Siddipet: ప్రభుత్వ నిర్లక్ష్యానికి సిద్దిపేట సైన్స్ ఫెయిర్ నిదర్శనం: హరీశ్ రావు!

Siddipet: సిద్దిపేట జిల్లా సైన్స్ ఫెయిర్‌ను ప్రైవేట్ స్కూల్‌లో నిర్వహించడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని మాజీ మంత్రి హరీశ్ రావు గురువారం మండిపడ్డారు.

RAJU, SIDDIPET
Published on: 26 Nov 2026 6:02 PM IST
Siddipet
X

Siddipet: ప్రభుత్వ నిర్లక్ష్యానికి సిద్దిపేట సైన్స్ ఫెయిర్ నిదర్శనం: హరీశ్ రావు!

సిద్దిపేట జిల్లా: సిద్దిపేట జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం పూర్తిగా విఫలమయ్యాయని మాజీ మంత్రి, సిద్దిపేట శాసనసభ్యుడు హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం సిద్దిపేటలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు రూపొందించిన వివిధ సైన్స్ నమూనాలను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.

గత 12 ఏళ్లుగా సిద్దిపేట ప్రభుత్వ గర్ల్స్ హైస్కూల్ వేదికగా జిల్లా మొత్తం అద్భుతంగా సైన్స్ ఫెయిర్ నిర్వహించుకునే వాళ్లమని, కానీ నేడు ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించే శక్తి లేక ప్రైవేట్ స్కూల్‌లో పెట్టుకోవాల్సిన దుస్థితి రావడం అత్యంత బాధాకరం ఈ విషయంలో ప్రభుత్వానికి, జిల్లా కలెక్టర్‌కు, డీఈఓకు కనీస బాధ్యత లేకుండా పోయింది.

ఒకప్పుడు సైన్స్ రంగంలో సిద్దిపేట జిల్లా ప్రతి ఏటా రాష్ట్రంలోనే నంబర్ వన్‌గా ఉండి జాతీయ అవార్డులు సాధించేది. నేడు ప్రభుత్వ బాధ్యతారాహిత్యంతో ఆ గౌరవాన్ని పూర్తిగా దెబ్బతీశారు.

రాష్ట్రంలోని 33 జిల్లాల్లో మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రారంభించామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది. కానీ నిన్నటి వరకు సిద్దిపేట జిల్లాలో గానీ, నా నియోజకవర్గంలో గానీ ఒక్క బడిలో కూడా బ్రేక్‌ఫాస్ట్ పెట్టిన దాఖలాలు లేవు. అసలు ఆ పథకం ఎక్కడ అమలవుతోందో ప్రభుత్వం సమాధానం చెప్పాలి.

విద్యా సంవత్సరం ప్రారంభమై నెలలు గడుస్తున్నా, అప్పుడే డిసెంబర్ నెలలోకి అడుగుపెడుతున్నా ఇప్పటికీ విద్యార్థులకు యూనిఫాం బట్టలు రాలేదు. ఎస్సీ గురుకుల పాఠశాలలకు వెళ్లి చూస్తే నాలుగు జతల బట్టలకు గాను కేవలం ఒక్క జత మాత్రమే ఇచ్చారు. విద్యా సంవత్సరం ముగిసిపోతుంటే ఇంకెప్పుడు బట్టలు ఇస్తారు?గత ఏడాది నుంచి పాఠశాలల్లో పనిచేసే స్కావెంజర్లకు డబ్బులు రాలేదు, ఈ ఏడాది కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది. గత మూడేళ్లలో ఒక్క అదనపు తరగతి గది కూడా నిర్మించలేదు. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'మన ఊరు - మన బడి' కార్యక్రమాన్ని అర్ధాంతరంగా నిలిపివేశారు.

సైన్స్ ఫెయిర్ నిర్వహణ పద్ధతులు ఏమాత్రం బాగోలేవు. అన్ని పాఠశాలల నుంచి విద్యార్థులు పాల్గొనేలా ప్రోత్సహించాలి, వారికి సరైన వసతులు, భోజన ఏర్పాట్లు కల్పించాలి.

జిల్లాలో యూనిఫాం బట్టలు రాకపోవడం, స్కావెంజర్ నిధులు పెండింగ్‌లో ఉండటం, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ పథకం అమలు కాకపోవడం వంటి అంశాలన్నింటినీ నా మాటగా పేర్కొంటూ వెంటనే ప్రభుత్వానికి, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌కు లేఖ రాయాలని డీఈఓ గారిని కోరుతున్నాను.

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని, ఆలోచనా సామర్థ్యాన్ని, నైపుణ్యాలను వెలికితీయడానికి సైన్స్ ఫెయిర్లు ఒక గొప్ప వేదిక. ఇవాళ మీరు చిన్న పిల్లలే కావచ్చు కానీ, మీలో గొప్ప శాస్త్రవేత్తలు దాగి ఉన్నారు. మీ మెదడులో పుట్టే చిన్న చిన్న ఆలోచనలే రేపు ప్రపంచానికి ఉపయోగపడే పెద్ద ఆవిష్కరణలుగా మారుతాయి.

మనం నేడు ఉపయోగిస్తున్న టెలిఫోన్ సహా ఎన్నో అద్భుత ఆవిష్కరణలు శాస్త్రవేత్తల మేధస్సు నుంచి వచ్చినవే. చదువుతో పాటు ఇలాంటి ఆవిష్కరణల్లో భాగస్వామ్యం కావడం ద్వారా విషయ పరిజ్ఞానం మరింత పెరుగుతుంది. విద్యార్థులందరూ భవిష్యత్తులో మరిన్ని చక్కటి ఆవిష్కరణలతో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు.

RAJU, SIDDIPET

RAJU, SIDDIPET