దీపావళి పూజ కోసం బంగారం, వెండి విగ్రహాలు కొంటున్నారా.? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
Diwali: దీపావళి పండుగ సమయంలో బంగారం, వెండి కొనుగోలు చేయడం చాలామంది శుభప్రదంగా భావిస్తారు. ముఖ్యంగా కొందరు లక్ష్మీదేవి, వినాయకుడి విగ్రహాలను కూడా కొనుగోలు చేస్తుంటారు.
దీపావళి పూజ కోసం బంగారం, వెండి విగ్రహాలు కొంటున్నారా.? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
Diwali: దీపావళి పండుగ సమయంలో బంగారం, వెండి కొనుగోలు చేయడం చాలామంది శుభప్రదంగా భావిస్తారు. ముఖ్యంగా కొందరు లక్ష్మీదేవి, వినాయకుడి విగ్రహాలను కూడా కొనుగోలు చేస్తుంటారు. ముఖ్యంగా పూజ కోసం వెండి విగ్రహాలకు ఎక్కువ మంది ప్రాధాన్యత ఇస్తారు. అయితే ఇవి కొనుగోలు చేసే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
బంగారం, వెండి విగ్రహాలకు హాల్‌మార్క్ తప్పనిసరా.?
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) నిబంధనల ప్రకారం బంగారు ఆభరణాలు, బంగారు వస్తువులకు హాల్‌మార్కింగ్ తప్పనిసరి. 2021 జూన్ 23న దేశంలోని 256 జిల్లాల్లో ఈ విధానాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఈ పరిధి 392 జిల్లాలకు విస్తరించింది. 9, 14, 18, 20, 22, 23, 24 క్యారెట్ల బంగారు వస్తువులకు హాల్‌మార్కింగ్ ఉంటుంది. అయితే రెండు గ్రాముల కంటే తక్కువ బరువున్న కొన్ని బంగారు వస్తువులతో పాటు కుందన్, పోల్కీ, జడావు వంటి ప్రత్యేక ఆభరణాలకు నిర్దిష్ట నిబంధనల ప్రకారం మినహాయింపులు ఉన్నాయి. ఇక వెండి వస్తువులకు హాల్‌మార్కింగ్ ప్రస్తుతం తప్పనిసరి కాదు. ఇది స్వచ్ఛంద విధానంగా కొనసాగుతోంది. అయితే BIS విధానంలో హాల్‌మార్క్ చేయించిన వెండి వస్తువులపై 2025 సెప్టెంబర్ 1 నుంచి ఆరు అక్షరాలు, అంకెలతో కూడిన HUID నంబర్ ఉండాలి.
వెండికి 800, 835, 900, 925, 958, 970, 990, 999 స్వచ్ఛత ప్రమాణాలు ఉన్నాయి. ఉదాహరణకు 925 అంటే ఆ వస్తువులో 92.5 శాతం స్వచ్ఛమైన వెండి ఉందని అర్థం. కాబట్టి లక్ష్మీగణేశ విగ్రహాలు కొనేటప్పుడు అవి బంగారంతో తయారయ్యాయా? వెండితో తయారయ్యాయా? వాటిపై హాల్‌మార్క్ ఉందా? అనే విషయాలు తెలుసుకోవాలి.
బంగారం, వెండి విగ్రహాలపై హాల్‌మార్క్‌ను ఎలా గుర్తించాలి?
హాల్‌మార్క్ ఉన్న బంగారం, వెండి వస్తువులపై ప్రధానంగా మూడు గుర్తులు ఉంటాయి. వాటిని పరిశీలించడం ద్వారా వస్తువు స్వచ్ఛత గురించి తెలుసుకోవచ్చు.
BIS గుర్తు: బంగారు వస్తువులపై BIS అధికారిక లోగో ఉంటుంది. వెండి వస్తువులపై BIS గుర్తుతో పాటు SILVER అనే పదం ఉంటుంది.
స్వచ్ఛత గుర్తు: వస్తువులో ఎంత శాతం స్వచ్ఛమైన లోహం ఉందో ఇది తెలియజేస్తుంది. ఉదాహరణకు 22K916 అంటే 22 క్యారెట్ల బంగారం. 925 అంటే 92.5 శాతం స్వచ్ఛత కలిగిన వెండి.
HUID నంబర్: ప్రతి హాల్‌మార్క్ చేసిన వస్తువుకు ప్రత్యేకంగా ఆరు అక్షరాలు, అంకెలతో కూడిన HUID నంబర్ కేటాయిస్తారు. ఈ మూడు గుర్తులను కొనుగోలు చేసే ముందే పరిశీలించాలి. ముఖ్యంగా బంగారు విగ్రహాల విషయంలో హాల్‌మార్క్ వివరాలను తప్పనిసరిగా తనిఖీ చేయడం మంచిది.
BIS Care యాప్‌లో HUID నంబర్‌ను ఎలా తనిఖీ చేయాలి?
కొనుగోలు చేస్తున్న బంగారం లేదా వెండి వస్తువుపై ఉన్న హాల్‌మార్క్ నిజమైనదేనా? అందులో పేర్కొన్న స్వచ్ఛత వివరాలు సరైనవేనా? అనే విషయాలను తెలుసుకోవడానికి BIS Care యాప్ ఉపయోగపడుతుంది. ఈ యాప్‌ను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
HUID నంబర్‌ను తనిఖీ చేయడానికి ఈ విధంగా చేయాలి.
* ముందుగా మొబైల్లో BIS Care యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి.
* యాప్‌ను తెరిచి హోమ్ పేజీలో ఉన్న 'Verify HUID' ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
* విగ్రహంపై ఉన్న ఆరు అక్షరాలు, అంకెల HUID నంబర్‌ను నమోదు చేయాలి.
* సబ్మిట్ చేసిన తర్వాత ఆ వస్తువుకు సంబంధించిన వివరాలు తెరపై కనిపిస్తాయి.
ఈ వివరాల్లో వస్తువు స్వచ్ఛత, దాని రకం, నగల వ్యాపారి వివరాలు, హాల్‌మార్కింగ్ చేసిన కేంద్రం సమాచారం ఉంటాయి. వీటిని పరిశీలించడం ద్వారా కొనుగోలు చేస్తున్న వస్తువు హాల్‌మార్క్ వివరాలను ధ్రువీకరించుకోవచ్చు.
లక్ష్మీగణేశ విగ్రహాలు కొనేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి
దీపావళి పూజ కోసం బంగారం, వెండి విగ్రహాలు కొనుగోలు చేసేటప్పుడు కేవలం ధరను మాత్రమే చూడకూడదు. మరికొన్ని ముఖ్యమైన విషయాలను కూడా పరిశీలించాలి.
లోహం ఏదో తెలుసుకోండి: విగ్రహం పూర్తిగా బంగారంతో తయారైందా? వెండితో తయారైందా? లేక వెండిపై బంగారు పూత మాత్రమే ఉందా? అనేది ముందుగా అడిగి తెలుసుకోవాలి. బంగారు పూత ఉన్న వెండి విగ్రహానికి, పూర్తిగా బంగారంతో తయారైన విగ్రహానికి ధరలో చాలా తేడా ఉంటుంది.
బరువును పరిశీలించండి: విగ్రహం మొత్తం బరువుతో పాటు అందులో ఉన్న అసలు బంగారం లేదా వెండి బరువు ఎంతనేది తెలుసుకోవాలి. విగ్రహం లోపల ఖాళీగా ఉందా? పూర్తిగా లోహంతో తయారైందా? అనే విషయాన్ని కూడా అడగాలి.
తయారీ నాణ్యతను గమనించండి: లక్ష్మీదేవి, వినాయకుడి ముఖాలు, కళ్లు, వినాయకుడి తొండం, కిరీటం వంటి సున్నితమైన భాగాలను జాగ్రత్తగా పరిశీలించాలి. వాటి తయారీలో లోపాలు లేకుండా చూసుకోవాలి.
ఫినిషింగ్‌ను తనిఖీ చేయండి: విగ్రహంపై గీతలు, పగుళ్లు, విరిగిన భాగాలు ఉండకూడదు. ముఖ్యంగా దీపావళి పూజ కోసం కొనుగోలు చేస్తున్నప్పుడు విగ్రహం ఎలాంటి దెబ్బతినకుండా, శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.
మేకింగ్ ఛార్జీల వివరాలు అడగండి: లోహం అసలు ధర ఎంత? తయారీ ఛార్జీలు ఎంత? పన్నులు ఎంత? అనే వివరాలను విడివిడిగా బిల్లులో పొందాలి.
బైబ్యాక్ నిబంధనలు తెలుసుకోండి: భవిష్యత్తులో విగ్రహాన్ని తిరిగి విక్రయించాలన్నా, మరో వస్తువుతో మార్చుకోవాలన్నా ఎంత ధర చెల్లిస్తారు? ఏమైనా కోతలు విధిస్తారా? అనే విషయాలను ముందుగానే తెలుసుకోవాలి.




