Chidambaram: చిదంబరం నటరాజ స్వామి ఆలయంలోని బంగారు రేకుల రహస్యం ఇదే

తమిళనాడులోని చిదంబరం నటరాజస్వామి ఆలయంలో శిల్పకళావైభవంతో పాటు తాత్విక, శాస్త్రీయ రహస్యాలకు నియలంగా చెబుతారు. ఈ ఆలయంలోని బంగారు రేకులకు మనిషికి అవినాభావ సంబంధం ఉంది. అదేంటో తెలుసుకుందాం.

Balachander
Published on: 5 Aug 2026 12:24 PM IST
Chidambaram: చిదంబరం నటరాజ స్వామి ఆలయంలోని బంగారు రేకుల రహస్యం ఇదే
X

Chidambaram: తమిళనాడులోని ప్రసిద్ధ శైవ క్షేత్రమైన చిదంబరం నటరాజ స్వామి ఆలయం కేవలం శిల్పకళా వైభవానికే కాదు, అద్భుతమైన ఆధ్యాత్మిక, తాత్త్విక, శాస్త్రీయ రహస్యాలకు నిలయం. ఇక్కడ పరమశివుడు ఆనంద తాండవ భంగిమలో నటరాజుడిగా దర్శనమిస్తారు. ఈ క్షేత్రంలోని గర్భగుడి పైకప్పు నిర్మాణం మానవ జీవన విధానాన్ని, శారీరక నిర్మాణాత్మక రహస్యాలను ప్రతిబింబించేలా నిర్మించబడటం అత్యంత విశేషం.

శ్వాసకు, బంగారు రేకులకు ఉన్న దివ్య సంబంధం

చిదంబర క్షేత్రంలో కనకసభ అని పిలిచే గర్భగుడి పైకప్పును పూర్తిగా పసిడి రేకులతో నిర్మించారు. ఈ నిర్మాణంలో దాగి ఉన్న సంఖ్యాశాస్త్ర రహస్యాలు ఆధ్యాత్మిక సాధకులను ఆశ్చర్యపరుస్తాయి. ఆలయ గర్భగుడి పైకప్పుపై 21,600 బంగారు రేకులను అమర్చారు. ఆయుర్వేద, యోగ శాస్త్రాల ప్రకారం ఒక ఆరోగ్యవంతమైన మానవుడు 24 గంటల వ్యవధిలో సగటున తీసుకునే శ్వాసల సంఖ్య కూడా సరిగ్గా 21,600. అంతేకాదు, ఈ బంగారు రేకులను అమర్చడానికి 72వేల బంగారు మేకులను ఉపయోగించారు. ఇది మానవ శరీరంలో ఉండే 72,000 ప్రధాన నాడులను సూచిస్తుంది. శ్వాస అనేది కేవలం జీవ ప్రక్రియ మాత్రమే కాదు. ప్రాణాయామం ద్వారా శ్వాసపై ధ్యాస నిలిపి మనస్సును స్వాధీనం చేసుకోవచ్చని, అది ఆత్మజ్ఞానానికి మార్గం చూపుతుందని ఈ నిర్మాణం ప్రబోధిస్తుంది.

మానవ శరీరానికి ప్రతీకగా ఆలయ నిర్మాణం

చిదంబరం ఆలయ నిర్మాణం సకల అవయవాలతో కూడిన మానవ శరీర నిర్మాణాన్ని పోలి ఉంటుంది. మానవ శరీరంలో హృదయం ఎడమవైపున కొద్దిగా ఒరిగి ఉన్నట్లే, ఇక్కడి గర్భగుడి కూడా ఆలయ ప్రాంగణంలో కాస్త ఎడమవైపుకు ఉండేలా నిర్మించారు. అంతేకాదు, ఆనంద తాండవంలోని నటరాజ భంగిమ విశ్వంలో జరిగే ఐదు ప్రధాన ప్రక్రియలను సూచిస్తుంది. అవి సృష్టి, స్థితి, లయం, తిరోభావం, అనుగ్రహం. ఇందులో మొదటిమూడు ప్రతి మనిషి జీవితంలో జరుగుతూనే ఉంటాయి. చివరిదైన అనుగ్రహం దీనినే మోక్షం అని అంటాం. దీనికోసమే మనిషి ప్రయత్నించాలి. లయం తరువాత తిరోభావం పేరుతో మనిషి వివిధ జీవులుగా జన్మిస్తుంటారు. కానీ, ఒకసారి మోక్షం పొందిన తరువాత జననమరణ చక్రాల నుంచి విముక్తి లభిస్తుంది. క్లుప్తంగా చెప్పాలంటే పుట్టుక నుంచి ప్రారంభమై జీవనం, మరణం, అంతిమంగా మోక్షాన్ని పొందే దివ్య విధానానికి ఈ ఆలయ ఆవరణ ఒక దివ్య మార్గదర్శిగా నిలుస్తుంది. ఈ విధంగా చిదంబరం నటరాజ స్వామి ఆలయం కేవలం రాతితో కట్టిన భవనం కాదు. మానవ శరీరం, ప్రాణశక్తి, పరమాత్మ ఒకటేనని చాటిచెప్పే దివ్య జ్ఞాన భాండాగారం.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story