Chaturmasya Deeksha 2026: కఠినమైన చాతుర్మాస్య దీక్షను సామాన్యులు కూడా చేయవచ్చా? నియమాలేంటి?

చాతుర్మాస్యం అంటే నాలుగు నెలల పాటు కఠినమైన నియమాలు పాటిస్తూ ఏకభుక్తం చేస్తూ భగవంతుడిని స్మరించుకుంటూ ఉండాలి. ఈ దీక్ష అత్యంత కష్టమైనదిగా చెబుతారు. సామాన్యులు కూడా పాటించవచ్చు..కానీ నియమాలు కష్టతరంగా ఉంటాయి.

Balachander
Published on: 18 Jun 2026 9:40 AM IST
Chaturmasya Deeksha 2026: కఠినమైన చాతుర్మాస్య దీక్షను సామాన్యులు కూడా చేయవచ్చా? నియమాలేంటి?
X

Chaturmasya Deeksha 2026: చాతుర్మాస్య దీక్ష చేయడం అందరికీ సాధ్యం కాదు. ప్రస్తుతం ఈ ఉరుకులు పరుగుల జీవితంలో చాతుర్మాస్యం చేయడం అంటే కత్తిమీద సాము లాంటిదే. అయ్యప్ప దీక్ష కంటే కూడా కఠినమైన నియమాలు ఈ దీక్షకు ఉంటాయి. ఈ దీక్ష చేపట్టిన సమయంలో కఠినమైన ఉపవాసాలు ఉండాలి. చాతుర్మాస్యం చంద్రుడి కళలకు సంబంధించినది. చంద్రుడు హెచ్చుతగ్గులను అనుసరించి ఏకభుక్తం చేస్తారు. అమావాస్య రోజున సంపూర్ణ ఉపవాసం, పౌర్ణమి రోజున సంపూర్ణ భోజనం. అంటే షడ్రుచులతో కాదు. అదే విధంగా ఆకాశంలో చంద్రుడి ఆకృతిని బట్టి భోజనం చేయాల్సి ఉంటుంది. చంద్ర దర్శనం తరువాతే భోజనం చేయాలి. భోజనం ఒక్కటే కాదు...చాతుర్మాస్యంతో నిరంతరం ఆ భగవంతుడిని స్మరించుకుంటూ ఉండాలి. చాతుర్మాస్యం ప్రారంభం కాగానే పీఠాథిపతులు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండిపోతారు. అక్కడే పనులు చక్కబెట్టుకుంటారు. ఈ చాతుర్మాస్యం ఈ ఏడాది జులై 25న చాతుర్మాస్యం ప్రారంభమై నవంబర్‌ 21న ముగుస్తుంది.

చాతుర్మాస్య దీక్ష..నియమాలు

చాతుర్మాస్యం అంటే నాలుగు నెలలు. ఆషాడంలో ఈ దీక్ష ప్రారంభమౌతుంది. అంటే జులై 25న తొలి ఏకాదశి రోజున చాతుర్మాస్యం ప్రారంభమై నాలుగు నెలలు అంటే నవంబర్‌ 21న ముగుస్తుంది. ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వాయుజం, కార్తీకంలో కొన్ని రోజులు వరకు ఈ దీక్ష ఉంటుంది. ఈ నాలుగు నెలలు కఠినమైన నియమాలు పాటించాలి. ఏక భుక్తం అదీ చంద్రుని దర్శనం తరువాతే ఉంటుంది. ఒకవేళ చంద్రుడు కనిపించకుంటే ఆరోజు ఏకాదశే. నియమనిష్టలతో భగవంతుడిని ధ్యానిస్తూ జపతపాలు చేయాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ బయటి భోజనం చేయకూడదు. నేలపై నిద్రించాలి. దీనిని ఫలానా వారే చేయాలనే నియమం లేదు. అన్ని వర్గాల వారు దీనిని చేయవచ్చు. కాకపోతే తప్పనిసరిగా నియమాలు పాటించాలి. సూర్య కిరణాల వేడి తగ్గుతుంది. ఫలితంగా రోగాలు విజృంభించే అవకాశాలు ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఈ నాలుగు మాసాల్లో కొన్ని రకాలైన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి.

చాతుర్మాస్య విశిష్టత

చాతుర్మాస్యం ప్రారంభంలో మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్తాడు. కాబట్టి ఈ నాలుగు నెలలు శుభకార్యాల కంటే కూడా జపం, ధ్యానం, యోగం వంటి వాటిపై ఎక్కువగా దృష్టిసారిస్తారు. చాతుర్మాస్య దీక్షను ఎవరైతే నియమనిష్టలతో పాటిస్తారో వారికి విష్ణులోకం ప్రాప్తిస్తుందని నమ్మకం. పురాణాల ప్రకారం పార్వతీదేవి నారేళ్లనాచి అనే గర్భిణికి సహాయంగా ఉంటూ 11 రోజుల తరువాత ఐశ్వర్యాన్ని ప్రసాదించి చాతుర్మాస్య దీక్ష వ్రతం గురించి తెలియజేసి వెళ్లిపోతుంది. పార్వతీ దేవి చెప్పిన చాతుర్మాస్య వ్రతాన్ని నారేళ్లనాచి పాటిస్తున్న సమయంలో పార్వతీదేవి వచ్చి ఐశ్వర్యాన్ని తిరిగి ఇవ్వాలని కోరగా...తాను వ్రతంలో ఉన్నానని తరువాత రమ్మని చెబుతుంది. అయితే, ఆమెపై కోపంతో శివుడికి చెప్పగా... చాతుర్మాస్య దీక్ష విశిష్టతను తెలియజేస్తాడు. కాగా, నారదుడు నారెళ్లనాచి వద్దకు వెళ్లి విషయం చెప్పగా ఆమె పార్వతీదేవిని ప్రార్థిస్తుంది. చాతుర్మాస్య వ్రతం అంత గొప్పది.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story