Daily Puja: నిత్యపూజలో ఈ ఐదే కీలకం... పొరపాటున మర్చిపోతే కలలో కూడా ఊహించని తిప్పలు తప్పవు
నిత్యపూజలో తప్పనిసరిగా పంచోపచారాలు పాటించాలి. పంచోపచారాల్లో ఒక్కటైనా పొరపాటున మర్చిపోతే ఆ పూజలు ఫలించవు.
Daily Puja: మనం నిత్యం ఇంట్లో దైవారాధన చేస్తుంటాం. కొందరు పూజగదిని రంగురంగుల పువ్వులతో, విద్యుత్ దీపాలతో అంగరంగ వైభవంగా అలంకరించి పూజలు చేస్తాం. మనం చేస్తున్న పూజ చిన్నదా పెద్దదా అన్నది కాదు. భగవంతుడు ఆశించేది నిష్కల్మషమైన, శుద్ధమైన మనస్సు మాత్రమే. మనస్సులో లౌకికమైన ఆలోచనలు పెట్టుకొని ఎంత వైభవంగా పూజ చేసినా అది నిష్ప్రయోజనమే అవుతుంది. అందుకే మన పెద్దలు "చిత్తశుద్ధి లేని శివపూజలేల" అని ప్రబోధించారు. నిత్యపూజలో భౌతికంగా మనం సమర్పించే ఉపచారాలు ముఖ్యం. శాస్త్రం ప్రకారం పూజలు రెండు రకాలుగా సాగుతాయి. ఒకటి సాధారణ పూజ, రెండవది 16 రకాల సేవలతో కూడిన 'షోడశ ఉపచార పూజ'. కానీ, నిత్యం ఇంట్లో చేసుకునే సాధారణ పూజలో ఐదు ప్రధాన పదార్ధాలు దీనినే పంచోపచారాలు అని పిలుస్తారు. ఈ పంచోపచారాలు తప్పనిసరిగా ఉండాలి. వీటిలో ఏ ఒక్కటి మర్చినా పూజ సంపూర్ణం కాదు. ఆ ఐదు ముఖ్యమైన అంశాల అంతరార్థాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
నిత్యపూజకు ప్రాణమైన పంచోపచారాలు
ఇందులో మొదటిది దీపం. అజ్ఞానమనే చీకట్లను తొలగించి, జ్ఞానమనే వెలుగును ప్రసాదించే పరమ పవిత్రమైన సాధనం దీపారాధన. రెండోది ధూపం. ఇల్లాలు సమర్పించే ధూపం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులు నశించి, సాత్విక వాతావరణం ఏర్పడుతుంది. మూడోది పుష్పం. భగవంతుని పాదపద్మాలకు భక్తితో సమర్పించే పువ్వు, మన హృదయ వికాసానికి ప్రతీక. నాలుగోది నైవేద్యం. ఆకలిని, అహాన్ని దేవునికి అర్పించి, ఆయన అనుగ్రహాన్ని ప్రసాదంగా స్వీకరించే పవిత్ర ప్రక్రియ ఇది. ఇక ఐదోది నీరాజనం. కర్పూర హారతి ద్వారా భగవంతుని దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకోవడం. నిత్య పూజలో ఈ ఐదు పంచోపచారాలు తప్పనిసరిగా చేయాలి.
పూజ వెనుక ఉన్న అసలైన పరమార్థం
మనం పూజ ఎందుకు చేయాలి? కేవలం కోరికలు తీరడానికేనా? కాదు. అనిత్యమైన, అశాశ్వతమైన ఈ సంసార సాగరం నుంచి శాశ్వతుడైన ఆ పరమాత్ముని సన్నిధికి చేరుకోవడమే పూజ యొక్క ముఖ్య ఉద్దేశం. రోజూ పూజ చేసే సమయంలో మనం తెలిసీ తెలియక చేసిన తప్పులను క్షమించమని వేడుకోవాలి. జీవితంలో మనం చేసే ప్రతి పనికి కర్త, కర్మ, క్రియ అన్నీ ఆ ఈశ్వరుడే అని మనసా, వాచా, కర్మణా నమ్మడమే నిజమైన పూజ. కాబట్టి, పూజగదిలో గంటల తరబడి కూర్చోకపోయినా, ఈ ఐదు ఉపచారాలను గుండె నిండిన భక్తితో సమర్పిస్తే, ఆ సర్వేశ్వరుడు లక్ష్మీనారాయణ సమేతంగా మీ ఇంట్లోనే కొలువై ఉంటాడు. కాబట్టి ఇకనుంచి నిత్యపూజలో కూర్చున్నవారు తప్పనిసరిగా ఈ ఐదు ఉపచారాలను చేయడం మర్చిపోవద్దు.




