Children’s Day: నవంబర్ 20 నుంచి 14కి ఎందుకు మారింది.? చిల్డ్రన్స్ డే వెనుక ఆసక్తికర చరిత్ర.!
Children’s Day: భారత్‌లో బాలల దినోత్సవాన్ని మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజైన నవంబర్ 14న జరుపుకుంటుండగా, ఐక్యరాజ్యసమితి ప్రకటించిన యూనివర్సల్ చిల్డ్రన్స్ డే మాత్రం నవంబర్ 20న ఉంటుంది, ఈ తేదీ తేడా వెనుక ఉన్న చరిత్ర ఇదే.
Children’s Day: నవంబర్ 20 నుంచి 14కి ఎందుకు మారింది.? చిల్డ్రన్స్ డే వెనుక ఆసక్తికర చరిత్ర.!
Children’s Day: భారత్‌లో బాలల దినోత్సవాన్ని ఏటా నవంబర్ 14న జరుపుకుంటారు. ఇది దేశ మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు. ఈ ఏడాది శనివారం ఈ రోజు వచ్చింది. కానీ ప్రపంచంలో చాలా దేశాలు పిల్లల హక్కుల కోసం నవంబర్ 20న యూనివర్సల్ చిల్డ్రన్స్ డే జరుపుకుంటాయి. భారత్ మాత్రం భిన్నంగా నవంబర్ 14ను ఎందుకు ఎంచుకుంది అనేది చాలామందికి వచ్చే సందేహం.
ఐక్యరాజ్యసమితి సాధారణ సభ 1954 డిసెంబర్ 14న 836(IX) తీర్మానం ద్వారా అన్ని దేశాలు నవంబర్ 20న యూనివర్సల్ చిల్డ్రన్స్ డే జరపాలని సూచించింది. ఈ తీర్మానాన్ని భారత్, ఉరుగ్వే సంయుక్తంగా ప్రతిపాదించాయి. 1959 నవంబర్ 20న పిల్లల హక్కుల ప్రకటనను, 1989 నవంబర్ 20న పిల్లల హక్కుల ఒప్పందాన్ని ఐరాస ఆమోదించిన రోజు కూడా ఇదే. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున పిల్లల హక్కుల కోసం కార్యక్రమాలు జరుగుతాయి.
మొదట భారత్ కూడా ఐరాస సూచనను అనుసరించి నవంబర్ 20న బాలల దినోత్సవం జరుపుకునేదని చాలా రిపోర్టులు చెబుతున్నాయి. నెహ్రూ 1964 మే 27న మరణించిన తర్వాత పార్లమెంటు ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఆయన పుట్టినరోజైన నవంబర్ 14ను బాలల దినోత్సవంగా ప్రకటించిందని ఆ రిపోర్టులు పేర్కొంటున్నాయి. పిల్లలు ఆయన్ను 'చాచా నెహ్రూ' అని ప్రేమగా పిలిచేవారు. పిల్లలే దేశ నిజమైన బలం, సమాజానికి పునాది అని ఆయన భావించేవారు.
అయితే ఈ చరిత్రపై మరో వాదన కూడా ఉంది. నెహ్రూ బతికి ఉండగానే 1957లో ప్రభుత్వ ఉత్తర్వుతో నవంబర్ 14ను అధికారికంగా బాలల దినోత్సవంగా ప్రకటించారని కొన్ని రిపోర్టులు చెబుతున్నాయి. 1957 నవంబర్ 14న చేసిన ప్రసంగంలో ఆ రోజును తన పుట్టినరోజుగా కాకుండా బాలల దినోత్సవంగా జరపాలని నెహ్రూ చెప్పినట్లు నెహ్రూ ఆర్కైవ్స్‌లో గమనిక ఉందని కూడా ఒక సైట్ పేర్కొంది. అందుకే 1964 తర్వాతే తేదీ మారిందని ఖచ్చితంగా చెప్పలేమని ఆ సైట్ అభిప్రాయం.
నవంబర్ 14న దేశవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీల్లో డ్యాన్స్, డ్రామా, సంగీతం, క్విజ్ పోటీలు నిర్వహిస్తారు. పిల్లల హక్కులు, విద్య, సంరక్షణపై అవగాహన కల్పించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. నెహ్రూ పుట్టినరోజు కాబట్టి భారత బాలల దినోత్సవం ఒక జాతీయ వేడుక. నవంబర్ 20న ఐరాస యూనివర్సల్ చిల్డ్రన్స్ డే ప్రపంచ స్థాయి పిల్లల హక్కుల రోజు. ఈ రెండు వేర్వేరు రోజులని గుర్తుంచుకోవాలి.




