Viral News: గర్బా పార్ట్‌నర్ కావాలా? గంటల లెక్కన అద్దెకు రెడీ.!
Viral News: నవరాత్రి అంటే రంగురంగుల దుస్తులు, డోలు శబ్దాలు, గర్బా డ్యాన్సులతో సందడి నెలకొంటుంది. ముఖ్యంగా గర్బా నైట్స్‌లో జంటగా డ్యాన్స్ చేయడం ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది.
Viral News: గర్బా పార్ట్‌నర్ కావాలా? గంటల లెక్కన అద్దెకు రెడీ.!
Viral News: నవరాత్రి అంటే రంగురంగుల దుస్తులు, డోలు శబ్దాలు, గర్బా డ్యాన్సులతో సందడి నెలకొంటుంది. ముఖ్యంగా గర్బా నైట్స్‌లో జంటగా డ్యాన్స్ చేయడం ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. అయితే గర్బా ఆడేందుకు పార్ట్‌నర్ లేని వారి కోసం గుజరాత్‌కు చెందిన ఓ యువకుడు చేసిన వినూత్న ప్రయత్నం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఏకంగా ‘రెంట్ ఎ గర్బా పార్ట్‌నర్’ అంటూ ప్యాకేజీలు ప్రకటించడంతో నెటిజన్లు ఫన్నీ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.
మూడు ప్యాకేజీలు.. మూడు రకాల ఆఫర్లు
క్రిష్ మిస్త్రీ అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ తన సోషల్ మీడియా ఖాతాలో ఈ ప్రత్యేక ఆఫర్‌కు సంబంధించిన వివరాలను షేర్ చేశాడు. గర్బా కోసం పార్ట్‌నర్ కావాలనుకునేవారి కోసం సిల్వర్, గోల్డ్, ప్లాటినమ్ అంటూ మూడు ప్యాకేజీలను ప్రకటించాడు. రూ.1,000 విలువైన సిల్వర్ ప్యాకేజీలో రెండు గంటల పాటు గర్బా డ్యాన్స్, మ్యాచింగ్ అవుట్‌ఫిట్స్, డ్యాన్స్ రాని వారికి బేసిక్ స్టెప్పులు నేర్పించడం వంటి వాటిని అందిస్తామని తెలిపాడు. దీంతో పాటు జ్ఞాపకంగా సెల్ఫీలు కూడా తీసుకోవచ్చని పేర్కొన్నాడు. రూ.1,500 గోల్డ్ ప్యాకేజీలో నాలుగు గంటల పాటు గర్బా డ్యాన్స్ చేసే అవకాశం ఉంటుందని తెలిపాడు. అంతేకాదు, ఇద్దరి పరిచయం గురించి ఓ కల్పిత కథను రూపొందించడం, సోషల్ మీడియా రీల్స్ కోసం వీడియోలు చేయడం వంటి వాటిని కూడా ఇందులో చేర్చాడు.
ప్లాటినమ్ ప్యాకేజీలో మరిన్ని సర్‌ప్రైజ్‌లు
రూ.2,000 ప్లాటినమ్ ప్యాకేజీని మరింత ప్రత్యేకంగా రూపొందించాడు. రోజంతా గర్బా డ్యాన్స్ చేయడంతో పాటు ఈవెంట్ సమయంలో దుపట్టా, జుంకాలు సరిచేయడంలో సహాయం చేయడం వంటి ఆఫర్లు ఇందులో ఉన్నాయి. ఈవెంట్ పూర్తయిన తర్వాత సురక్షితంగా ఇంటి వద్ద దింపుతామని కూడా పేర్కొన్నాడు. ఈ ప్యాకేజీలో ఈవెంట్ ముగిసిన తర్వాత నుదుటిపై ముద్దు వంటి వ్యక్తిగత ఆఫర్‌ను కూడా పేర్కొనడం సోషల్ మీడియాలో మరింత చర్చకు దారితీసింది. ఈ సేవలు కావాలనుకునేవారు కామెంట్ సెక్షన్‌లో సంప్రదించవచ్చని క్రిష్ మిస్త్రీ తెలిపాడు.
సోషల్ మీడియాలో ఫన్నీ కామెంట్లు
ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇది కొత్త తరహా సైడ్ బిజినెస్ అంటూ కొందరు కామెంట్లు చేయగా, తమ ఫ్రెండ్స్ కోసం కూడా ఈ ఆఫర్ ఎలా బుక్ చేసుకోవాలని మరికొందరు సరదాగా ప్రశ్నిస్తున్నారు. ఇది నిజమైన వ్యాపార సేవనా? లేక నవరాత్రి సందర్భంగా సరదాగా చేసిన ప్రచారమా? అనే చర్చ కూడా జరుగుతోంది. ఏదేమైనా గర్బా పార్ట్‌నర్ కోసం ‘రెంట్’ ఆఫర్ ప్రకటించడం మాత్రం నెటిజన్ల దృష్టిని బాగానే ఆకర్షించింది.




