Viral Video : గాల్లో ఊగలాడిన ప్రాణాలు.. ఒక్కసారిగా 300 అడుగులు కిందకు..!
Viral Video : విమానంలో ప్రయాణించేటప్పుడు "సీట్‌బెల్ట్ ధరించండి" (Fasten your seatbelts) అనే హెచ్చరిక వినడం ఎవరికైనా సాధారణమే. కానీ, థాయిలాండ్‌లోని ఫుకెట్
Viral-Air-India
Viral Video : విమానంలో ప్రయాణించేటప్పుడు "సీట్‌బెల్ట్ ధరించండి" (Fasten your seatbelts) అనే హెచ్చరిక వినడం ఎవరికైనా సాధారణమే. కానీ, థాయిలాండ్‌లోని ఫుకెట్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో మంగళవారం ప్రయాణికులకు ఈ మాటలు నభూతో నభవిష్యత్ అనేలా భయాన్ని కలిగించాయి. ఆకాశంలో ఊహించని విధంగా విమానం తీవ్రమైన గాలి తుఫానుకు (Extreme Turbulence) గురై, భారీ ఊపే ఊపడంతో నలుగురు కేబిన్ సిబ్బంది సహా మొత్తం 17 మంది తీవ్రంగా గాయపడ్డారు.
సీలింగ్‌ను తాకి కిందపడ్డ ప్రయాణికులు
ప్రమాదం జరిగిన సమయంలో విమానం ఉన్నపళంగా దాదాపు 300 అడుగుల కిందకి పడిపోయింది. ఆ సమయానికి సీట్‌బెల్ట్ సైన్ ఆఫ్‌లో ఉండటంతో చాలామంది ప్రయాణికులు బెల్టులు పెట్టుకోలేదు. దీంతో విమానం ఒక్కసారిగా కిందకి పడిపోగానే, సీట్లలో కూర్చున్న వారు గాల్లోకి లేచి విమానం సీలింగ్‌ను (పైకప్పును) బలంగా తాకి కింద పడిపోయారు.
ఓ ప్రయాణికుడు తన అనుభవాన్ని పంచుకుంటూ.. "మా నాన్న కాఫీ తాగుతున్న సమయంలో ఒక్కసారిగా భారీ జలక్ ఇచ్చింది. ఆయన గాల్లోకి లేచి సీలింగ్‌ను తాకి నేలపై పడిపోయారు. నా భార్య, మూడేళ్ల చిన్నారి కూడా గాల్లోకి లేచి సీట్ల మధ్య ఉండే దారిలో పడిపోయారు. ఇది మాకు రెండో జన్మ లాంటిది" అని కంటతడి పెట్టారు. మరొక ఇటలీ ప్రయాణికురాలు వివియానా మాట్లాడుతూ.. "మేము ఇక బ్రతకమేమో అని భయపడిపోయాం" అని తన భీతావహ అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు.
విమానం లోపల భయానక దృశ్యాలు
ప్రమాద తీవ్రతకు విమానం లోపల ఉన్న లగేజీ బాక్సుల తలుపులు విరిగిపోయి, లగేజీ సంచులు ప్రయాణికులపై పడ్డాయి. పసిపిల్లలు, మహిళల రోదనలతో విమానమంతా అరుపులు, కేకలతో నిండిపోయింది. అత్యవసర పరిస్థితుల్లో ధైర్యంగా ఉండే వ్యోమగాములు, కేబిన్ సిబ్బంది కూడా భయాందోళనకు గురయ్యారు. ఒక ఎయిర్ హోస్టెస్ గట్టిగా అరుస్తుండగా, మరొకరు పబ్లిక్ మైక్‌లో "దయచేసి అందరూ సీట్‌బెల్టులు పెట్టుకోండి" అని పదే పదే అభ్యర్థించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్న మిన్చెన్ అనే ప్రయాణికురాలు.. తన జీవితంలో అత్యంత భయంకరమైన రెండు గంటలు ఇవేనని పేర్కొన్నారు. విమానంలో సీట్‌బెల్ట్ సైన్ ఆఫ్ అయినప్పటికీ ప్రయాణమంతా బెల్ట్ ధరించడమే సురక్షితమని ఆమె అందరికీ విజ్ఞప్తి చేశారు.
క్షేమంగా ల్యాండింగ్.. ఆసుపత్రుల్లో చికిత్స
అన్ని అడ్డంకులను దాటుకుని విమానం (AI2379) ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అవ్వడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ల్యాండ్ అయిన వెంటనే విమానాశ్రయంలోని మేదాంత వైద్య బృందం గాయపడిన వారికి ప్రాథమిక చికిత్స అందించింది. తీవ్రంగా గాయపడిన ఏడుగురు ప్రయాణికులను వసంత్ కుంజ్‌లోని ఫోర్టిస్ ఆసుపత్రి అత్యవసర విభాగంలో చేర్చారు. వారికి సీటీ స్కాన్‌లు, ఎంఆర్‌ఐలు నిర్వహిస్తూ వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అత్యంత క్లిష్టమైన సమయంలోనూ పైలట్, కేబిన్ సిబ్బంది ధైర్యం చెప్పి పరిస్థితిని అదుపు చేయడానికి ప్రయత్నించారని ప్రయాణికులు ప్రశంసించారు. అయితే, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా విమానయాన భద్రతపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.




