Banana Tree Vastu: అరటి చెట్టు గురించి మన పెద్దలు చెప్పిన అద్భుత రహస్యం...ఇంట్లో పెంచేవారికోసమే ప్రత్యేకం

పూర్వం రోజుల్లో ప్రతీ ఇంట్లో తప్పకుండా అరటి చెట్టు ఉండేది. అరటి చెట్టు ఉండటం వలనే ఆయా ఇల్లు కళకళలాడుతుండేవి. అరటిచెట్టు ఎందుకు పెంచాలని పెద్దలు చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం.

Balachander
Published on: 30 Jun 2026 10:27 AM IST
Banana Tree Vastu: అరటి చెట్టు గురించి మన పెద్దలు చెప్పిన అద్భుత రహస్యం...ఇంట్లో పెంచేవారికోసమే ప్రత్యేకం
X

Banana Tree Vastu:

హిందూ సనాతన ధర్మంలో వృక్షో రక్షతి రక్షితః అంటారు. అంటే ప్రకృతిని మనం పూజిస్తే, ఆ ప్రకృతి మనల్ని కాపాడుతుందని అర్థం. మన పెద్దలు, పూర్వీకులు ప్రతి వృక్షంలోనూ ఒక దైవత్వాన్ని చూశారు. అలాంటి పవిత్రమైన చెట్లలో అరటి చెట్టు అత్యంత ముఖ్యమైనది. అరటి చెట్టు కేవలం ఒక మొక్క మాత్రమే కాదు... అది సాక్షాత్తూ లక్ష్మీనారాయణుల స్వరూపం. ఇంట్లో అరటి చెట్టును పెంచుకునే వారు తెలుసుకోవాల్సిన అద్భుత ఆధ్యాత్మిక రహస్యాలు, పాటించాల్సిన నియమాలను ఇప్పుడు తెలుసుకుందాం.

లక్ష్మీనారాయణుల నివాసం ...గురుగ్రహ అనుగ్రహం

శాస్త్రాల ప్రకారం, అరటి చెట్టును 'నారాయణ స్వరూపం'గా భావిస్తారు. ఏ ఇంట్లో అరటి చెట్టు పచ్చగా కళకళలాడుతూ ఉంటుందో, ఆ ఇంట్లో లక్ష్మీదేవి, శ్రీమహావిష్ణువు శాశ్వతంగా కొలువై ఉంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, అరటి చెట్టు నవగ్రహాలలో ఒకటైన గురు గ్రహానికి ప్రతీక. ఎవరి జాతకంలోనైనా గురుబలం తక్కువగా ఉండి, పనుల్లో ఆటంకాలు ఎదురవుతుంటే... వారు ఇంట్లో అరటి చెట్టును నాటి, నిత్యం దానికి నీరు పోయడం ద్వారా గురుగ్రహ దోషాలు తొలగిపోయి శుభ ఫలితాలు లభిస్తాయి.

దిశల నియమం...ఎక్కడ నాటాలి?

అరటి చెట్టును ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ నాటకూడదు. దీనికంటూ ఒక ప్రత్యేకమైన వాస్తు నియమం ఉంది. అరటి మొక్కను ఎల్లప్పుడూ ఇంటికి తూర్పు లేదా ఉత్తర దిశలలో మాత్రమే నాటాలి. ఈ దిశలు సానుకూల శక్తిని ఆకర్షిస్తాయి. వీలైనంత వరకు ఈ చెట్టును ఇంటి గుమ్మం ముందుకు కాకుండా, ఇంటి వెనుక భాగంలో లేదా పెరట్లో నాటడం శ్రేయస్కరం. పొరపాటున కూడా అరటి చెట్టును దక్షిణ లేదా పడమర దిశలలో నాటకూడదు. ఇది వాస్తు దోషానికి దారితీస్తుంది.

వివాహ, సంతాన ప్రాప్తికి అద్భుత పరిహారం

జీవితంలో వైవాహిక సమస్యలతో బాధపడేవారికి, అలాగే పెళ్లి కావడం లేదని దిగులు చెందే యువతులకు అరటి చెట్టు పూజ ఒక సంజీవని లాంటిది. ప్రతి గురువారం అరటి చెట్టుకు పసుపు, కుంకుమ సమర్పించి, నెయ్యి దీపం వెలిగించి నమస్కరిస్తే... త్వరితగతిన వివాహ ఘడియలు వస్తాయి. అంతేకాదు, వంశాభివృద్ధిని కోరుకునే వారు, మంచి సంతానం కోసం తపించే దంపతులు ఇంట్లో అరటి చెట్టును నాటి భక్తితో పూజిస్తే ఆశించిన ఫలితం దక్కుతుంది.

అరటి చెట్టు ఉన్న ఇంట్లో విద్య, జ్ఞానం, సంపద, అన్నపానీయాలకు ఎన్నటికీ లోటుండదు. నిత్యం పూజ ముగిసిన తర్వాత లక్ష్మీదేవికి అరటిపండును నైవేద్యంగా సమర్పించడం ద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీ ఇంట్లో కూడా సానుకూల శక్తి పెరిగి, ప్రశాంతత వర్ధిల్లాలంటే నేడే ఒక అరటి మొక్కను సరైన దిశలో నాటి, మీ ఇంట్లో అనుకూల శక్తులను ఆహ్వానించండి. అరటి చెట్టును చులకనగా చూడగకుండా ఆరాధించేవారికి పూర్వీకుల ఆశీర్వాదం కూడా లభిస్తుందని పండితులు చెబుతున్నారు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story