Bathukamma 2026: తెలంగాణలో బతుకమ్మ సంబరాలు - పువ్వుల విశిష్టత ఇదే
తెలంగాణ బతుకమ్మ 2026 వేడుకలు అక్టోబర్ 10 నుంచి 18 వరకు తొమ్మిది రోజుల పాటు జరుగుతాయి. ఎంగిలిపూల బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకు ప్రతి రోజు ప్రత్యేకత, పూల విశిష్టత, నైవేద్యాల వివరాలు తెలుసుకుందాం.
Bathukamma 2026: తెలంగాణ అంటేనే ముందుగా గుర్తొచ్చే పండుగల్లో బతుకమ్మకు ప్రత్యేక స్థానం ఉంది. రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి, దాని చుట్టూ చేరి పాటలు పాడుతూ, ఆడుతూ మహిళలు జరుపుకునే ఈ వేడుక కేవలం ఒక పండుగ మాత్రమే కాదు.. తెలంగాణ జీవనశైలికి, ప్రకృతితో మనిషికి ఉన్న అనుబంధానికి ప్రతిబింబం. ప్రతి ఏడాది వర్షాకాలం ముగింపు దశలో ప్రకృతి పచ్చదనంతో కళకళలాడుతున్న సమయంలో బతుకమ్మ సంబరాలు మొదలవుతాయి.
తొమ్మిది రోజుల ప్రత్యేకత
మహాలయ అమావాస్యతో ప్రారంభమయ్యే బతుకమ్మ వేడుకలు వరుసగా 9 రోజుల పాటు సాగుతాయి. ఈ తొమ్మిది రోజుల్లో ఒక్కో రోజుకు ఒక్కో పేరు, ఒక్కో నైవేద్యం ఉంటుంది. చివరి రోజైన సద్దుల బతుకమ్మను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. 2026లో బతుకమ్మ వేడుకలు అక్టోబర్ 10న ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై, అక్టోబర్ 18న సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. అక్టోబర్ 10 న ఎంగిలిపూల బతుకమ్మ. నువ్వులు, బియ్యంపిండి, నూకలతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు. అక్టోబర్ 11 న అటుకుల బతుకమ్మ. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం పెడతారు. అక్టోబర్ 12న ముద్దపప్పు బతుకమ్మ. ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేస్తారు.
అక్టోబర్ 13న నానే బియ్యం బతుకమ్మ. నానబెట్టిన బియ్యం, పాలు, బెల్లం కలిపి సమర్పిస్తారు. అక్టోబర్ 14 న అట్ల బతుకమ్మ. అట్లు లేదా దోశలను నైవేద్యంగా పెడతారు. అక్టోబర్ 15న అలిగిన బతుకమ్మ. ఈ రోజున అమ్మవారు అలిగి ఉంటారనే సంప్రదాయ విశ్వాసంతో నైవేద్యం సమర్పించరు. ఇక అక్టోబర్ 16న వేపకాయల బతుకమ్మ. బియ్యంపిండితో వేపపండ్ల ఆకారంలో తయారు చేసిన వంటకాలను నివేదిస్తారు. అదేవిధంగా అక్టోబర్ 17న వెన్న ముద్దల బతుకమ్మ. నువ్వులు, వెన్న లేదా నెయ్యి, బెల్లంతో నైవేద్యం సిద్ధం చేస్తారు. ఇకపోతే,
అక్టోబర్ 18న సద్దుల బతుకమ్మ. తొమ్మిదో రోజున పెరుగన్నం, చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర, కొబ్బరన్నం, నువ్వులన్నం వంటి ఐదు రకాల సద్దులను నైవేద్యంగా సమర్పిస్తారు.
బతుకమ్మలో పూలకే ఎందుకంత ప్రాధాన్యం?
బతుకమ్మకు అసలు అందం తీసుకొచ్చేది పూలే. ముఖ్యంగా తంగేడు, గునుగు వంటి స్థానికంగా విరివిగా లభించే పూలతో బతుకమ్మను అందంగా పేర్చడం ఈ పండుగలో ప్రత్యేకత. సద్దుల బతుకమ్మ రోజు మగవారు పచ్చిక బయళ్లకు వెళ్లి తంగేడు, గునుగు తదితర పూలను సేకరించి తీసుకొస్తారు. ఇంటిల్లిపాదీ కలిసి వాటిని పేర్చి బతుకమ్మను తయారు చేస్తారు. పూలను వరుసలుగా అమర్చి మధ్యలో గౌరీదేవిని ప్రతిష్ఠించి పూజించడం సంప్రదాయం. ఇక్కడే బతుకమ్మకు ఉన్న అసలు అందం కనిపిస్తుంది. ఖరీదైన అలంకరణల కంటే.. మన చుట్టూ సహజంగా పెరిగే పూలతోనే పండుగను అందంగా తీర్చిదిద్దడం తెలంగాణ ప్రజల ప్రకృతి ప్రేమను తెలియజేస్తుంది.
ఆడపడుచుల సందడే ప్రత్యేక ఆకర్షణ
బతుకమ్మ ప్రధానంగా మహిళల పండుగగా కొనసాగుతోంది. ఈ సమయంలో ఆడపడుచులు పుట్టింటికి చేరడం, బంధువులు, స్నేహితులు ఒకచోట కలవడం పండుగకు మరింత ఉత్సాహాన్ని తీసుకొస్తుంది. కొత్త బట్టలు ధరించి, బతుకమ్మలను అందంగా అలంకరించి సాయంత్రం వేళ గ్రామాలు, పట్టణాల్లోని వీధుల్లో మహిళలు సందడి చేస్తారు. చీకటి పడే సమయానికి బతుకమ్మలను తలపై పెట్టుకుని సమీపంలోని చెరువు లేదా నీటి వనరుల వద్దకు ఊరేగింపుగా వెళ్తారు. అక్కడ బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాటలు పాడి, ఆటలు ఆడి సంబరాలు చేసుకుంటారు. చివరగా సంప్రదాయం ప్రకారం బతుకమ్మలను నీటిలో నిమజ్జనం చేస్తారు.
పండుగ కంటే పెద్దది.. ఒక జీవన సంప్రదాయం
బతుకమ్మలో పూలు ఉన్నాయి.. పాటలు ఉన్నాయి.. ఆటలు ఉన్నాయి.. కుటుంబ అనుబంధాలు ఉన్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా ప్రకృతిని గౌరవించే ఆలోచన ఉంది. భూమి, నీరు, చెట్లు, పూలు, మనుషులు పరస్పరం విడదీయలేని బంధంతో ఉన్నారనే సందేశాన్ని ఈ పండుగ మనకు గుర్తుచేస్తుంది. అందుకే బతుకమ్మ తెలంగాణకు కేవలం ఒక పండుగ కాదు. తరతరాలుగా వస్తున్న సంస్కృతికి గుర్తు. పూలతో పేర్చిన ఆ చిన్న బతుకమ్మలో తెలంగాణ ప్రజల జీవన విధానం, ఆడపడుచుల ఆనందం, కుటుంబ బంధాలు, ప్రకృతిపై ప్రేమ అన్నీ కనిపిస్తాయి. “బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో” అంటూ సాగే ఆ పాటల్లో తెలంగాణ ఆత్మ వినిపిస్తుంది.




