Good Luck Signs: మన పెద్దలు చెప్పిన సంకేతాలు...వద్దన్నా మీ దశ మారుతుంది

ఆవు ఇంటి ముందుకు రావడం, నల్లచీమలు కనిపించడం, గంట శబ్దం వినిపించడం వంటి సంకేతాలు శుభఫలితాలకు సూచనలని పెద్దలు చెబుతారు. అదృష్టం మారబోతుందనే ఆధ్యాత్మిక సంకేతాల గురించి వివరంగా తెలుసుకుందాం.

Balachander
Published on: 17 Jun 2026 9:40 AM IST
Good Luck Signs: మన పెద్దలు చెప్పిన సంకేతాలు...వద్దన్నా మీ దశ మారుతుంది
X

Good Luck Signs: మన నిత్య జీవితంలో కొన్ని సంఘటనలు చాలా సాదాసీదాగా జరుగుతుంటాయి. కానీ, భారతీయ సనాతన ధర్మంలో, జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి చిన్న విషయానికి ఒక విశిష్టమైన అర్థం, ఆధ్యాత్మిక నేపథ్యం దాగి ఉన్నాయి. రాబోయే కాలంలో మనకు పట్టబోయే అదృష్టాన్ని లేదా సంపదను ప్రకృతి మనకు కొన్ని సంకేతాల ద్వారా ముందే సూచిస్తుందని పెద్దలు చెబుతుంటారు. శకున శాస్త్రం ప్రకారం, మీ ఇంట్లో లేదా మీ పరిసరాల్లో ఆరు రకాల శుభ సంకేతాలు కనిపిస్తే.. త్వరలోనే మీ దరిద్రం తీరిపోయి, లక్ష్మీ దేవి అనుగ్రహం లభించబోతుందని అర్థం. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

గోమాత రాక ... దైవానుగ్రహం

హైందవ సంప్రదాయంలో ఆవును కేవలం ఒక జంతువుగా చూడరు. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని నమ్ముతారు. ఒకవేళ ఏ కారణం లేకుండానే ఒక ఆవు పదే పదే మీ ఇంటి ముందుకు వస్తూ ఉంటే, లక్ష్మీదేవి మీ ఇంటిని ఆశీర్వదించడానికి వస్తోందని అర్థం. అలాంటి సమయంలో ఆవుకు కొద్దిగా గ్రాసం లేదా బెల్లం తినిపించడం వల్ల ఇంట్లోని వాస్తు దోషాలు, నకారాత్మక శక్తులు తొలగిపోయి ఆర్థిక పురోగతి సాధ్యమవుతుంది.

శూన్యంలో వినిపించే గంటల నాదం

కొందరికి తెల్లవారుజామున నిద్రలో ఉన్నప్పుడు లేదా ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటున్న సమయంలో గుడిలో గంట మోగినట్లు, లేదా శంఖ నాదం వినిపించినట్లు అనిపిస్తుంది. చుట్టుపక్కల ఎలాంటి శబ్దాలు లేకపోయినా ఇలాంటి అనుభూతి కలిగిందంటే.. మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులు అన్నీ తొలగిపోయి...సకల శుభ శక్తులు మీ ఇంట ప్రవేశిస్తున్నాయని అర్థం. ఇది మీరు చేపట్టబోయే కార్యాలలో విజయానికి సంకేతం.

ప్రయాణంలో ఎదురయ్యే జలకలశం

మీరు ఏదైనా ముఖ్యమైన పని మీద, ఇంటర్వ్యూల కోసం లేదా వ్యాపార లావాదేవీల కోసం ఇంటి నుండి బయటకు వెళ్తున్నప్పుడు.. నీటితో నిండుగా ఉన్న పాత్ర, కుండ లేదా పూజా కలశం ఎదురైతే అది పరమ పవిత్రమైన శకునం. నీరు అనేది సమృద్ధికి, శాంతికి ప్రతీక. ఇలాంటి దృశ్యం కనిపిస్తే మీరు వెళ్తున్న పని నూటికి నూరు శాతం దిగ్విజయంగా పూర్తవుతుంది.

అరచేతిలో దురద ... ధనలాభం

సాధారణంగా ఎలాంటి చర్మ సమస్యలు లేకపోయినా, అకస్మాత్తుగా కుడి అరచేతిలో...కొన్ని శాస్త్రాల ప్రకారం స్త్రీలకు ఎడమ చేయి... దురద పెడుతుంటే... త్వరలోనే మీకు అందబోయే ధనలాభానికి సూచనగా భావించవచ్చు. ఎప్పటి నుంచో రావాల్సిన పాత బాకీలు వసూలు కావడం లేదా లాటరీ, షేర్ మార్కెట్ వంటి మార్గాల ద్వారా ఊహించని డబ్బు చేతికందుతుందని మన పూర్వీకులు చెబుతున్నారు.

నల్లచీమల గుంపులు

ఇంట్లో అకస్మాత్తుగా నల్లచీమలు గుంపులు గుంపులుగా తిరగడం లేదా గోడలపై వరుసగా వెళ్లడం కనిపిస్తే కంగారుపడి వాటిని చంపేయకండి. జ్యోతిష్యం ప్రకారం, నల్లచీమలు ధనలక్ష్మి రాకకు, ఐశ్వర్య వృద్ధికి సంకేతాలు. వాటికి పంచదార లేదా బియ్యప్పిండిని ఆహారంగా వేయడం వల్ల పితృదోషాలు సైతం తొలగిపోతాయి.

కారణం లేని సుగంధ పరిమళాలు

మీ గదిలో లేదా ఇంట్లో ఎలాంటి పూల మొక్కలు, సెంట్ లేదా అగరుబత్తులు వెలిగించకపోయినా.. అకస్మాత్తుగా ఒక అద్భుతమైన దైవిక సుగంధ వాసన లేదా కర్పూర పరిమళం వస్తే, అది మీ ఇల్లాలు చేసుకున్న పుణ్య ఫలమే. మీ ఇష్టదైవం లేదా కులదైవం మీ ఇంట్లో సంచరిస్తున్నారనేందుకు ఇది బలమైన సంకేతం. త్వరలోనే మీ కష్టాలన్నీ తీరిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుందని అర్ధం చేసుకోవాలి. ప్రకృతి ఇచ్చే ఈ సంకేతాలు మన నమ్మకంతో ముడిపడి ఉన్నప్పటికీ, ఇవన్నీ మనలో ఒక కొత్త ఆశావాదాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయి. సానుకూల దృక్పథంతో, దైవభక్తితో కష్టపడే గుణం ఉంటే ఈ శుభ సంకేతాలు మీ జీవితాన్ని అద్భుతంగా మార్చడం ఖాయం.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story