Ghantanjaneya: హనుమంతుడి గంట వెనుక దాగున్న రహస్యం... ఇలా పూజించినవారికి రెండింతలు ధైర్యం
హనుమంతుడి శీఘ్రదర్శనం కావాలన్నా... ఆయన కరుణా కటాక్షాలు భక్తులపై ఉండాలన్నా గంటాంజనేయుడి రూపాన్ని ఆరాధించాలని పండితులు చెబుతున్నారు.
Ghantanjaneya: హనుమంతుడి రూపాల్లో ఎంతో విశిష్టమైనది, శక్తివంతమైనది 'గంటాంజనేయుడి' రూపం. స్వామివారి తోక చివరి భాగంలో ఒక విశేషమైన గంట ఉండటం మనం అనేక చిత్రాల్లో, విగ్రహాల్లో చూస్తుంటాం. కేవలం భయాలను పోగొట్టడమే కాకుండా, శత్రు భయాన్ని తుడిచిపెట్టి రెండింతల ధైర్యాన్ని, శ్రీరామచంద్రుని పరిపూర్ణ అనుగ్రహాన్ని ప్రసాదించే ఈ గంటాంజనేయ ఆవిర్భావం వెనుక రామాయణంలో ఒక అద్భుతమైన ఘట్టం దాగి ఉంది.
రామ రావణ యుద్ధం
రామ-రావణ యుద్ధ ముగింపు సమయంలో సంభవించిన ఒక సంఘటన దీనికి కారణం. శ్రీరాముడి బాణాగ్నికి రావణుడి సోదరుడైన కుంభకర్ణుడు నేలకొరిగే సమయంలో, అతడి భారీ శరీరం అక్కడ ఉన్న ఒక రథానికి తగులుతుంది. ఆ ధాటికి రథంపై ఉన్న అత్యంత భారీ పరిమాణంలో ఉన్న గంట ఊడి కిందపడుతుంది. దురదృష్టవశాత్తు, వానర సైన్యంలో భాగమైన దాదాపు 1,000 మంది సింగిలీకులు (చిన్న పరిమాణంలో ఉండే వానర వీరులు) ఆ పడిన గంట కింద చిక్కుకుపోతారు.
యుద్ధం ముగిశాక శ్రీరాముడు అయోధ్యకు ప్రయాణమయ్యే ముందు సైన్యాన్ని పరిశీలిస్తుండగా, ఈ 1,000 మంది సైనికులు కనిపించరు. వారి ఆచూకీ తెలుసుకున్న శ్రీరాముడు తన ప్రియ భక్తుడైన హనుమంతుడిని పిలుస్తాడు. స్వామి ఆంతర్యాన్ని గ్రహించిన హనుమంతుడు, క్షణాల్లో అక్కడికి చేరుకుని తన సుదీర్ఘమైన తోకతో ఆ భారీ గంటను ఒక్కసారిగా పైకి లేపుతాడు. ప్రాణాపాయం నుంచి బయటపడిన ఆ వెయ్యిమంది వానరులు శ్రీరాముడికి, హనుమంతుడికి శిరస్సు వంచి నమస్కరిస్తారు.
గంటాంజనేయుడి రహస్యం
ఆనాటి నుండి శ్రీరాముని ఆజ్ఞకు, దయకు నిదర్శనంగా హనుమంతుడు ఆ గంటను తన తోకకు ధరించడం ప్రారంభించాడని పురాణాలు చెబుతున్నాయి. ఆపదల్లో ఉన్నవారిని గంట మోగించినంత వేగంగా వచ్చి కాపాడే రూపాన్నే భక్తులు గంటాంజనేయుడిగా ఆరాధిస్తారు. భయాందోళనలతో బాధపడేవారు ఈ రూపాన్ని కొలవడం వల్ల మనోధైర్యం రెట్టింపవుతుంది. వానర వీరులను ఏవిదంగా అయితే తన తోకతో గంటలను ఎత్తి కాపాడాడో అదేవిధంగా గంటతో ఉన్న హనుమంతుడిని ఆరాధించినవారికి కాపాడతారని భక్తుల విశ్వాసం. అంతేకాదు, ఇలా తోకకు గంట ఉన్న హనుమంతుడిని పూజిస్తే జాతకంలో శనిదోషాలు తొలగిపోవడమే కాకుండా, ధైర్యం రెండింతలు పెరుగుతుందని పండితులు చెబుతున్నారు. అంతేకాదు, ఆపదల్లో ఉన్నవారికి వెనువెంటనే అభయమిచ్చే శక్తి ఈ గంటాంజనేయ స్వామి పూజకు ఉందనేది భక్తుల నమ్మకం.




