Finland: సింగిల్స్‌కు ఫిన్లాండ్ అదిరిపోయే ఆఫర్.. ఇది కదా కావాల్సింది.!

Finland: ఫిన్లాండ్ ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా 16 మంది సింగిల్స్‌కు ఉచిత ట్రిప్ ఆఫర్ చేస్తోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Ravi
By Ravi
Published on: 1 Nov 2026 8:17 PM IST
Finland
X

Finland: సింగిల్స్‌కు ఫిన్లాండ్ అదిరిపోయే ఆఫర్.. ఇది కదా కావాల్సింది.!

Finland: ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి అలాగే ప్రత్యేక ఆకర్షణల కోసం వినూత్నమైన ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. ముఖ్యంగా ఆసక్తికరమైన పోటీలు అలాగే ట్రిప్స్ ద్వారా పర్యాటకులను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తుంటాయి. ఈ నేపథ్యంలో ఫిన్లాండ్ ప్రభుత్వం సింగిల్స్ కోసం ప్రకటించిన ఒక అద్భుతమైన ఉచిత ట్రిప్ ఆఫర్ ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో ట్రెండ్ అవుతోంది. సోషల్ మీడియా వేదికగా ఈ వార్త విపరీతంగా వైరల్ అవుతుండటంతో టూరిస్టులు ఆసక్తి చూపుతున్నారు.

ఫిన్‌లాండ్ సింగిల్స్‌కు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆ దేశ టూరిజం సంస్థ విజిట్ ఫిన్‌లాండ్ ప్రపంచవ్యాప్తంగా 16 మంది సింగిల్స్‌ను ఉచితంగా తమ దేశానికి ఆహ్వానిస్తోంది. డేటింగ్ యాప్స్ వదిలి 4 రోజుల ఫుడ్ ట్రిప్‌లో కొత్త పరిచయాలు ఏర్పరచుకోవడమే ఈ 'ఫిన్నిష్ డిన్నర్ డేట్' లక్ష్యం. ఈ ట్రిప్ 2027 ఫిబ్రవరి 9 నుంచి 19 మధ్య జరుగుతుంది.

ఎంపికైన 16 మందిని రెండు గ్రూపులుగా విభజిస్తారు. 8 మంది హెల్సింకికి, మరో 8 మంది టాంపెరేకి వెళ్తారు. ప్రతి గ్రూప్ ఇద్దరు స్థానిక ఫిన్నిష్ సింగిల్స్‌తో కలిసి సర్ప్రైజ్ లొకేషన్‌లో బ్లైండ్ గ్రూప్ డిన్నర్ చేస్తుంది. అక్కడ ఫిన్‌లాండ్ అధికారిక టేస్టింగ్ మెనూను వడ్డిస్తారు. విమాన టికెట్లు, వసతి, భోజనం, యాక్టివిటీస్ అన్నీ ఉచితమే. ఫిన్‌లాండ్‌లో సింగిల్స్ గుర్తింపు కోసం పింక్ బాస్కెట్ ఎంచుకునే 'సింక్కుకోరి' సంప్రదాయం ఉంది. ఈ ఆలోచన నుంచే ఈ క్యాంపెయిన్ పుట్టింది.

18 ఏళ్లు పైబడిన సింగిల్స్ ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిన్‌లాండ్ పౌరులు, నివాసితులకు అవకాశం లేదు. FinnishDinnerDate.com లో నవంబర్ 10 లోపు అప్లై చేయాలి. అందుకు ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్ లేదా యూట్యూబ్‌లో చిన్న వీడియో పోస్ట్ చేసి, #FinnishDinnerDate హ్యాష్‌ట్యాగ్‌తో విజిట్ ఫిన్‌లాండ్ ఖాతాను ట్యాగ్ చేయాలి. విజేతలను డిసెంబర్ 1న ప్రకటిస్తారు. ఎంపికైనవారు 48 గంటల్లో స్పందించకపోతే ఆ అవకాశం మరొకరికి ఇస్తారు. దరఖాస్తు చేసినవారి వీడియో, పేరు, ఫొటోలను విజిట్ ఫిన్‌లాండ్ ప్రచారానికి వాడుకునే హక్కు ఉంటుంది.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.