Bhut Mama Temple: విచిత్రాలయం.. ఇక్కడ స్వామికి సిగరెట్‌తోనే ధూపం.. 100 ఏళ్ల చరిత్ర వెనుక ఆసక్తికర కథ!
గుజరాత్‌లోని భూత్‌మామ ఆలయంలో స్వామికి సిగరెట్‌తో ధూపం వేస్తారు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో మగాస్ మిఠాయి ప్రసాదం, ప్రత్యేక పూజా సంప్రదాయాలు, భక్తుల విశ్వాసాల వెనుక ఉన్న ఆసక్తికర కథను తెలుసుకుందాం.
Bhut Mama Temple: దేవుడికి పూజ చేయాలంటే పూలు, పండ్లు, కొబ్బరికాయలు, అగరబత్తులు గుర్తుకొస్తాయి. భక్తితో దీపం వెలిగించి, ధూపం వేసి స్వామివారిని ప్రార్థిస్తాం. అయితే గుజరాత్‌లోని ఓ ఆలయంలో మాత్రం ఈ సంప్రదాయానికి భిన్నమైన ఆచారం కనిపిస్తుంది. ఇక్కడ దేవుడికి అగరబత్తులకు బదులుగా సిగరెట్‌ను వెలిగించి ధూపం వేస్తారు. అంతేకాదు.. మగాస్ అనే ప్రత్యేకమైన మిఠాయిని నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ వింత ఆచారం వెనుక ఓ పెద్దాయన చరిత్ర, స్థానికుల విశ్వాసం దాగి ఉన్నాయి. ఇంతకీ ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఇక్కడ స్వామివారికి సిగరెట్ ఎందుకు సమర్పిస్తారు? తెలుసుకుందాం.
గుజరాత్‌లో ఎక్కడ ఉంది ఈ ఆలయం?
గుజరాత్‌లోని సూరత్ నగరంలో అథ్వాలిన్స్ ప్రాంతంలో భూత్‌మామ ఆలయం ఉంది. సుమారు 100 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ ఆలయం స్థానికుల ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రత్యేక గుర్తింపుగా నిలుస్తోంది. ఇక్కడ పూజలు అందుకునేది సాధారణంగా మనం చూసే దేవతా విగ్రహం కాదు. ఆ ప్రాంతంలో ఒకప్పుడు జీవించిన ఓ పెద్దాయన. పూర్వం ఈ ప్రాంతంలో వంజరుల సమూహం నివసించేది. ఆ సమూహంలో ఓ పెద్దాయన ఉండేవారు. ఆయనకు ప్రజల్లో ఎంతో గౌరవం ఉండేది. ఆయన చెప్పిన మాటకు అందరూ విలువ ఇచ్చేవారు. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా ఆయనను గౌరవించేవారు. సమస్యలు ఎదురైనప్పుడు ఆయన సలహా తీసుకునేవారు. ఆ పెద్దాయన మరణించిన తరువాత ఆయనను అక్కడే సమాధి చేశారు. కాలక్రమంలో ఆ సమాధి మీద ఆలయాన్ని నిర్మించారు. ఆయన జ్ఞాపకార్థం భూత్‌మామ పేరుతో విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు ప్రారంభించారు. అలా ఈ ఆలయం స్థానికుల ఆరాధనా కేంద్రంగా మారింది.
స్వామికి సిగరెట్‌తో ధూపం ఎందుకు?
భూత్‌మామ ఆలయంలో కనిపించే ప్రధానమైన ప్రత్యేకత సిగరెట్ సమర్పించే ఆచారం. సాధారణంగా దేవాలయాల్లో అగరబత్తులు, ధూపం వెలిగిస్తారు. కానీ ఇక్కడ భక్తులు సిగరెట్‌ను వెలిగించి స్వామివారి విగ్రహం ముందు ఉంచుతారు. స్థానిక సంప్రదాయం ప్రకారం, వెలిగించిన సిగరెట్‌ను భూత్‌మామ నోటికి మూడుసార్లు అందిస్తారు. అనంతరం దానిని ఆలయంలో వదిలిపెట్టకుండా బయట పారవేస్తారు. ఇలా చేయడం వల్ల తమ కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ ఆచారం వెనుక ఉన్నది భక్తుల విశ్వాసం. సాధారణ పూజా విధానాలకు భిన్నంగా ఉన్నప్పటికీ, తరతరాలుగా ఈ సంప్రదాయం కొనసాగుతుండటం ఈ ఆలయాన్ని ప్రత్యేకంగా నిలబెడుతోంది.
మగాస్ మిఠాయి.. ఏకాగ్రతకు సంకేతం!
ఈ ఆలయంలో మరో విశేషం మగాస్ అనే ప్రత్యేకమైన మిఠాయి. భూత్‌మామకు ఈ స్వీట్‌ను నైవేద్యంగా సమర్పిస్తారు. అనంతరం ఆలయం బయట ఉన్న సుమారు 150 ఏళ్ల నాటి చెట్టు దగ్గరకు తీసుకువచ్చి భక్తులకు పంచిపెడతారు. ఈ మిఠాయిని ప్రసాదంగా పంచడం వల్ల తాము చేపట్టిన పనులు విజయవంతమవుతాయని, చదువులో ఏకాగ్రత పెరుగుతుందని స్థానికుల నమ్మకం. అందుకే విద్యార్థులు కూడా ఈ ఆలయాన్ని సందర్శించి ప్రసాదాన్ని సమర్పిస్తుంటారు.
తమిళనాడులోనూ ఇలాంటి ఆచారం!
సిగరెట్‌తో ధూపం వేసే సంప్రదాయం గుజరాత్‌లోని భూత్‌మామ ఆలయానికే పరిమితం కాలేదు. తమిళనాడులోని శ్రీరంగం ఆలయం వెలుపల ఉన్న క్షేత్రపాలకుడు మునియప్పన్ వద్ద కూడా ఇలాంటి ఆచారం కనిపిస్తుంది. భక్తులు మునియప్పన్‌కు సిగరెట్లు వెలిగించి సమర్పిస్తారు. అనంతరం వాటిని అక్కడ ఏర్పాటు చేసిన కుండలో వేస్తారు. ఆ పొగతో తమ సమస్యలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. భారతదేశంలోని ఆలయాలు కేవలం ప్రార్థనా స్థలాలు మాత్రమే కాదు. అవి స్థానిక చరిత్ర, సంప్రదాయాలు, ప్రజల విశ్వాసాలకు ప్రతిబింబాలు. భూత్‌మామ ఆలయం కూడా అలాంటి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ఒకటి.




