Finance: భారత్‌లో పెళ్లి బడ్జెట్ రూ. 39.5 లక్షలు.. 15 శాతం మంది అప్పుల్లో!
Finance: భారత్‌లో వివాహ ఖర్చులు ఏటా 8 శాతం పెరిగి సగటున రూ. 39.5 లక్షలకు, డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు రూ. 58 లక్షలకు చేరాయని తాజా నివేదిక వెల్లడించగా, 78 శాతం జంటలు సేవింగ్స్‌ను వాడుకోగా 15.1 శాతం మంది సగటున రూ. 15.5 లక్షల అప్పు చేస్తున్నారు.
Finance: భారత్‌లో పెళ్లి బడ్జెట్ రూ. 39.5 లక్షలు.. 15 శాతం మంది అప్పుల్లో!
Finance: భారత్‌లో వివాహ ఖర్చులు ఏటా 8 శాతం పెరుగుతూ సగటున రూ.39.5 లక్షలకు, డెస్టినేషన్ వెడ్డింగ్లకైతే రూ.58 లక్షలకు చేరుకున్నాయని తాజా నివేదిక వెల్లడించింది. 78 శాతం జంటలు సేవింగ్స్‌ను వినియోగించుకోగా, 15.1శాతం మంది అప్పులు చేస్తున్నట్లు తేలింది. వీరు సగటున రూ.15.5 లక్షలు అప్పు చేసి లగ్జరీ హాల్స్, జువెలరీకి ఖర్చు చేస్తున్నారని తెలిసింది. ఈ అప్పు కొత్త జంటలను ఆర్థిక సంక్షోభంలోకి నెడుతుండటం ఆందోళనకరం.
ఈ గణాంకాలు వెడ్‌మీగుడ్ సంస్థ ఐదో వార్షిక వెడ్డింగ్ రిపోర్ట్ 2025 నుంచి వచ్చినవి. 2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి మధ్య పెళ్లి చేసుకోనున్న 2,000 పైగా జంటల సర్వే ఆధారంగా ఈ నివేదిక రూపొందింది. 500 మందికి పైగా వెడ్డింగ్ ప్లానర్లు, ఫొటోగ్రాఫర్లు, వెన్యూ నిర్వాహకుల అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. గత ఏడాది డెస్టినేషన్ వెడ్డింగ్ సగటు రూ. 51.1 లక్షలుగా ఉండగా, ఇప్పుడు రూ. 58 లక్షలకు చేరింది. దేశంలో జరిగే పెళ్లిళ్లలో నాలుగింట ఒక వంతు డెస్టినేషన్ వెడ్డింగ్లే.
నగరాల వారీగా చూస్తే జైపూర్‌లో సగటు ఖర్చు అత్యధికంగా రూ. 73 లక్షలు. ఢిల్లీలో రూ. 38 లక్షలు, ముంబైలో రూ. 35 లక్షలు, బెంగళూరు, హైదరాబాద్‌లో రూ. 37 లక్షల చొప్పున ఉంది. చాలామంది జంటలు తమ సొంత పొదుపుపైనే ఆధారపడుతున్నాయి. దాదాపు 78.65 శాతం మంది సేవింగ్స్‌తో పెళ్లి ఖర్చును భరిస్తున్నారు. 15.2 శాతం మంది రుణాలు తీసుకుంటున్నారు. అందులో 8.85 శాతం మంది బ్యాంకు రుణాలు, 6.25 శాతం మంది స్నేహితులు, కుటుంబ సభ్యుల దగ్గర తీసుకున్న అప్పులు.
రుణాలు తీసుకున్నవారు సగటున రూ. 15.5 లక్షల అప్పు చేస్తున్నారు. దీన్ని ప్రధానంగా లగ్జరీ వెన్యూ, జువెలరీ, డెకరేషన్, క్యాటరింగ్‌కు ఖర్చు చేస్తున్నారు. చాలా కుటుంబాలు క్రెడిట్ కార్డులు, బై నౌ పే లేటర్, ఇన్స్టంట్ యాప్ లోన్లపై కూడా ఆధారపడుతున్నాయి. ఈ చిన్న అప్పులు కూడా కొన్నిసార్లు ఒక అప్పు తీర్చడానికి మరో అప్పు చేసే పరిస్థితికి దారితీస్తున్నాయి.
భారత్‌లో ప్రతి ఏటా 40 నుంచి 50 లక్షల పెళ్లిళ్లు జరుగుతున్నాయి. పెళ్లి పరిశ్రమ విలువ సుమారు రూ. 6.5 లక్షల కోట్లుగా అంచనా. అయితే సగటు మధ్యతరగతి కుటుంబానికి రూ. 15.5 లక్షల అప్పు చిన్న మొత్తం కాదు. వేడుకలు ముగిసిన తర్వాత ఏళ్ల తరబడి ఈఎంఐలు కట్టాల్సి వస్తుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.




