Dhumavati Devi: శతృవులే కాదు...ప్రతికూల శక్తులను తరిమికొట్టే ధూమావతి... దశమహావిద్యల్లో అమ్మవారి విశిష్టత
దశమహావిద్యల్లో అత్యంత ప్రధానమైన ధూమావతిని ఆరాధించినవారికి పలు రకాలైన రోగాల నుంచి ఉపశమనం కలుగుతుంది. అమ్మవారిని విశిష్టత, పూజా విధానం గురించి తెలుసుకుందాం.
Dhumavati Devi: ధూమావతి...ఈపేరు చాలా మందికి పెద్దగా తెలియదు. కానీ, దశ మహావిద్యల గురించి తెలిసినవారికి అమ్మవారి విశిష్టత...అమ్మవారి రూపం, అమ్మవారి అనుగ్రహం ఉంటే ఏమౌతుందో తెలుస్తుంది. తంత్ర శాస్త్రాల్లో అమ్మవారిని విశిష్టంగా పూజిస్తారు. అమ్మవారిని ఆరాధించినవారికి వశ్చాతుర్యంతో పాటు పలు రకాలైన సమస్యల నుంచి బయటపడతారని పండితులు చెబుతున్నారు.
దశమహావిద్యలు...ధూమావతి విశిష్టత
తంత్ర శాస్త్రంలో దశమహావిద్యలకు అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. శతృవులపై విజయం సాధించేందుకు, ప్రకృతి శక్తులను వశం చేసుకునేందుకు దశమహావిద్యలను ఆచరిస్తారు. దశమహావిద్యలు అంటే మొత్తం పది మంది అమ్మవార్లను ఆరాధించడం. తాంత్రిక శక్తుల ఆధారంగా పూజలు నిర్వహిస్తారు. అయితే, రామకృష్ణ పరమహంస అందుకు భిన్నంగా దశమహావిద్యల్లోని కాళీ ఆరాధన సాత్విక రూపంలో ఆరాధించినట్టుగా పండితులు చెబుతున్నారు.
శక్తి సంగమ తంత్రం ప్రకారం, దక్షయజ్ఞం సమయంలో సతీదేవి అగ్ని ప్రవేశం చేయడంతో వచ్చిన ధూమం నుంచి ఉద్భవించిన రూపమే ధూమావతి. దశ మహావిద్యల్లో ఏడవ రూపం. ప్రాణతోషిణి తంత్రం ప్రకారం, ఒకానొక సందర్భంలో శివపార్వతుల మధ్య వాగ్వివాదం జరగ్గా... విథవ రూపంగా మారమని శివుడు శపించాడట. తంత్రశక్తి అయిన ధూమావతి, మధ్యవయసు కలిగిన విథావాస్త్రీగా, సన్నగా పీలగా పాలిపోయిన ముఖంతో, మాసిన దుస్తులు ధరించి, చెదిరిన జుట్టుతో ఉండే రూపమే ధూమావతి. ఒకచేతిలో జ్ఞానంతో నిండిన బుట్టను, మరొక చేయి వరదా ముద్ర, చిన్మయి ముద్రతో, గుఱ్ఱంలేని రథంమీద, కాకులు తలపై ఉండే రూపంలో అమ్మవారు దర్శనం ఇస్తారు. అమ్మవారి రూప వర్ణన ఇలానే ఉంటుంది. ఇక గుహ్యాతి గుహ్య తంత్రం ప్రకారం, అమ్మవారి శక్తిని పూజించడం వలన, వక్సుద్ధి కలుగుతుంది. భాషమీద పట్టు ఏర్పడుతుంది. పేదరికం తొలగిపోతుందని నమ్మకం. అంతేకాదు, రోగాలు తొలగిపోతాయని, తీవ్రమైన మానసిక రోగాల నుంచి విముక్తి కలుగుతుందని నమ్ముతారు.




