December 2026 Ekadashi: డిసెంబర్లో వచ్చే ఏకాదశులకు ఎందుకు అంతటి ప్రాముఖ్యత ఉంటుంది...ఉపవాసంతో పాటు ఈ నియమాలు పాటించాలి
2026 డిసెంబర్లో ఉత్పన్న, మోక్షద ఏకాదశులు ఎప్పుడు వస్తాయి? తిథులు, శుభ ముహూర్తాలు, ఉపవాస నియమాలు, పూజా విధానం, ఈ రెండు ఏకాదశుల ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.
December 2026 Ekadashi: హిందూ సంప్రదాయంలో ఏకాదశి వ్రతానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా శ్రీమహావిష్ణువును ఆరాధించే భక్తులు ఈ రోజును అత్యంత పవిత్రంగా భావిస్తారు. ప్రతి నెలలో కృష్ణ పక్షం, శుక్ల పక్షంలో ఒక్కొక్క ఏకాదశి వస్తుంది. ఈ రెండు రోజుల్లో ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని పూజించడం వల్ల పుణ్యఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం. అయితే 2026 డిసెంబర్లో వచ్చే ఉత్పన్న ఏకాదశి, మోక్షద ఏకాదశులకు మరింత ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. ఒకటి ఏకాదశి దేవి ఆవిర్భావానికి గుర్తుగా నిలిస్తే.. మరొకటి మోక్షప్రాప్తితో పాటు భగవద్గీత బోధనలను స్మరించుకునే పవిత్ర రోజుగా ప్రసిద్ధి చెందింది. ఈ నేపథ్యంలో ఈ రెండు ఏకాదశుల తేదీలు, పూజా సమయాలు, ఉపవాస నియమాలు తెలుసుకుందాం.
డిసెంబర్లో ఏకాదశులు ఎప్పుడు?
2026 డిసెంబర్లో మొదట ఉత్పన్న ఏకాదశి, ఆ తర్వాత మోక్షద ఏకాదశి వస్తాయి. పంచాంగం ప్రకారం ఉదయ తిథిని పరిగణనలోకి తీసుకుని ఈ వ్రతాలను నిర్వహిస్తారు. ఉత్పన్న ఏకాదశి డిసెంబర్ 4, శుక్రవారం కాగా, మోక్షద ఏకాదశి డిసెంబర్ 20, ఆదివారం రోజున వస్తుంది. ఈ రెండు రోజుల్లో శ్రీమహావిష్ణువును పూజించి ఉపవాసం ఉండటం శుభప్రదమని పురాణాలు చెబుతున్నాయి.
ఉత్పన్న ఏకాదశి తిథి, శుభ ముహూర్తాలు
మార్గశిర మాస కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అంటారు. 2026 డిసెంబర్ 3వ తేదీ రాత్రి 11:03 గంటలకు ఏకాదశి తిథి ప్రారంభమై, డిసెంబర్ 4వ తేదీ రాత్రి 11:44 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం డిసెంబర్ 4న ఉపవాసం ఆచరించాలి. ఇక, బ్రహ్మ ముహూర్తం ఉదయం 5:10 నుంచి 6:04 వరకు ఉండగా, ఏకాదశి పూజ కోసం ఉదయం 5.37 గంటల నుంచి 6.59 వరకు ఉంటుంది. అదేవిధంగా సాయంత్రం వేళ పూజా సమయం 5.24 గంటల నుంచి 6.45 గంటల వరకు ఉంటుంది.
మోక్షద ఏకాదశి తిథి, శుభ ముహూర్తాలు
మార్గశిర మాస శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని మోక్షద ఏకాదశిగా పిలుస్తారు. పేరులోనే ఉన్నట్లుగా ఈ తిథికి మోక్షప్రాప్తితో సంబంధం ఉందని హిందూ ధర్మం విశ్వసిస్తుంది. 2026 డిసెంబర్ 19వ తేదీ రాత్రి 10:09 గంటలకు ఈ తిథి ప్రారంభమై, డిసెంబర్ 20వ తేదీ రాత్రి 8:14 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం డిసెంబర్ 20న వ్రతం ఆచరించాలి.
ఏకాదశి రోజున పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు
ఏకాదశి అంటే కేవలం ఆహారం తీసుకోకుండా ఉండటం మాత్రమే కాదు. శరీరంతో పాటు మనసును కూడా నియంత్రించుకోవడం ఈ వ్రతంలోని ప్రధాన ఉద్దేశం. అందుకే ఈ రోజున కొన్ని నియమాలను పాటించడం మంచిది. ఉదయాన్నే నిద్రలేచి స్నానమాచరించి ఇంట్లో పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. శ్రీమహావిష్ణువుకు తులసి దళాలు, పసుపు పూలు, పండ్లు సమర్పించి దీపారాధన చేయాలి. విష్ణు సహస్రనామం, భగవద్గీత లేదా విష్ణు స్తోత్రాలను పారాయణం చేయాలి. ఉపవాస సమయంలో అన్నం, ధాన్యాలు తీసుకోకుండా ఉండటం సంప్రదాయంగా వస్తోంది. కోపం, అసత్యం, ఇతరులను బాధించే మాటలకు దూరంగా ఉండాలి. వీలైనంత వరకు పేదలకు అన్నదానం చేసి, అవసరమైన వారికి సహాయం చేయాలి. మరుసటి రోజు ద్వాదశి తిథిలో నిర్ణీత పారణ సమయంలో ఉపవాసాన్ని ముగించాలి.
ఈ రెండు ఏకాదశుల వెనుక ఉన్న ఆధ్యాత్మిక సందేశం
ఉత్పన్న ఏకాదశి సందర్భంగా విష్ణుమూర్తి నుంచి ఏకాదశి దేవి ఆవిర్భవించి మురాసురుడిని సంహరించినట్లు పురాణ కథనం చెబుతుంది. అందుకే ఈ రోజున వ్రతం ఆచరించడం వల్ల పాపాలు తొలగి పుణ్యం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. మరోవైపు, మోక్షద ఏకాదశికి భగవద్గీతతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఈ రోజునే శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేశాడని సంప్రదాయం చెబుతుంది. అందుకే ఈ రోజును గీతా జయంతిగా కూడా జరుపుకుంటారు. భగవద్గీతలోని ధర్మం, కర్మ, భక్తి, మోక్షం వంటి విషయాలను గుర్తుచేసుకోవడానికి ఇది మంచి సందర్భం.




