Gajwel: శేరిపల్లి స్వాగత ఆర్చిని ప్రారంభించిన బీఆర్ఎస్ నేత!

Gajwel: సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం శేరిపల్లిలో స్వాగత ఆర్చిని బీఆర్ఎస్ నేత వంటేరు ప్రతాపరెడ్డి ప్రారంభించారు.

Osman Pathan, GAJEWL
Published on: 28 Nov 2026 11:22 AM IST
Gajwel
X

Gajwel: శేరిపల్లి స్వాగత ఆర్చిని ప్రారంభించిన బీఆర్ఎస్ నేత!

Gajwel: సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం శేరిపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో గ్రామ శివారులో నూతనంగా నిర్మించిన స్వాగత ఆర్చిని గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జి వంటేరు ప్రతాపరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ యర్ర పావని మోహన్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వంటేరు ప్రతాపరెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పదేళ్ల పాలనలో గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చి, వాటిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు.

గ్రామాల్లో నూతన గ్రామపంచాయతీ భవనాల నిర్మాణం, తడి–పొడి చెత్త సేకరణకు ట్రాక్టర్ల ఏర్పాటు, పల్లె ప్రకృతి వనాల అభివృద్ధి, మురుగునీటి కాలువల నిర్మాణం, 24 గంటల విద్యుత్ సరఫరా, ఇంటింటికీ తాగునీటి సౌకర్యం కల్పించినట్లు పేర్కొన్నారు. ఆశా కార్యకర్తల ద్వారా గర్భిణులకు పోషకాహారం, వైద్య సేవలు అందించి ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చారని వివరించారు.

హామీల అమలులో కాంగ్రెస్ విఫలం

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, అయితే వాటి అమలులో విఫలమైందని వంటేరు ప్రతాపరెడ్డి విమర్శించారు.

రైతులకు ఎకరానికి రూ.15 వేల పెట్టుబడి సాయం, కళ్యాణలక్ష్మి పథకం కింద తులం బంగారం, రూ.2 వేల పెన్షన్‌ను రూ.4 వేలకు పెంపు, దివ్యాంగుల పెన్షన్‌ను రూ.3 వేల నుంచి రూ.6 వేలకు పెంపు, ఆటో డ్రైవర్లకు ఏటా రూ.12 వేల సాయం, దళిత బంధు తరహాలో రూ.12 లక్షల ఆర్థిక సాయం వంటి హామీలను అమలు చేయకుండా ప్రజలను మభ్యపెడుతోందని ఆరోపించారు.

రైతులకు అండగా నిలిచిన కేసీఆర్

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా పథకాలతో పాటు సకాలంలో విత్తనాల పంపిణీ, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ద్వారా రైతులకు భరోసా కల్పించామని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, కాళేశ్వరం ప్రాజెక్టు, పరిశ్రమల ఏర్పాటు, విదేశీ పెట్టుబడుల రాకతో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనించిందని పేర్కొన్నారు.

వ్యవసాయ రంగం బలోపేతం కావడంతో పాటు వ్యవసాయ భూముల విలువ కూడా పెరిగిందన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని గుర్తు చేసుకుంటున్నారని ప్రతాపరెడ్డి అన్నారు.

కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ఎర్ర కొండల్‌రెడ్డి, ఉప సర్పంచ్ బీరయ్య, వార్డు సభ్యులు, సీనియర్ నాయకులు కొండల్‌రెడ్డి, సత్యనారాయణ, కుమార్, నర్సింలు తదితరులు పాల్గొన్నారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Osman Pathan, GAJEWL

Osman Pathan, GAJEWL