ఒక కోరిక తీరగానే మరో కోరిక మొదలవుతుంది.”
గురువు మాటలు యువకుడికి అర్థమయ్యాయి.
డబ్బు కావాలి.. ఇంకా ఎక్కువ డబ్బు కావాలి. ఒక వస్తువు కావాలి.. అది వచ్చిన తర్వాత మరో వస్తువు కావాలి. ఇతరులు మెచ్చుకోవాలి.. మెచ్చుకున్న తర్వాత మరింత గుర్తింపు కావాలి. చివరకు “నేను ఇతరులకంటే గొప్ప” అనే భావన కూడా మనశ్శాంతిని దూరం చేస్తుంది. ఇవన్నీ జీవితంలో అవసరమైనవిగా కనిపించినా, వాటిపైనే మన ఆనందాన్ని ఆధారపెడితే మాత్రం మనసుకు ప్రశాంతత దూరమవుతుంది.
విలువైనది ఏదో గుర్తించాలి
మన జీవితంలో నిజంగా విలువైనవి ఏంటి అనే విషయాన్ని గుర్తించడం చాలా ముఖ్యం. ఆరోగ్యం, కుటుంబం, మనశ్శాంతి, మంచి సంబంధాలు, ఆత్మసంతృప్తి వంటి విషయాలను పక్కన పెట్టి కేవలం డబ్బు, వస్తువులు, పేరు, ఇతరుల ప్రశంసల కోసం పరుగెత్తితే చివరికి మనకే నష్టం. ఆనందం కోసం ప్రపంచమంతా వెతకాల్సిన అవసరం లేదని ఈ కథ చెబుతుంది. మన దగ్గర ఉన్నదాన్ని తక్కువగా చూడకుండా, దాని విలువను అర్థం చేసుకుని జీవించడం నేర్చుకోవాలి. మనకు సరిపడే చెప్పులు ఉన్నా.. వాటిని వదిలేసి చిన్న చెప్పులు వేసుకుని నొప్పి పడటం ఎంత అవివేకమో, మన జీవితంలో ఉన్న చిన్న చిన్న ఆనందాలను వదిలేసి లేని వాటి కోసం బాధపడటం కూడా అంతే. అందుకే పండితులు చెప్పే మాట ఒక్కటే.. విలువ లేనివాటికి మనం ఇచ్చే విలువను తగ్గించి, నిజంగా విలువైన వాటిని గుర్తించిన రోజే మన జీవితంలో ఆనందం మొదలవుతుంది.




