Bhagavad Gita: ప్రపంచ విజేతల తలరాతలను మార్చిన మాట...భగవద్గీత చెప్పిన సత్యం

ఓటమి, విజయం మధ్య చిన్న లైన్‌ ఉంటుంది. స్థితప్రజ్ఞతతో, కర్మసిద్ధాంతం అనుసరించి నిరంతరం పనిచేసేవారికి విజయం తప్పకుండా లభిస్తుందని భగవద్గీత చెబుతున్నది.

Balachander
Published on: 22 July 2026 7:28 AM IST
Bhagavad Gita: ప్రపంచ విజేతల తలరాతలను మార్చిన మాట...భగవద్గీత చెప్పిన సత్యం
X

Bhagavad Gita: ఒక చిన్న ఓటమి ఎదురవగానే నిరాశతో అడుగులు వెనక్కి వేసే సామాన్యులకు, ఎన్ని విఫలప్రయత్నాలు ఎదురైనా ప్రపంచాన్ని ఏలే విజేతలుగా మారే మహానాయకులకు మధ్య ఉన్న తేడా కేవలం ఒక్క భావన మాత్రమే! ఆధునిక సమాజంలో తీవ్ర పోటీ, మానసిక ఒత్తిళ్లను తట్టుకుని ఉన్నత శిఖరాలను చేరుకోవడానికి భగవద్గీత అందించిన మహత్తర దివ్య ఔషధం "స్థితప్రజ్ఞత", నిరంతర "కర్మ సిద్ధాంతం". భగవద్గీతలోని రెండవ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ బోధించిన "కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన" అనే ఏకైక శ్లోకం సమస్త మానవాళి జీవన చిత్రాన్నే మార్చివేసింది. ఫలితంపై ఆశ లేకుండా, కేవలం శ్రమించడమే మన బాధ్యత అని చాటిచెప్పే ఈ సూత్రమే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన విజేతల విజయ రహస్యం.

ఫలితంపై కాక... శ్రమపైనే నియంత్రణ

చాలామంది ఏ పని ప్రారంభించినా ముందుగా వచ్చే ప్రతిఫలాన్ని అంచనా వేస్తారు. ఫలితం అనుకూలంగా ఉంటేనే ముందడుగు వేస్తారు, లేదంటే సగం దారిలోనే ప్రయత్నాన్ని విరమిస్తారు. కానీ, మన చేతుల్లో ఉన్నది కేవలం శ్రమ మాత్రమేనని, రాబోయే ఫలితాన్ని శాసించే హక్కు లేదా నియంత్రణ మానవునికి లేదని కృష్ణ పరమాత్మ గీతలో పేర్కొన్నారు. లాభనష్టాలు, జయాపజయాలు ఎదురైనప్పుడు చలించకుండా సమతుల్యతను కాపాడుకోవడమే నిజమైన విజయం. జీవితంలో విఫలమైన 90% మంది వ్యక్తులు ఓటమికి భయపడి ప్రయత్నాన్ని ఆపేసినవారే. వైఫల్యాన్ని శాశ్వతంగా భావించకుండా, నిరంతరం అంకితభావంతో శ్రమించేవారు ఏదో ఒక రోజు ఖచ్చితంగా విజయాన్ని చేరుకుంటారు.

మార్పును స్వీకరించడమే జీవితం

కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. రాత్రి తర్వాత పగలు రావడం ఎంత సహజమో, కష్టం తర్వాత సుఖం రావడం కూడా అంతే నిజం. కాలంలో వచ్చే మార్పులకు అనుగుణంగా మన ఆలోచనలను మలుచుకుంటూ ముందుకు సాగాలి. వైఫల్యాన్ని ముగింపుగా కాక, తదుపరి విజయానికి తొలిమెట్టుగా భావించిననాడే ఏ వ్యక్తి అయినా జీవితంలో అనుకున్న లక్ష్యాలను సాధించగలడు. గీతలో బోధించిన సత్యాలు ఎప్పుడూ కఠినంగానే ఉంటాయి. నిజం చేదుగా ఉన్నది అన్నట్టుగానే. కానీ, ఆ కఠినమైన మాటలను అర్ధం చేసుకొని ముందుకు సాగితే విజయం లభిస్తుంది. విజేతగా నిలిచేందుకు అవకాశం లభిస్తుంది. ఈ ప్రపంచం విజేతలను మాత్రమే గుర్తుపెట్టుకుంటుంది. పరాజితులను, పలాయనవాదులను కాదు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story