కుక్క మాత్రమే కాదు, కోతి, పిల్లి కరిచినా డేంజరే.! చికిత్స తప్పనిసరి..

Animal Bite: కుక్క మాత్రమే కాదు, కోతులు, పిల్లులు, తేనెటీగలు వంటివి కరిచినా పసుపు, కారం రాసి వదిలేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించి సరైన చికిత్స తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

Ravi
By Ravi
Published on: 15 Nov 2026 9:04 PM IST
Animal Bite
X

కుక్క మాత్రమే కాదు, కోతి, పిల్లి కరిచినా డేంజరే.! చికిత్స తప్పనిసరి..

Animal Bite: కుక్క కరిస్తే రేబిస్ వ్యాక్సిన్ వేయించుకోవాలన్న విషయం చాలామందికి తెలుసు. కానీ కోతులు, పిల్లులు, ఎలుకలు, గబ్బిలాలు, తేనెటీగలు లేదా తేళ్లు కరిస్తే కూడా అంతే జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. గాయంపై పసుపు, కారం, ఆకుపసర్లు రాసి వదిలేయకుండా కచ్చితమైన చికిత్స తీసుకోవాలి. లేదంటే ఆ నిర్లక్ష్యం ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది.

ఏ జంతువు కరిచినా చేయాల్సిన మొదటి పని గాయాన్ని శుభ్రం చేయడం. కరిచిన లేదా గీరిన చోట సబ్బు, ధారగా పడే నీటితో కనీసం 15 నిమిషాల పాటు కడగాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ, జాతీయ మార్గదర్శకాలు సూచిస్తున్నాయి. ఆ తర్వాత పోవిడోన్ అయోడిన్ వంటి యాంటిసెప్టిక్ రాయాలి. ఆ వెంటనే డాక్టర్‌ను సంప్రదించి రేబిస్, టెటనస్ చికిత్స అవసరమా అని తెలుసుకోవాలి. కారం, ఆవనూనె వంటివి గాయంపై రాయకూడదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

అడవుల్లోనే కాదు, పట్టణాల్లోనూ కోతుల దాడి సాధారణమైపోయింది. కోతులు కరిచినా లేదా గోళ్లతో గీరినా తీవ్ర ప్రమాదం ఉంది. అందుకే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించి టెటనస్, రేబిస్ పోస్ట్-ఎక్స్‌పోజర్ ప్రొఫిలాక్సిస్ వ్యాక్సిన్లు తీసుకోవాలి. అడవి జంతువుల కాటును తీవ్రమైన ఎక్స్‌పోజర్‌గా పరిగణించాలని జాతీయ మార్గదర్శకాలు చెబుతున్నాయి.

పిల్లులు ముద్దుగా ఉన్నా వాటి గోర్లు, కాట్లు ప్రమాదకరమే. పిల్లి పళ్లు చాలా సన్నగా ఉండటం వల్ల బ్యాక్టీరియా గాయం లోపలి వరకు వెళ్తుంది. ఇలాంటి సందర్భాల్లో టెటనస్ ఇంజెక్షన్ తప్పనిసరి. అవసరమైతే రేబిస్ వ్యాక్సిన్ కూడా తీసుకోవాలి. తేనెటీగలు, కందిరీగలు కుట్టినప్పుడు విషం శరీరంలోకి విడుదలై తీవ్రమైన మంట, వాపు వస్తాయి. ఊపిరి ఆడకపోవడం, ముఖం ఉబ్బడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి. జెర్రెలు కరిచినప్పుడు తీవ్రత ఎక్కువగా ఉంటే యాంటీబయోటిక్స్, టెటనస్ ఇంజెక్షన్ వాడాల్సి ఉంటుంది.

గబ్బిలాలు, ఎలుకల కాటు విషయంలో కొంత తేడా ఉంది. గబ్బిలం కరిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యుడిని కలిసి రేబిస్ వ్యాక్సిన్ అవసరమో తెలుసుకోవాలి. భారత్‌లో గబ్బిలాల రేబిస్ నిర్ధారణ కాలేదన్న కారణంతో జాతీయ మార్గదర్శకాలు టీకా అవసరం లేదంటున్నా, WHO మాత్రం దీన్ని తీవ్రమైన ఎక్స్‌పోజర్‌గా పరిగణిస్తోంది. ఇంటి ఎలుకలు, ఉడుతలు, కుందేళ్లు కరిస్తే సాధారణంగా రేబిస్ టీకా అవసరం ఉండదు. కానీ గాయం శుభ్రత, టెటనస్ రక్షణ కోసం వైద్యుడిని సంప్రదించాలి. అడవి ఎలుకలైతే టీకా అవసరం అవుతుంది.

పాము కరిచిన సందర్భాల్లో ఆందోళన పడకుండా బాధితుడిని వెంటనే ప్రభుత్వ లేదా ప్రైవేటు ఆసుపత్రికి తరలించాలి. చెట్ల మందులు, మంత్రాల కోసం సమయం వృథా చేయకూడదు. కరిచిన చోట గాయం కోయడం, నోటితో విషం పీల్చడం వంటివి చేయకూడదు. పాము కాటుకు సకాలంలో యాంటీ స్నేక్ వెనం ఇస్తే ప్రాణాపాయం తప్పే అవకాశం ఉంది.

ఏ జంతువు కరిచినా ఇది చిన్న గాయమేనని, కుక్క ఆరోగ్యంగా కనిపిస్తోందని నిర్లక్ష్యం చేయకూడదు. రేబిస్ లక్షణాలు కనిపించిన తర్వాత చికిత్స లేదు. అందుకే కరిచిన వెంటనే గాయం శుభ్రం చేసి, సమీప ప్రభుత్వ ఆసుపత్రి లేదా యాంటీ-రేబిస్ కేంద్రంలో వైద్యుడిని సంప్రదించి, టీకా కోర్సు పూర్తిచేయడమే సురక్షితమని వైద్యులు సూచిస్తున్నారు.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.